జమ్మూ: జమ్మూ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల విమానాశ్రయంలోని టికెట్ కౌంటర్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరగగానే ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఎమర్జెన్సీ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. ఐదు అగ్నిమాపక వాహనాలు వచ్చి జమ్మూ విమానాశ్రయంలో రాజుకున్న మంటలను అదుపు చేశాయని సత్వారీ పోలీసు ఇన్స్పెక్టరు నిషత్ గుప్తా చెప్పారు. విమానాశ్రయంలో టికెట్ కౌంటర్లలో మంటలు రాజుకున్న గంటలోపే ఆర్పామని, ఈ అగ్నిప్రమాదం వల్ల విమానాల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం వాటిల్లలేదని జమ్మూ విమానాశ్రయ డైరెక్టరు ప్రవత్ రంజన్ చెప్పారు. దగ్థం అయిన టికెట్ కౌంటర్లకు బీమా కంపెనీల నుంచి నష్టపరిహారం వస్తుందని డైరెక్టరు చెప్పారు.ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm