హైదరాబాద్ : ఇప్పటికే కరోనా కేసులతో వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో షాక్ తగిలింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ దాఖలు కాగా ఇప్పుడు అలాంటిదే మరో పిటిషన్ దాఖలైంది. అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తున్నారని అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరిత్ర వక్రీకరణ జరిగిందన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్ పోలీసుగా చూపడం దారుణమని అన్నారు. దీనిపై సినిమా మేకర్స్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. అల్లూరి, కొమురం భీమ్ లు కలిసినట్టు చరిత్రలో లేదన్నారు. ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించలేదని రాజమౌళి ఎప్పుడో చెప్పారు. చాలా సంవత్సరాలు, ఆ ఇద్దరి జీవితంలో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదని.. ఆ తెలియని సంవత్సరాలను ఆధారం చేసుకుని తన కథను సినిమాగా తీస్తున్నానని రాజమౌళి చెప్పాడు.
Recomended For You