హైదరాబాద్ : హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. గంట వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఒక మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పేట్ బషీరాబాద్ పరిధిలో మరో దొంగ మూడు చైనింగ్ స్నాచింగ్‌లకు పాల్పడగా ఒకటి విఫలమైంది. ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. మరో మహిళ వద్ద నుంచి బంగారు గొలుసు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.
రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు చోరీ జరిగినట్టు తెలిసింది. అలాగే జీడిమెట్లలో మరో మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో వదిలేసి పారిపోయినట్లు సమాచారం. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం గంట వ్యవధిలోనే నాలుగు చైన్ స్నాచింగ్‌లు జరగడంతో నగరంలో కలకలం రేపాయి.
Recomended For You