హైదరాబాద్: రెండు రోజులు పెళ్లి పీటలపై కూర్చుంటాడా డాక్టర్. దసరా ఉత్సవాలతో పాటు అతని ఇంట్లో పెళ్లి వేడుక కూడా ప్రారంభం కాబోతుంది. అతని కుటుంబం పెళ్లి పనుల్లో హడావిడిగా ఉంది. ఈ లోగా డాక్టర్ సెల్‌ఫోన్‌కు వాట్సప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్.. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పంపించింది. ఆ మెసేజ్, అందులో వచ్చిన ఫొటోను చూసిన ఆ డాక్టర్ హితేష్ శర్మ ముఖంలో నెత్తుటి చుక్కలేదు. నేరుగా తన గదికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ- ఏముందా మెసేజ్‌లో? తనతో పాటు జీవితాన్ని పంచుకోబోయే అమ్మాయి.. వేరే యువకుడిని పెళ్లి చేసుకున్న ఫొటో అది. దాని కింద రాసిన మేటర్.. 'ఇతను నా భర్త..'అని. దీనితో- ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకున్న విషాదకర ఘటన ఇది. ఇండోర్‌లో స్థానికంగా ఓ క్లినిక్‌ను నెలకొల్పాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. భోపాల్‌కు చెందిన ఓ అమ్మాయితో అతనికి పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం కూడా పూర్తయింది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న సమయంలో తాను పెళ్లి చేసుకోబోయే యువతి.. వేరే యువకుడిని వివాహమాడినట్టు వచ్చిన ఫొటోను చూసి.. అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. హితేష్ శర్మ తండ్రి కృష్ణకాంత్ శర్మ ఆ యువతి, ఆమె తల్లిదండ్రులపై ఇండోర్ విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm