హైదరాబాద్: ఇటలీలోని టెర్రాచినా ప్రాంతంలో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. వందల మంది ఆసక్తిగా తిలకిస్తుండగానే ఓ జెట్ విమానం సముద్రంలో పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటాలియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఈ జెట్ విమానం అప్పటి వరకు వివిధ విన్యాసాలు ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకుంది. చివరగా -ఫ్రెచ్చె టెర్రాచినా- అనే విన్యాసం ప్రదరిస్తుండగా అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ విమానం ఆచూకీని గుర్తించడంలో కొద్దిగా ఆలస్యం జరిగింది. దీంతో పైలెట్ మృతదేహాన్ని మాత్రమే అధికారులు వెలికితీయగలిగారు. అయితే ప్రమాదం జరగడానికి స్పష్టమైన కారణాలు ఇటాలియన్ ఎయిర్‌ఫోర్స్ అంచనా వేయలేకపోతోంది. దీనిపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm