సిడ్నీ: ఉసేన్ బోల్ట్ ఏంటి? ఆస్ట్రేలియా టీమ్‌లో ఉండటం ఏంటి అనుకుంటున్నారా? అదంతే.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్‌ను కూడా తమ సపోర్ట్ టీమ్‌లో మెంబర్‌ను చేసేసింది ఆస్ట్రేలియా. ఈ పరుగుల చిరుత సహాయంతో వికెట్ల మధ్య తమ క్రికెటర్ల పరుగు వేగం పెంచాలన్నది ఆస్ట్రేలియా టీమ్ లక్ష్యం. 100, 200 మీటర్ల వరల్డ్ రికార్డు సృష్టించిన బోల్ట్.. 8 సార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన విషయం కూడా తెలిసిందే. దీంతో క్రికెటర్లు వేగంగా పరుగెత్తాలంటే ఏం చేయాలన్నదానిపై విలువైన సూచనలు అతని నుంచి తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ జమైకా చిరుత క్రికెటర్లలో ఉండే ప్రధాన లోపాన్ని చెప్పేశాడు. పరుగు అందుకునే సమయంలో క్రికెటర్లు నెమ్మదిగా ఉంటారని, అక్కడే అసలు సమస్య ఉందని బోల్ట్ చెప్పాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే క్రికెటర్లు కూడా వేగంగా పరుగెత్తగలుగుతారని అతనన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా పరుగెత్తాలన్నదానిపై తాను క్రికెటర్లలో అవగాహన పెంచుతున్నట్లు బోల్ట్ తెలిపాడు
Mon Jan 19, 2015 06:51 pm