చిన్నచిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారుచేస్తాయిఃః అనే ప్రసిద్ధ నానుడి ఉంది. అంటే అర్ధం మీరు తక్కువ సమయంలో చిన్న మొత్తంతో మొదలుపెట్టి దీర్ఘకాలంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయవచ్చు. ఇలా చేయాలంటే కచ్చితమైన ప్రణాళిక అవసరం. ఆదాయాన్ని, ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించే వారు మాత్రమే బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు. ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. అందుకే ముందు ఒక బడ్జెట్ తయారుచేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చుల ప్రణాళిక వేసుకుని, ఒక డైరీలో రాసుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దీనికి సంబంధించిన ఓ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే, అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్నచిన్న ఖర్చులను లేక్కచేయం. కానీ అలాంటి చిన్న ఖర్చులే చివరకు పెద్ద మొత్తంగా మారి కష్టాల్లోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అందుకే డబ్బును ఆదా చేసే పది సలహాలు మీ కోసమే...
నెలవారి సరుకుల లిస్టు : మీ ఇంటికి నెలకు సరిపడా సరుకుల జాబితాను తయారు చేసుకుని బడ్జెట్ వేసుకోండి. లేదంటే షాపుకు వెళ్ళినప్పుడు అవసరంలేని వస్తువులు కూడా కొంటారు. అందుకే ఒక జాబితా తయారుచేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరంలేని వస్తువులను కొనకుండా ఉండవచ్చు. పండుగ సీజన్లలో లేదా అతిధులను ఆహ్వానించినపుడు మరో జాబితాను పరిగణలోనికి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది.
పోల్చుకోండి: ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువయింది. ప్రతీది ఆన్లైన్లో దొరుకుతుంది. ఆన్లైన్లో కొనేవాటికి, విడిగా కోనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏమైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చి చూసుకోండి. ఉదాహరణకు మీరు ఒక మొబైల్ కొనాలి అనుకుంటే, ఒక్క ధర మత్రమే కాకుండా ఆన్ లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తుంటాయి. వాటిని వినియోగించుకోండి.
మందులపై ఆదా: మీరు మందులు కొనుగోలు చేసేటపుడు మీ బిల్ పై కొంత తగ్గింపు వచ్చే దుకాణాలలో కొనుగోలు చేయండి. అలాంటి ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు. మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారు మీకు ఒక లాగిన్ ఇస్తారు. పన్ను రిటర్నులు సమర్పించేటపుడు దీన్ని చూపించుకోవచ్చు. ఇటీవల చాలా రాష్ట్రాల్లో జనరిక్ దుకాణాలు ప్రారంభిస్తున్నారు. వీటిని సైతం కొనుగోలు చేసి మీ బిల్లును తగ్గించుకోవచ్చు.
విలాసాలకు ఒక ప్రణాళిక: మీరు వారాంతరంలో కాస్త సరదాగా గడపాలనుకుంటారు. డిన్నర్‌కో, మూవీకో వెళ్ళాలనుకుంటారు. అయితే అనుకున్న వెంటనే ఎలాంటి ప్లాన్ లేకుండా వెళ్ళిపోవద్దు. ఏ రెస్టారెంట్లలో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో సమాచార జాబితాను కొన్ని వెబ్ సైట్లలో పరిశీలించుకోండి. సినిమా టికెట్లు బుక్ చేసే ముందు మీ కార్డ్స్ పై ఎమైనా ఆఫర్లు ఉన్నాయేమో చూసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టై అప్ ఉంది.
ఆఫర్ల కోసం తనిఖీ చేయండి:
మీరు ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురుచూడండి. పండగ సీజన్లలో ఈ ఆఫర్లు అందు బాటులో ఉంటాయి. పండగ సమయాలలో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని వస్తుమార్పిడి ఆఫర్లు కూడా ఉంటాయి. పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతకే ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే వీటికోసం మళ్ళీ మళ్ళీ ఖర్చు చేసే అవసరం రాకూడదు.
అవసరంలేని వస్తువులను అమ్మడం: డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది ఇంట్లో పడివున్న అనవసరమైన వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే, వస్తువులను అమ్మేటపుడు తెలివి అవసరం. ఇటీవల ఓఎల్ఎక్స్ లాంటి వెబ్సైట్లు పాత వస్తువులను అమ్మడాన్ని సులభతరం చేశాయి. అలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోండి.
క్రెడిట్ కార్డ్స్ వాడకంలో జాగ్రత్త : క్రెడిట్ కార్డు అత్యవసరా ల్లోనే వాడండి. అవును, ఇది ప్రతి ఒక్కరికీ చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడం చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం అనవసరమైనవి కొనుగోలు చేయకుండా ఉండడం. క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే, మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్‌లో ఉంచితే అవసరమైనపుడు వాడుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ లాంటి వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది.
విలాస వస్తువుల వాడకంలో అప్రమత్తత: సాధ్యమైనంత వరకు కారుకు బదులు బైకును వాడండి. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్నే ఎంచుకోండి. ఇందుకు మీరు సమయ పాలన పాటించడం అవసరం. ఈ చిన్ని చిన్ని అంశాలు మీ ఇంధన చెల్లింపులను తగ్గించడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నగదు రూపంలో ఉంచొద్దు: మీ చేతిలో డబ్బు ఉంటే అదాయం వచ్చే పని కోసం పెట్టుబడి పెట్టండి. అనేక బ్యాంకులు ఆటో స్వీప్ సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. అంటే మీ అకౌంట్ కొంత మొత్తానికి నిర్దేశిస్తే దానంతట అదే ఆ మొత్తం డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందవచ్చు.
మీ ఆర్ధిక నైపుణ్యాలను పెంపొందించుకోండి: అవును, ఆర్ధికపరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయ పడుతుంది. ముఖ్యంగా ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 04:10PM