హైదరాబాద్: రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా?అని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ అన్ని రాజకీయ పార్టీలకూ సవాల్ విసిరారు. అధిక జనాభా ఉన్నోళ్లకు ఆ పదవి ఇవ్వడమే సామాజిక న్యాయమని అన్నారు. బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన రాజకీయ పార్టీలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక న్యాయం కాదని చెప్పారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వడమే నిజమైన సామాజిక న్యాయమని అన్నారు. ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయం అవుతుందని చెప్పారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు. బీఎల్ఎఫ్ వచ్చే ఎన్నికల్లో బీసీలకు 65 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తుందని అన్నారు. మిగతా రాజకీయ పార్టీలు అన్ని సీట్లు ఇస్తుందా?అని ప్రశ్నించారు. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్లు ఉండాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm