గాంధీనగర్: గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిపై కేసు నమోదైంది. ప్రైవేటు పాఠశాలను తప్పుపట్టే విధంగా ఒక నకిలీ వీడియోను షేర్ చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వడగాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న జిగ్నేష్ మేవాని మే 20న తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అర్థ నగ్నంగా ఉన్న విద్యార్థులను కొందరు కొడుతున్నారని జిగ్నేష్ రాసుకొచ్చారు. అందులో ఆర్ఎమ్వీఎమ్ అనే ఓ ప్రైవేటు స్కూలు టీచర్ కూడా ఉన్నారని జిగ్నేష్ ఆరోపించారు.అయితే ఈ వీడియోపై స్పందించిన సదరు పాఠశాల ప్రిన్సిపాల్ విజల్ కుమారి పటేల్.. గురువారం పోలీసులను సంప్రదించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోకు తమకు సంబంధం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విజల్ కుమారి పేర్కొన్నారు. మేవానిపై ఐపీసీ సెక్షన్ 505 (2) (పుకార్లను సృష్టించి తప్పుడు ప్రచారం చేయడం), సెక్షన్ 500 (పరువు నష్టం) ప్రకారం కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm