హైదరాబాద్ : ఎలాంటి ప్రదేశమైనా అక్రమసంబంధాలకు అడ్డులేదంటూ సీఎం కేసీఆర్ కు చెంది ఫాంహౌస్ లోనూ వివాహేతర సంబంధాల గొడవ గుప్పుమంది! ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ కు విశాలమైన వ్యవసాయభూమి ఉంది. అందులో ఆయన అన్ని సదుపాయాలతో ముచ్చటపడి ఫాంహౌస్ నిర్మించుకున్నారు. పరిపాలన కార్యక్రమాల ఒత్తిడి నుంచి సేదదీరేందుకు కేసీఆర్ తరచుగా ఎర్రవల్లి వెళుతుంటారు. ఆ ఫాంహౌస్ లో ఎంతోమంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఆ ఫాంహౌస్ ఓ వివాహేతర సంబంధం కారణంగా అనూహ్యరీతిలో తెరపైకి వచ్చింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య, అతని భార్య కేసీఆర్ ఫాంహౌస్ లో పనికి కుదిరారు. అయితే, అప్పటికే ఫాంహౌస్ లో విధులు నిర్వర్తిస్తున్న అంజనేయులు అనే వ్యక్తి తన భార్యతో అక్రమసంబంధం ఏర్పరచుకున్నాడని ఎల్లయ్య ఆరోపిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం తన భార్యకు ఆంజనేయులు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లాడని ఎల్లయ్య ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. ఎల్లయ్య తన భార్య కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లలో కూడా వెతికాడు. చివరికి పోలీసులను ఆశ్రయించగా, నీ భార్య వస్తుందిలే పో అంటూ పంపించివేశారు. అయితే, తనకు న్యాయం చేయాలంటూ ఓ వీడియో రూపొందించిన ఎల్లయ్య సోషల్ మీడియాలో పెట్టడంతో దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో, పోలీసులు తనను ఇంటికి వచ్చి మరీ కొట్టారంటూ ఎల్లయ్య ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసులు భిన్నవాదన వినిపిస్తున్నారు. ఎల్లయ్య వేధింపులు భరించలేక అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని గజ్వేల్ సీఐ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm