లండన్: ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ పద్ధతి బాగోలేదని పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ అభిప్రాయ పడ్డాడు. యాషెస్ రెండో టెస్టులో ఆర్చర్ వేసిన రాకాసి బంతికి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు బలమైన గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గాయపడ్డ స్మిత్‌ను ఆర్చర్ పరామర్శించకుండా నవ్వుతూ ఉన్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆర్చర్ ప్రవర్తించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా షోయబ్ అక్తర్ ట్విటర్లో స్పందించాడు. ఆర్చర్ స్థానంలో తాను ఉండి ఉంటే ముందుగా బ్యాట్స్‌మన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి గాయాన్ని పరిశీలించేవాడిని అని పేర్కొన్నాడు. 'గేమ్‌లో బౌన్సర్ ఒక భాగం. కానీ దాని వల్ల బ్యాట్స్‌మన్‌కు గాయమై కుప్పకూలితే.. బౌలర్ అతడి వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాలి. నొప్పితో బాధపడుతున్న స్మిత్‌ను ఆర్చర్ పరామర్శించకుండా దూరంగా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. నేను అతడి స్థానంలో ఉంటే ముందుగా బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లి పరామర్శించేవాడిని.' అని ట్విట్ చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm