వెల్లింగ్టన్: అమీ శాటర్త్వైట్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు సారథి. లీ తహూహూ అదే జట్టులో సీనియర్ బౌలర్. వీరిద్దరి మనసులు కలిశాయి. కట్టుబాట్లను విడనాడారు. అందర్నీ ఎదిరించారు. ప్రపంచంలోనే పెళ్లి చేసుకున్న తొలి మహిళల క్రికెట్ జంటగా చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ దంపతులు ఓ తీపి కబురు చెప్పారు. ఏంటో తెలుసా? లీ తహూహూ ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. లీ, నేను ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. కొత్త ఏడాదిలో మా జీవితాల్లోకి తొలి చిన్నారి రాబోతోంది. మా జీవితాల్లో ఇదొక ప్రత్యేక సమయం. ఈ కొత్త అధ్యాయం కోసం మేం ఎదురు చూడలేకపోతున్నాం అని అమీ ఇన్స్టాలో వెల్లడించింది. బేబీ శాటర్ హుహు 2020 జనవరిలో రాబోతోందని ఓ చిత్రాన్ని ఉంచింది. ఈ సందర్భంగా శాటర్వైట్కు సైతం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వేతనంతో కూడిన మాతృత్వపు సెలవును మంజూరు చేయడం విశేషం. అయితే ఏ పద్ధతుల ద్వారా వీరు బిడ్డకు జన్మనిస్తున్నారో వెల్లడించలేదు.
Mon Jan 19, 2015 06:51 pm