దిస్పూర్: అసోంలోని నయగ్రమ్ గ్రామానికి చెందిన దిల్వర్ హుస్సేన్ లస్కర్ అనే యువకుడు, రవీనా అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. రెండు వైపుల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో పాటు పెళ్లి తేదీని కూడా నిర్ణయించారు. అంతా సంతోషంగా పెళ్లి పనులు చేసుకుంటుండగా నెల తర్వాత వచ్చి ఈ పెళ్లి జరగదంటూ వధువు తండ్రి కుతుబ్ వరుడి కుటుంబసభ్యులకు చెప్పాడు. జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ)లో నమోదు కాని వ్యక్తితో తన కూతురి వివాహం జరిపించనని వధువు తండ్రి కుతుబ్ అన్నాడు. అతనితో వివాహం చేస్తే ఆమె పౌరసత్వం కూడా ప్రశ్నార్థకమవుతుందన్నాడు. ఎన్ఆర్సీ తుది జాబితా ఇప్పటికీ విడుదల అవ్వలేదని ఇంకా అవకాశం ఉందని చెప్పినా వధువు తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. కారణం తెలుసుకున్న వరుడి కుటుంబసభ్యులు అతనికి నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా అంగీకరించకపోవడంతో వధూవరులు దిల్వర్, రవీనా శనివారం ఇంటి నుంచి పారిపోయారు. దీంతో దిల్వర్ తన కుమార్తెను అపహరించాడని కుతుబ్ సిల్చర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm