ముంబై: తనను వేధించినోడిని.. ఆమె తేలిగ్గా వదిలిపెట్టలేదు. ధైర్యంగా వెంటాడింది. అతడు ఎక్కడుంటాడో తెలుసుకుంది. తనవారి సహాయంతో పోలీసులకు అప్పగించింది. ముంబైలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ నగర్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎయిర్ పోర్టులో పనిచేసే సదరు మహిళ విధులు ముగించుకుని రాత్రి 9గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరింది. ఈ సమయంలో అటుగా వెళుతున్న దినేశ్ యాదవ్ అనే 26 ఏళ్ల యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఐటెం అంటూ పిలుస్తూ.. వెకిలి వేషాలేశాడు. అతడి మాటలకు బాధపడుతూ కూర్చోకుండా ఆమె వెంటపడింది. ఎలాగోలా అతని అడ్రస్‌ను కనుక్కొంది. వెంటనే తన భర్తకు, తల్లిదండ్రులకు, సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కొద్దిసేపటికి వారందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితుడు దినేశ్ యాదవ్‌ను పట్టుకుని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm