హైదరాబాద్ : చైనాలో అద్భుతం జరిగింది. పెను ప్రమాదంలో చిక్కుకున్న ఓ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. మన్సాన్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ కూడలి వద్ద స్కూటీపై సదరు మహిళ రోడ్డు దాటుతోంది. ఇంతలో ఎదురుగా వస్తున్న ఓ కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె కింద పడి స్పృహ కోల్పోయింది. దారిన పోయే వారు ఆమెను రక్షించేలోపే ఊహించని మరో ప్రమాదం జరిగింది. అచేతనంగా పడి ఉన్న ఆమెపై నుంచి మరో ఎస్యూవీ వాహనం వెళ్లింది. అయితే చుట్టుపక్కల ఉన్న వారు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో అతడు కారుని నిలిపివేశాడు. అనంతరం కారు కింద చిక్కుకున్న ఆమెను వారు కాపాడి ఆసుపత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ దారుణానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని కొందరు మండిపడుతుంటే..ఆమె మృత్యువును జయించిందని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm