ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో భూస్వాముల దౌర్జన్యాలకు ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||