Tue 28 Jul 17:51:06.719118 2020 మోసుకెళ్ళాలె మోత ఎంతైనా కుప్పలుగా పడివున్న విజ్ఞాన నిధులను ఒక్క భుజం మీద తీసుకెళ్ళాలె దిక్కులు చప్పట్లు చరుస్తుంటే. చూసుకోవాలె దృశ్యమెంతైనా చూసిన ప్రతి చురుకు చూపులో సరికొత్త దృశ్యాలు పైకిలేచి నేత్రాలకు స్వాగతం పలుకుతుంటే. పరుగులెత్తాలె దూరమెంతైనా పరుగులను లెక్కపెడుతున్న మైలురాళ్ళు తాము నిశ్చలంగా వుంటూనే పురోగాములై లంఘిస్తుంటే. పాడుకోవాలె వేళ ఎంతైనా పాటతో తమ శ్రుతుల కలిపి సరికొత్త సృరధారలు వినూత్న చైతన్యాన్ని వినిపిస్తుంటే. ఎగిరిపోవాలె ఎంతెంత పైకైనా ఉడ్డీన చేతనకు విభ్రమించి మూగ చుక్కల ముఖాలు ముందుకొచ్చి వెలుతురు ఈలలు వేసేస్తుంటే. - డాక్టర్ సి.నారాయణరెడ్డి