బంధాలను బలపరుచుకోవాలి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఐద్వా అదాలత్‌

బంధాలను బలపరుచుకోవాలి

చిన్నప్పటి నుండి ఒంటరి పోరాటం ఆమెకు అలవాటు. కష్టపడి చదువుకుంది. ఈ సమాజంలో నెగ్గుకు రాగలిగే ధైర్యాన్ని అలవాటు చేసుకుంది. స్నేహితుల ద్వారా పరిచయమైన వ్యక్తిని పెండ్లి చేసుకుంది. కాని అక్కడ ఆమె ఇమడలేక పోయింది. పెండ్లయిన ఆరు నెలలకే భర్తతో విడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. అసలు తన సమస్యేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
మేడమ్‌ నాపేరు వినూత్న. నాకు మూడు నెలలపుడు అమ్మ చనిపోయింది. నాన్న దగ్గర పెరిగాను. పదహారేండ్లు వచ్చే సరికి నాన్న కూడా చనిపోయాడు. తెలిసిన వాళ్ళ ఇంట్లో పెయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ ఉద్యోగం చేసుకునేదాన్ని. తోడు ఎవరూ లేక ఒంటరితనంతో ఏడుస్తూ ఉండేదాన్ని. నా స్నేహితులు నా బాధను చూసి ఓదార్చేవాళ్ళు. ధైర్యం చెప్పేవాళ్ళు.
మంచివాడని ఒప్పుకున్నాను
స్నేహితుల ద్వారా కృష్ణ పరిచయమయ్యాడు. అతనితో స్నేహం కుదిరింది. కృష్ణకు ముప్పై ఏండ్ల పైనే ఉంటాయి. అయినా అతనికి పెండ్లి కాలేదు. కారణం అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే ఎవరూ పెండ్లి చేసుకోవడం లేదు. మనిషి మాత్రం చాలా మంచి వాడు. వయసు ఎక్కువైనా మనిషి మంచి వాడని ఒప్పుకున్నా. నా స్నేహితులే కృష్ణ వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెండ్లికి ఒప్పించారు. ఏర్పాట్లు మొదలుపెట్టారు. పెండ్లికి నాలుగు రోజుల ముందు కృష్ణ నా దగ్గరకు వచ్చి కొంత మంది స్నేహితులను పెండ్లికి పిలవాలని నన్నూ తనతో రమ్మన్నాడు. కానీ పనులన్నీ నేనొక్కదాన్నే చూసుకుంటున్నా. దాంతో అతనితో వెళ్ళడానికి కుదురలేదు. దాంతో పెండ్లికూతుర్ని చేస్తుంటే కృష్ణ వచ్చి పెద్దపెద్దగా అరిచేశాడు. నాకు చాలా భయం వేసింది. అతను అలా వచ్చి అందరి ముందు కోప్పడడం అస్సలు నచ్చలేదు. దాంతో నాకీ పెండ్లి వద్దని చెప్పేశా.
పెండ్లి తర్వాత...
కృష్ణ వాళ్ళ అమ్మ వచ్చి 'నిన్ను నా కన్నకూతురిలా చూసుకుంటా, నా మాట నమ్ము' అని బతిమాలింది. దాంతో ఒప్పుకున్నా. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి అన్నీ కష్టాలే. కృష్ణ వాళ్ళ అమ్మ నన్ను నానా మాటలు అనేది. ప్రతి పనికీ వంక పెట్టేది. ఆఫీస్‌కి తప్ప ఎక్కడికీ వెళ్ళ నిచ్చేది కాదు. ఎవరితోనూ మాట్లాడనివ్వదు. మా మామగారు మాత్రం అప్పుడప్పుడు నన్ను సపోర్ట్‌ చేసేవారు. ఇలాంటి సమయంలోనే విదేశాల నుండి మా ఆడపడుచు వచ్చింది. ఆమె పెండ్లి చేసుకోకుండా విదేశాల్లో ఎవరితోనే సహజీవనం చేసేది. అందుకే మా మమయ్యకు కూతురంటే ఇష్టం లేదు. నన్ను మాత్రం ఎంతో అభిమానంగా చూసుకునేవారు. దాంతో మా ఆడపడుచుకు నేనంటే కోపం. ఇక అప్పటి నుండి మా అత్త, ఆడపడుచు కలిసి హింసించడం మొదలుపెట్టారు. కృష్ణకు చెబితే వాళ్ళ అమ్మ ఏం చెబితే అదే వినాలంటాడు. నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు.వీళ్ళ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు.
ఉద్యోగం మానేశానని
నేను గర్భవతినయ్యా. హాస్పిటల్‌లో చూపించడానికి కూడా నాతో ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. అదేమంటే మా అత్త 'నీకు అన్నీ తెలుసుగా ఆమాత్రం చేసుకోలేవా' అని మాట్లాడేది. నీరసంగా ఉండటంతో ఉద్యోగం మానేశా. దాంతో పనిమనిషిని మాన్పించి పనులన్నీ నాతోనే చేయించేవారు. మూడో నెలపుడు ఓ ఫంక్షన్‌లో నాతో బాగా పనులు చేయించారు. దాంతో కడుపు నొప్పి వచ్చింది. బ్లీడింగ్‌ కూడా అయింది. భయం వేసి హాస్పిటల్‌కు వెళతానన్నా. కాని మా అత్త తోడు రానంది. మా మమయ్య వస్తానంటే ఆమె ఒప్పుకోలేదు. దాంతో నేనొక్కదాన్నే వెళ్ళా. కృష్ణకు ఫోన్‌ చేస్తే వచ్చాడు. అక్కడ వాళు ్ళ టెస్టులు చేసి బేబీ హార్ట్‌ బీట్‌ ఆగిపోయిందని చెప్పారు. వెంటనే అబార్షన్‌ చేశారు. దీనికి మా అత్త నన్నే తప్పుబట్టింది. కావాలనే అబార్షన్‌ చేయించుకున్నానంది. అప్పటి నుండి నన్ను ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మని ఒకటే గోల. 'నా కొడుకుతో ఉంటే నువ్వు సుఖంగా ఉండలేవు, వెళ్ళి వేరే పెండ్లి చేసుకో' అని మాట్లాడేది. తల్లీ, కూతురు, కొడుకు ఏవేవో గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను మాత్రం దగ్గరకు రానివ్వరు. కృష్ణ కూడా బూతులు తిట్టేవాడు. దాంతో నేనిక అక్కడ ఉండలేనని పోలీస్‌ స్టేషన్‌లో కేసుపెట్టా. అక్కడ మాకు కౌన్సెలింగ్‌ ఇప్పించి మాతో వేరు కాపురం పెట్టించారు.
పిచ్చిగా ప్రవర్తించేవాడు
అప్పటి నుండి కృష్ణ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. చిన్న గది అద్దెకు తీసుకొని అందులో ఉంచాడు. అతను మాత్రం ఎప్పుడూ వాళ్ళ అమ్మ దగ్గరకే వెళ్ళే వాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాడు. అతన్ని సైకాలజిస్టు దగ్గర చూపించాలని నాకు మనసు బాగోలేదని చెప్పి ఇద్దరం సైకాలజిస్టు దగ్గరకు వెళ్ళాం. నాకు ఒత్తిడి, కృష్ణకు మానసిక సమస్య ఉందని రిపోర్టులో వచ్చింది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెబితే నమ్మలేదు. పైగా నన్నే తిట్టారు. వీళ్ళెవ్వరూ నాకు నచ్చలేదు. ఇలాంటి వ్యక్తితో నేను బతకలేను' అంటూ బాధపడింది.
తనే ఆసక్తి చూపింది.
ఉద్యోగం మానేశానని
విన్నూత చెప్పింది విన్న లీగల్‌సెల్‌ సభ్యులు కృష్ణను పిలిచి మాట్లాడతామన్నారు. కాని వినూత్న, కృష్ణతో ఏం మాట్లాడినా తన ముందే మాట్లాడమంది. సభ్యులు అలాగే కృష్ణను పిలిచి విషయం అడిగారు. అతను మాట్లాడుతూ 'మేడమ్‌, వినూత్న నాకు నా స్నేహితుల ద్వారా పరిచయం అయ్యింది. వాళ్ళే పెండ్లి చేశారు. మా ఇద్దరి కులాలు వేరే. కాస్త సమస్య అవుతుందని ముందే అనిపించింది. అలాగే నాకూ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ చెప్పా. కానీ తనే పెండ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపింది. దాంతో నేను కూడా ఒప్పుకున్నా. కానీ పెండ్లికి ముందు నా స్నేహితులకు కార్డు ఇవ్వడానికి రమ్మంటే రాలేదు. పైగా వేరే వాళ్ళకు చెప్పి నా పరువు తీసింది. అప్పుడు నాకు కోపం వచ్చి పెద్దగా అరిచిన మాట నిజమే. తర్వాత సారీ కూడా చెప్పా. కానీ ఆమె పెండ్లి చేసుకోనని కూర్చుంది. మా అమ్మ వచ్చి బతిమలాడితేనే ఒప్పుకుంది.
ఎదురు మాట్లాడుతుంది
పెండ్లి తర్వాత మా ఇంటికి వచ్చి నెల రోజులు నాకు దూరంగా ఉంటానని మా అమ్మకు చెప్పింది. పెండ్లి తర్వాత అలా దూరంగా ఉండటం తప్పని ఎంత చెప్పినా వినలేదు. తన ఇష్టం వచ్చినట్టే చేసింది. ప్రతి విషయంలో మా అమ్మకు ఎదురు మాట్లాడేది. చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసేది. ఆమెకు మూడో నెల వచ్చిన తర్వాత 'ఇంత త్వరగా ప్రెగెన్సీ వస్తుందనుకోలేదు, నాకు ఇప్పుడే పిల్లలు కనాలని లేదు' అంటూ ఉండేది. దాంతో మా అమ్మకు ఇంకా కోపం పెరిగిపోయింది. వినూత్న కూడా నాతో ఉండటం ఇష్టం లేనట్టే ఉండేది. ఇదే సమయంలో ఆమెకు అబార్షన్‌ జరిగింది. నాతో ఉండటం తనకు ఇష్టం లేకనే ఇలా జరిగిందని అమ్మ గట్టిగా నమ్మింది. అందుకే 'ఇక్కడుంటే నువ్వు సుఖంగా ఉండలేవు. వెళ్ళి వేరే పెండ్లి చేసుకో' అని వినూత్నకు చెప్పేది. తను నలుగురితో కలిసి ఉండలేదు. తన ఆలోచనా ధోరణి కాస్త మార్చుకుంటే ఆమెతో కలిసి బతకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక వినూత్న ఇష్టం.
ఒంటరితనం అలవాటై...
కృష్ణ చెప్పిందంతా విన్న సభ్యులు వినూత్నకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆమె వినలేదు. పైగా కృష్ణను బయటకు పంపి ''అతనితో ప్రస్తుతం కలిసి బతకలేనని, కొన్ని రోజులు దూరంగా ఉంటాను'' అంది. దానికి సభ్యులు.. ''చూడు వినూత్న చిన్నతనం నుంచి నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా జీవించావు. అయితే పెండ్లి తర్వాత కొత్త బంధాలు ఏర్పడ్డాయి. వాళ్ళతో నువ్వు కలవలేకపోతున్నావు. పైగా పెండ్లికి ముందు రోజు జరిగిన గొడవలు మీ అందరి మనసులో అలా ఉండిపోయాయి. దాంతో వాళ్ళు నిన్ను, నువ్వు వాళ్ళను అర్థం చేసుకోవడంలో సమస్యలు వచ్చాయి. మీరేమీ చిన్న పిల్లలు కాదు. దూరంగా ఉంటే సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. ఇప్పటికే మీ అత్తగారింటి వాళ్ళు నీ గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నువ్వు అతనికి దూరంగా ఉంటే ఎలా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంతో ఆలోచించి ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ జీవితంలోకి పైకి వచ్చావు. కాబట్టి నీకు నీ భర్తపై ప్రేమ ఉందని నిరూపించుకోవాలి. నీ వ్వక్తిగత నిర్ణయాలను వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెబుతే సరిపోతుంది. ఇన్నాళ్ళు ఒంటరి జీవితాన్ని గడిపావు. ఒక్కసారిగా బంధాలన్నీ వచ్చిపడేసరికి సర్థుకుపోలేక ఇబ్బంది పడుతున్నావు. ఈ సమయంలోనే బాధ్యతగా, మరింత జాగ్రత్తగా ఆలోచించాలి. లేదంటే జీవితాంతం ఒంటరిగా బతకాల్సి వస్తుంది'' అన్నారు.
వాళ్ళతోనే ఉంటాను
సభ్యులు చెప్పింది విన్న తర్వాత వినూత్న కాస్త ఆలోచనలో పడింది. ఆలోచించుకోవడానికి కాస్త సమయం అడిగింది. దానికి అందరూ అంగీకరించారు. మళ్ళీ తర్వాతి వారం వచ్చి ''మీరు చెప్పిన తర్వాత బాగా ఆలోచించాను. నా స్నేహితులతో కూడా మాట్లాడాను. నేను వాళ్ళతోనే ఉంటాను. సాధ్యమైనంత వరకు వాళ్ళతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తాను. అయితే నాకు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు నా మనసులో బాధలు చెప్పుకోవడానికి మీ దగ్గరకు రావొచ్చా?'' అంది. ''నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావొచ్చు. మనలో బాధలు ఆత్మీయులకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. నీతో మాట్లాడటానికి, నీ సమస్య పరిష్కరించడానికి మేమెప్పుడూ సిద్ధమే'' అన్నారు సభ్యులు. దాంతో వినూత్న ధైర్యంగా తన భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది.

- సలీమ

బంధాలను బలపరుచుకోవాలి

MORE STORIES FROM THE SECTION

manavi

ఐద్వా అదాలత్‌

కాలంతో పాటు మారాల్సిందే

17-04-2021

ఎన్నో ఊహించుకొని అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ అక్కడ ఆమె అనుకున్నట్టు లేదు. భర్త ప్రతి విషయానికి తల్లిపై ఆధారపడతాడు. అది తనకు

manavi

ఐద్వా అదాలత్‌

ఇకపై తప్పించుకోలేవు

10-04-2021

అంజలీ, అరవింద్‌ భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అరవింద్‌ కూరగాయల వ్యాపారం చేస్తాడు. కొడుకు పుట్టే వరకు ఆమెకు ఎలాంటి సమస్యా లేదు. ఇంట్లో మహరాణిలా ఉండేది. బాబు పుట్టిన దగ్గర నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. భర్తకు ఆమెపై అనుమానం.

manavi

ఐద్వా అదాలత్‌

ఒంటరి ఆడపిల్లంటే అలుసు

20-03-2021

హసీనకు ఇద్దరు అక్కలు, ఓ అన్నయ్య. ఇంట్లో తనే చిన్నది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇంటినీ, పిల్ల్లల్ని సరిగా

manavi

ఐద్వా అదాలత్‌

పోల్చితే భరించలేను

27-02-2021

వారిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. సంవత్సరం పాటు ఎంతో సంతోషంగా గడిపారు. ఒకరికి ఒకరుగా

manavi

ఐద్వా అదాలత్‌

అతన్ని భరించడం కష్టం

13-02-2021

సుశీలకు ముగ్గురు అక్కలు, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తుంది. తండ్రి కూడా ఏవో చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాడు. అంత కుటుంబానికి

manavi

ఐద్వా అదాలత్‌

ఆనందమంటూ అగాధంలోకి

30-01-2021

ఆమె ఇల్లు సరిగా పట్టించుకోదు. అసలు ఇంట్లోనే సరిగా ఉండదు. ఎప్పుడూ స్నేహితులతో కలిసి బయటకు వెళుతుంది. చాలా సార్లు రాత్రి పూట కూడా ఇంటికి రాదు. భర్తతో ప్రేమగా ఉండదు. బాబును పట్టించుకోదు. ఎలాగైనా తన

manavi

ఐద్వా అదాలత్‌

మార్పు రావాలంటే ఓపిక పట్టాలి

16-01-2021

ఆమెకు పెండ్లయి ఏడాదిన్నర. నాలుగు నెలల పాపవుంది. భర్త నోరు తెరిచి అస్సలు మాట్లాడడు. సరైన సంపాదన లేదు. ఇంట్లో పెత్తనమంతా మామదే. భర్తకు సంపాదన లేకపోవడంతో మామతో సూటి పోటి మాటలు