మార్పు రావాలంటే ఓపిక పట్టాలి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఐద్వా అదాలత్‌

మార్పు రావాలంటే ఓపిక పట్టాలి

ఆమెకు పెండ్లయి ఏడాదిన్నర. నాలుగు నెలల పాపవుంది. భర్త నోరు తెరిచి అస్సలు మాట్లాడడు. సరైన సంపాదన లేదు. ఇంట్లో పెత్తనమంతా మామదే. భర్తకు సంపాదన లేకపోవడంతో మామతో సూటి పోటి మాటలు భరించాల్సి వస్తుంది. తనకూ, భర్తకు విలువలేని ఆ ఇంట్లో ఉండలేక పోతుంది. తన సమస్యను ఎలాగైన పరిష్కరించమంటూ అన్నను వెంటబెట్టుకుని ఐద్వాలీగల్‌ సెల్‌కు వచ్చింది. ఆమె సమస్య ఎలా పరిష్కారమయిందో ఈ వారం కేస్‌ స్టడీలో తెలుసుకుందాం...
స్వప్న చిన్నప్పుడే తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోయారు. ఆమెకు ఓ అన్న ఉన్నాడు. వీరిద్దరి ఆలనా పాలన మేనమామలే చూసుకున్నారు. స్వప్న చాలా తెలివైన పిల్ల. బీటెక్‌ పూర్తి చేసిన ఆమెకు పెండ్లి చేయాలనుకున్నారు. మేనమామలే ఓ సంబంధం చూశారు. అబ్బాయి పేరు సంతోష్‌. ఎంబీఏ చదివి మార్కెటింగ్‌ జాబ్‌ చేస్తున్నాడని చెప్పారు. నెలకు 35 వేల జీతం అని కూడా చెప్పారు. అమ్మానాన్న లేని పిల్ల మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తికిచ్చి పెండ్లి చేస్తే సుఖ పడుతుందనుకున్నారు.
సర్ధిచెప్పుకుంది
పెండ్లయిన పది రోజులకే అసలు విషయం బయటపడింది. సంతోష్‌ చదివింది ఇంటర్‌ మాత్రమే. ఫుడ్‌ డెలివరీ బారుగా పని చేస్తున్నాడని స్వప్నకు తెలిసింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమె ఈ నిజం భరించలేకపోయింది. అయినా ఏ పని చేస్తే ఏంటి తనను ప్రేమగా చూసుకుంటే చాలని తనకు తానే సర్ది చెప్పుకుంది. అయితే సంతోష్‌ పనికి సరిగా పోడు. వచ్చిన డబ్బులు కాస్త పెట్రోల్‌ ఖర్చులకే అయిపోతాయి. ఇంటి ఖర్చులకు పైసా ఇవ్వడు. దాంతో తండ్రి అతన్ని చీటికీ మాటికి తిడుతుంటాడు. దండగ తిండి తింటున్నారని స్వప్నను కలిపి మాటలు అంటుంటాడు. ఈ మాటలు స్వప్న భరించలేకపోయేది. భర్త మాత్రం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడు. ఎప్పుడూ మౌనంగా ఉంటాడు.
ఎలా మాట్లాడాలో తెలియదు
స్వప్న బాధపడుతున్నా పట్టించుకోడు. కాస్త కూడా ఓదార్చడు. నలుగురిలో ఉన్నప్పుడు కాకపోయినా కనీసం తమ గదిలో కూడా ఆమెను ప్రేమగా పలకరించడు. ఇది ఆమెకు మరింత బాధ కలిగించేది. సంతోష్‌కు నలుగురితో కలిసి మెలిసి ఎలా ఉండాలో తెలియదు. ఎవరితో ఎలా మాట్లాడో రాదు. ఇది గమనించిన స్వప్న భర్తలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని ఎక్కువగా తన అన్న దగ్గరకు సంతోష్‌ని తీసుకువెళుతుండేది. దాంతో అత్తా, మామా ''ఎప్పుడూ మా కొడుకుని తీసుకుని అన్న దగ్గరకు పోతావు'' అంటూ గొడవ చేసేవారు. స్వప్న ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. దాంతో ఆమెకు మరీ చిరాకు వచ్చింది. భర్తను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే సహకరించడం లేదని కోపం. దాంతో అత్త, ఆడపడుచుతో సరిగా మాట్లాడేది కాదు.
ఇక భరించలేక
లాక్‌ డౌన్‌కి ముందు స్వప్న నెల తప్పింది. ఇక అప్పటి నుండి అన్న దగ్గరే ఉంటుంది. సంతోష్‌ కనీసం ఫోన్‌ చేసి మాట్లాడడు. ఆమె ఫోన్‌ చేస్తే 'నేను బయట బిజీగా ఉంటా నాకు ఫోన్‌ చెయ్యకు' అంటాడు. ఇదంత భరించలేక పెద్దవాళ్ల మధ్య కూర్చోబెట్టి మాట్లాడితే అప్పుడు స్వప్న దగ్గరకు వచ్చాడు. వీరిద్దరి మధ్య తరచుగా జరిగే గొడవలను ఆడపడుచు భర్త పరిష్కరిస్తుండేవాడు. స్వప్నకు నెలలు నిండి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని సంతోష్‌ పాపను సరిగా ఎత్తుకోనుకూడా ఎత్తుకోలేదు. వెంటనే హాస్పిటల్‌ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపకు నాలుగు నెలలు నిండాయి. ఏమీ పట్టించుకోని భర్త దగ్గరకు పాపను తీసుకుని వెళ్ళడానికి ఆమె థైర్యం చేయలేకపోయింది. అందుకే లీగల్‌సెల్‌కు వచ్చింది.
అందరితో అంతే
స్వప్న సమస్యను విన్న లీగల్‌సెల్‌ సభ్యులు తర్వాతి వారం రమ్మని సంతోష్‌కు లెటర్‌ పంపారు. చెప్పిన ప్రకారమే సంతోష్‌ తన తల్లి, చెల్లి, బావను వెంటబెట్టుకుని లీగల్‌సెల్‌కి వచ్చాడు. సంతోష్‌తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సభ్యులకు విషయం అర్థమయింది. అతను నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడం లేదు. చెల్లెలి భర్తనే అంతా మాట్లాడుతున్నాడు. సంతోష్‌ తండ్రి ఒక్క స్వప్ననే కాదు కూతురితో, అల్లుడితో, భార్యతో, కొడుకుతో అందరితో అలాగే మాట్లాడతాడు. ఎవ్వరినీ మనుషులుగా గుర్తించడు.
వేరు కాపురం కష్టం
లీగల్‌సెల్‌ సభ్యులు స్వప్నతో ''నువ్వు నీ భర్తతో కలిసి బతకాలనుకుంటున్నావు. అతన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. కాబట్టి కాస్త ఓపిక పట్టక తప్పదు. మీ మామయ్య మాటలు పట్టించుకుంటే నువ్వుక్కడ అస్సలు ఉండలేవు. ఆ మనిషి మనస్తత్వమే అది. సంపాదిస్తున్నాను కాబట్టి ఏమైనా అనొచ్చు అనే అహంకారం బాగా ఉంది. పైగా వయసు కూడా పెరిగింది. ఇప్పుడు అతనికి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఇంకా సమస్య ఎక్కువవుతుంది. ముందు నువ్వు నీ భర్తను మార్చుకోవడంపై దృష్టిపెట్టు. పోని వేరు కాపురం పెట్టాలన్నా ప్రస్తుతం నీ భర్తకు సరైన సంపాదన లేదు. ఇప్పుడు అతన్ని నమ్మి వేరు ఉంటే నీ కష్టాలు మరీ ఎక్కువవుతాయి'' అన్నారు.
అమ్మగా తోడు నిలబడండి
''వేరు కాపురం పెట్టాలనే ఆలోచన లేదండీ. సంతోష్‌ని మార్చుకోవాలనే మీ దగ్గరకు వచ్చాను. కానీ ఆ ఇంట్లో నాకు సపోర్ట్‌ చేసేవాళ్ళు లేరు. ఆయనకు ఏమైనా చెబుతుంటే అడ్డుపడుతుంటారు'' అని స్వప్న కన్నీళ్ళు పెట్టుకుంది. లీగల్‌ సెల్‌ సభ్యులు సంతోష్‌ తల్లిని పిలిచి ''మీ అబ్బాయి గురించి మీకు బాగా తెలుసు. అబద్దాలు చెప్పి పెండ్లి చేశారు. అయినా స్వప్న భరిస్తుంది. భర్తతోనే ఉండాలని కోరుకుంటుంది. అమ్మానాన్నలు లేని ఆమెకు మీరు సపోర్ట్‌ చేయాలి. మీ కొడుకును మార్చుకోవాలి. పని చేసేలా చూడాలి. బాధ్యతలు నేర్పించాలి. అతను చాలా అమాయకంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు మీరు స్వప్నకు ఓ తల్లిగా మారి తోడుగా నిలబడాలి. కానీ మీరు ఆమె ప్రయత్నాలకు అడ్డుపడితే ఎలా? మీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంది. ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి'' అన్నారు.
మీ కొడుకును మార్చుకోండి
''ఆ అమ్మాయికి నేనంటే అస్సలు లెక్కలేదు. అత్త అనే మర్యాద లేకుండా కుర్చీలో అలాగే కూర్చుంటుంది. ప్రతి చిన్న గొడవకు అన్న దగ్గరకు పరిగెత్తుతుంది'' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ''మేమేం చెబుతున్నాం.. మీరేం చెబుతున్నారు. అబద్దాలు చెప్పి పెండ్లి చేశారన్న కోపం, బాధ మీ కోడలిలో ఉన్నాయి. పైగా భర్తకు ఏమీ తెలియదు. దాంతో స్వప్న మీతో అలా ఉంటుంది. మేం ఆమెతో మాట్లాడతాం. మీరవేమీ పట్టించుకోకుండా స్వప్నకు తోడుగా ఉండి మీ కొడుకును మార్చే ప్రయత్నం చేయండి'' అన్నారు.
బాధ్యతగా ఉండాలి
దానికి ఆమె అంగీకరించింది. స్వప్నతో ''ఇప్పుడు నీకు తోడుగా మేముంటాం. నీకు ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తాం. మా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావొచ్చు. ధైర్యంగా ఉండు. నీ భర్తకు కొన్ని వారాల పాటు కౌన్సిలింగ్‌ ఇద్దాం'' అన్నారు. స్వప్న కూడా అంగీకరించింది. సంతోష్‌తో మాట్లాడుతూ ''ఆడపిల్ల పుట్టిందని ఎత్తుకోనన్నావంట. అది మంచి పద్ధతి కాదు. స్వప్నకు తోడుగా మేమున్నాము. ఇకపై నువ్వు బాధ్యతగా ఉండాలి. ప్రతి రోజూ నువ్వు పనిలోకి పోవాలి. ఇంటి ఖర్చులకు ఐదు వేలు ఇవ్వాలి, నీ భార్యకు కూడా ఖర్చుల కోసం కొంత ఇవ్వాలి, బయటకు వెళ్ళినపుడు స్వప్నకు అప్పుడప్పుడు ఫోన్‌ చేసి మాట్లాడాలి. నాలుగు వారాలపాటు ప్రతి వారం మా కౌన్సెలింగ్‌ సెంటర్‌కు రావాలి'' అన్నారు.
చెప్పిన ప్రకారం చేయడానికి అతను ఒప్పుకున్నాడు. సంతోష్‌ బావ కూడా అన్ని రకాలుగా సపోర్ట్‌ చేస్తానని చెప్పాడు. దాంతో స్వప్న పాపను తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌ నుండే భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్ళింది.

- సలీమ

మార్పు రావాలంటే ఓపిక పట్టాలి

MORE STORIES FROM THE SECTION

manavi

ఐద్వా అదాలత్‌

పోల్చితే భరించలేను

27-02-2021

వారిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. సంవత్సరం పాటు ఎంతో సంతోషంగా గడిపారు. ఒకరికి ఒకరుగా

manavi

ఐద్వా అదాలత్‌

అతన్ని భరించడం కష్టం

13-02-2021

సుశీలకు ముగ్గురు అక్కలు, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తుంది. తండ్రి కూడా ఏవో చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాడు. అంత కుటుంబానికి

manavi

ఐద్వా అదాలత్‌

ఆనందమంటూ అగాధంలోకి

30-01-2021

ఆమె ఇల్లు సరిగా పట్టించుకోదు. అసలు ఇంట్లోనే సరిగా ఉండదు. ఎప్పుడూ స్నేహితులతో కలిసి బయటకు వెళుతుంది. చాలా సార్లు రాత్రి పూట కూడా ఇంటికి రాదు. భర్తతో ప్రేమగా ఉండదు. బాబును పట్టించుకోదు. ఎలాగైనా తన

manavi

ఐద్వా అదాలత్‌

బంధాలను బలపరుచుకోవాలి

02-01-2021

చిన్నప్పటి నుండి ఒంటరి పోరాటం ఆమెకు అలవాటు. కష్టపడి చదువుకుంది. ఈ సమాజంలో నెగ్గుకు రాగలిగే ధైర్యాన్ని అలవాటు చేసుకుంది. స్నేహితుల ద్వారా పరిచయమైన వ్యక్తిని పెండ్లి చేసుకుంది. కాని అక్కడ ఆమె ఇమడలేక

manavi

ఐద్వా అదాలత్‌

రహస్య హింసకు అచ్చమైన అక్షరరూపం

02-09-2020

'స్త్రీకి కూడా ఒక శరీరం ఉంటుంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి. మెదడు ఉంటుంది.. దానికి జ్ఞానం ఇవ్వాలి. హృదయం ఉంటుంది.. దానికి అనుభవం ఇవ్వాలి' అంటారు చలం. వందేండ్లకి ఆవల పరుగెత్తిన ఆయన ఊహాశక్తిలో