ఆమె ఇల్లు సరిగా పట్టించుకోదు. అసలు ఇంట్లోనే సరిగా ఉండదు. ఎప్పుడూ స్నేహితులతో కలిసి బయటకు వెళుతుంది. చాలా సార్లు రాత్రి పూట కూడా ఇంటికి రాదు. భర్తతో ప్రేమగా ఉండదు. బాబును పట్టించుకోదు. ఎలాగైనా తన భార్యతో మాట్లాడి కాపురాన్ని నిలబెట్టమంటూ అతను ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు. అసలు ఆమె ఎందుకు అలా చేస్తుంది. ఆ భార్యా భర్తల మధ్య ఉన్న సమస్య ఏంటీ... వారి సమస్య అసలు పరిష్కరించబడిందా? లేదా? ఈ వారం ఐద్వా అదాలత్ ద్వారా తెలుసుకుందాం...
యాభై రెండ్లేండ్ల శ్రీధర్ తన అక్కను వెంటబెట్టుకుని ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చి ''మేడమ్ నా భార్య పేరు సుకన్య. మాకు పెండ్లయి 16 ఏండ్లు అవుతుంది. 12 ఏండ్ల బాబు ఉన్నాడు. ఏడో తరగతి చదువుతున్నాడు. నా భార్య మొదటి నుండి నాతో సరిగా ఉండదు. టైంకి వంట చేయదు. దాదాపు అన్నీ నేనే చూసుకుంటాను. ఉద్యోగమంటూ వెళుతుంది. ఎక్కడా నిలకడగా పని చేయదు. రెండు నెలలకు ఓ ఆఫీసు మారుతుంటుంది.
ఎప్పుడూ 'మా స్నేహితులకు ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్లో ఉన్నారు' అని చెప్పి వెళుతుంది. అక్కడకు వెళ్ళాక ఈ రోజు ఇక్కడే ఉండాల్సి వస్తుందని ఉండిపోతుంది. గతంలో ఎప్పుడూ తన మీద నాకు అనుమానం రాలేదు. ఆరు నెలల కిందట తన ఫోన్లో కొన్ని మెసేజ్‌లు చూశాను. అన్నీ బూతు మెసేజ్‌లు ఉన్నాయి. అతనితో ఆమెకు పెండ్లికి ముందు నుండే పరిచయం ఉన్నదంటే. ఎప్పుడూ ఫోన్లలో మాట్లాడు తుంటుంది. బాబు కోసం నేను సుకన్యతో కలిసి ఉండాలనుకుంటున్నాను. మీరు ఓ సారి ఆమెను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తారని మీ దగ్గరకు వచ్చాను'' అని చెప్పాడు.
శ్రీధర్ అక్క మాట్లాడుతూ ''ఆమె ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఎప్పుడూ ఎవడితోనే లాడ్జీల్లో ఉంటుంది. ఆఫీసుకని చెప్పి పోతుంది కానీ ఉద్యోగం లేదూ ఏమీ లేదు. పెండ్లయిన కొత్తలో కూడా నాతో ఓసారి ''మీ తమ్ముడు సంసారానికి పనికి రాడు'' అని చెప్పింది. అయితే తర్వాత కొంత కాలానికి నెల తప్పింది. దాంతో ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకోలేదు. మొదటి నుండే ఆమెకు మా తమ్ముడంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఇలా బరితెగించింది. ఈ మధ్య ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్లు భవిష్యత్‌లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ఆమె తిరుగుళ్ళ వల్లే ఇలాంటి సమస్య వచ్చింది'' అన్నది.
అక్కా, తమ్ముళ్ళు చెప్పింది విన్న లీగల్ సెల్ సభ్యులు ''ముందు మేము ఓసారి సుకన్యతో మాట్లాడతాము. ఇద్దరూ ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీకో లెటర్ రాసి ఇస్తాం. అది ఆమెకు చూపించి వచ్చే వారం ఇద్దరూ కలిసి రండీ'' అని శ్రీధర్ చేతికి లెటర్ ఇచ్చి పంపించారు.
తర్వాతి వారం శ్రీధర్, సుకన్యను తీసుకుని లీగల్‌సెల్‌కు వచ్చాడు. సభ్యులు శ్రీధర్ని బయట కూర్చోబెట్టి సుకన్యతో మాట్లాడితే ''మేడమ్ అతను మీకు ఏం చెప్పాడో నాకు తెలియదు. నాకు మాత్రం అతనంటే అస్సలు ఇష్టం లేదు. కేవలం బాబు కోసం కలిసి ఉంటున్నా. ఇతనికిచ్చి మా వాళ్ళు నా జీవితం నాశనం చేశారు. నాకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అప్పటి నుండి నాకు అన్నీ కష్టాలే. నాకు అన్నయ్య ఉన్నాడు. మా నాన్న మళ్ళీ పెండ్లి చేసుకున్నాడు. ఆ వచ్చిన ఆమె నన్నూ, అన్నయ్యను చాలా ఇబ్బందులు పెట్టింది. ఆమె వల్ల చాలా కష్టపడ్డాం. తర్వాత ఆమె ఆరోగ్యం పాడైపోయింది. అప్పుడు సేవలన్నీ నేనే చేశాను. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. రెండో భార్య మంచంలో ఉండగానే మూడో పెండ్లి చేసుకున్నాడు. మా గురించి అస్సలు పట్టించకోడు.
మా నాన్న ప్రవర్తన చూసి నాకు మంచి సంబంధాలేమీ రాలేదు. చివరకు ఈ సంబంధం కుదిరింది. నాకు ఇష్టం లేకపోయినా చేసేది లేక ఒప్పుకున్నాను. ఈయనకు మాట్లాడడం రాదు. ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. ఇతన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు మోసం చేశారు. వాళ్ళ నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఉద్యోగం ఈయకు రావల్సింది వాళ్ళ అక్కకు భర్త లేడని ఆమెకు ఇప్పించారు. దాని గురించి ఆయన నోరు తెరిచి అడగడు. మా అత్తగారు బతికి ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూతుళ్ళ గురించే ఆలోచించేది. కొడుకు గురించి అస్సలు పట్టించుకోలేదు. శ్రీధర్ ఇద్దరు అక్కలు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు.
నన్ను నానా మాటలు అనేవాళ్ళు. వాళ్ళందరూ డబ్బున్నోళ్ళు. వాళ్ళ ముందు ఇలా పేదరికంతో నేను ఉండలేకపోతున్నా. నన్ను వాళ్ళు చాలా సార్లు అవమానించారు. అందుకే వాళ్ళంటే ఇష్టం లేదు. వాళ్ళ అక్కలను నిలదీయమంటే శ్రీధర్ నా మాట వినడు. చివరకు మా అన్న కూడా నన్ను మోసం చేశాడు. మా తాతయ్య చనిపోతూ ఆయన ఇంటిని నాకూ మా అన్నయ్యకు చెరిసగం అని చెప్పాడు. కానీ మా అన్నయ్య నాకు తెలియకుండా ఆ ఇల్లు మొత్తం తన పేరు మీద రాయించుకున్నాడు. అప్పుడు కూడా నేనొక్కదాన్నే గొడవ పడ్డాను. శ్రీధర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలా ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటాడు. ఆయన అలా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అందుకే ఆయనతో మాట్లాడడం మానేశాను. కేవలం బాబు కోసం ఆ ఇంట్లో ఉంటున్నాను.
నేను గతంలో పని చేసిన ఆఫీసులో ఉండే ఫ్రెండ్ నాకు ఎప్పుడైనా అవసరమైతే వడ్డీలేకుండా డబ్బులు ఇస్తాడు. ఆయన గురించి శ్రీధర్‌కి కూడా తెలుసు. నాకు ఎవరితో సంబంధం లేదు. నా సమస్య అంతా నా భర్త ప్రవర్తనతోనే'' అంటూ ఏడ్చేసింది.
''మీ మామయ్య ఉద్యోగం వాళ్ళ అక్కకు ఇప్పించి 25 ఏండ్లు దాటిపోయింది. అప్పటికి మీ పెండ్లి కాలేదు. అప్పుడేం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ విషయం గురించి నిలదీసినా ఉపయోగం లేదు. ఇప్పుటి గురించి మాట్లాడుకుందాం. నీ కొడుకు కోసమే అతనితో ఉండాలనుకుంటున్నావు. ఇద్దరి మధ్య వయసు తేడా... పెద్దగా డబ్బు సంపాదించలేకపోవడం... నోరు తెరిచి ఎవరినీ ప్రశ్నించకపోవడం వల్ల నీ భర్తపై నీకు విసుగు వచ్చింది. నీ ఆలోచనలకు తగ్గట్టు అతను లేడని నీ బాధ. అంతే తప్ప అతనంటే నీకేమీ అసహ్యం లేదు. అలా ఉంటే ఇన్నేండ్లు అసలు నువ్వు అతనితో కలిసి ఉండగలిగేదానివి కాదు.
నీ కొడుకు ఇప్పుడు చిన్నవాడు. ఎదుగుతున్న వయసు, ఈ వయసులో తల్లిదండ్రుల మధ్య ఇలాంటి సమస్యలు ఉండడం గమనిస్తే అతని భవిష్యత్‌కు మంచిది కాదు. ముందు నీ భర్తపై నీకున్న అసంతృప్తిని తగ్గించుకో. డబ్బు సంపాదించాలి, నలుగురిలో గొప్పగా ఉండాలనుకోవడం మంచి విషయమే. కానీ డబ్బే ప్రపంచం కాదు. ఆనందగా ఉన్నాను అనుకుంటూ అగాధంలోకి కూరుకుపోతున్నావు. ఇది నీ భవిష్యత్‌కు కూడా అస్సలు మంచిది కాదు. అతని కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు. ఇద్దరూ చక్కగా ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండొచ్చు. హైదరాబాద్‌లో మీకు సొంత ఇల్లు ఉంది. అంతకంటే ఏం కావాలి? అతని నుండి విడిపోయే ఆలోచన కూడా లేదు. అలాంటప్పుడు ఉన్నంతలో ఆనందంగా ఎలా ఉండాలో ఆలోచించాలి తప్ప జీవితాంతం ఇలా భర్తపై అసంతృప్తితో ఉంటే నీకూ, నీ భర్తకు, కొడుక్కూ ఎవ్వరికీ మంచిది కాదు'' అన్నారు లీగల్‌సెల్ సభ్యులు.
సభ్యులు చెప్పింది విన్న సుకన్య కాస్త ఆలోచనలో పడింది. ఈలోపు సభ్యులు శ్రీధర్ని పిలిచి ''సుకన్య చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ విషయాలు నీకూ తెలుసు. ఆమెకు కొన్ని కోరికలు ఉన్నాయి. అందరిలో మంచిగా బతకాలని కోరుకుంటుంది. మీరు ప్రతి విషయంలో మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు. కాస్త యాక్టివ్‌గా ఉండాలి. భార్య కావాలి అంటే సరిపోదూ తన ఆలోచనలు ఏమిటి, ఏం కోరుకుంటుందో కూడా పట్టించుకోవాలి. అన్నీ కాకపోయినా కనీసం భార్య కోరికలు కొన్నైనా తీర్చాలి. లేదంటే ఇలాంటి సమస్యలే వస్తాయి'' అన్నారు.
ఇకపై తనకు నచ్చినట్టే ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు శ్రీధర్. సుకన్య కూడా రాబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకొని తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరూ నాలుగు వారాల పాటు ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చి కౌన్సెలింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిలో కొద్దికొద్దిగా మార్పు వస్తుంది.
- సలీమ
ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక
MORE STORIES FROM THE SECTION

ఐద్వా అదాలత్

ఐద్వా అదాలత్

ఐద్వా అదాలత్

ఐద్వా అదాలత్

ఐద్వా అదాలత్

ఐద్వా అదాలత్

ఐద్వా అదాలత్

ఐద్వా అదాలత్
MORE SECTIONS
Recent From Manavi