సుశీలకు ముగ్గురు అక్కలు, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తుంది. తండ్రి కూడా ఏవో చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాడు. అంత కుటుంబానికి ఆ ఇద్దరి ఆదాయం చాలదు. అందుకే సుశీల ఇద్దరక్కలు ఇండ్లల్లో పాచిపనులు చేయడానికి వెళ్ళేవారు. సుశీల ఇంట్లోనే ఉండి చెల్లెళ్ళను, తమ్ముడిని చూసుకునేది. ఎవరికీ అక్షరం ముక్క రాదు. అసలు బడి మొఖమే చూడలేదు. పద్నాలుగేండ్లపుడు సుశీల పెద్ద అక్కకు పెండ్లి చేశారు. ఆ తర్వాత చిన్న చిన్నగా అందరి పెండిండ్లు జరిగిపోయాయి. చిన్న చెల్లెలు మాత్రం ప్రేమించి పెండ్లి చేసుకుంది. ఎవరి సంసారాలు వారివే. అందరికీ ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉండేవి. అయినా వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే రాథ పరిస్థితి అలా కాదు. రాథ.. సుశీల పెద్ద చెల్లెలు. రాథకు పెండ్లి జరిగి పదకొండేండ్లు. అప్పటి నుండి భర్త పెట్టే నరకం అనుభవిస్తూనే ఉంది.
రాథకు పెండ్లి తర్వాత వెంటవెంటనే ముగ్గురు పిల్లలు. భర్త కుమార్ కరెంట్ పని చేస్తాడు. రోజంతా కష్టపడతాడు. కానీ వచ్చిన డబ్బంతా తాగుడుకి పెడతాడు. చేతిలో కాస్త డబ్బుంటే పనికి వెళ్ళడు. ఉదయం లేచింది మొదలు తాగుడే. పెద్ద కొడుక్కి ఇప్పుడు పదేండ్లు నిండాయి. చిన్న కొడుక్కి ఎనిమిదేండ్లు. పాపకు ఆరేండ్లు. ఇప్పటి వరకు పిల్లలు సరిగా బడికి వెళ్ళలేదు. రాథ కూడా ఇండ్లల్లో పాచి పనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో సంసారాన్ని నడిపిస్తుంది.
రెండో నెల పట్టించుకోడు
పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళో వేస్తే ' పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళో వేస్తావా? నా పిల్లలు నీకులా దిక్కు లేని వాళ్ళనుకున్నావా' అంటూ కుమార్ పిల్లల్ని ఆ బడి మాన్పించి ప్రైవేటు బళ్ళో వేస్తాడు. ఒక నెల ఫీజు కడతాడు. రెండో నెల ఇక పిల్లల గురించి పట్టించుకోడు. దాంతో మూడు సార్లు ఫీజు కట్టలేదని స్కూల్ నుండి పిల్లల్ని ఇంటికి పంపించేశారు. కుమార్ రాత్రి పూట పిల్లల ముందు రాథతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. పిల్లల ముందే భర్త తన కోరిక కోసం వేధిస్తుంటే రాథ నరకం అనుభవించేది. పగలంతా ఇండ్లల్లో చాకిరి, రాత్రైతే భర్త పెట్టే నరకం.
అద్దె కూడా కట్టలేదు
ముగ్గురు పిల్లల తర్వాత రాథ ఆపరేషన్ చేయించుకుంటానంటే కుమార్ ఒప్పు కోలేదు. దాంతో ఆమె ఐదు సార్లు అబార్షన్ చేయించుకోవల్సి వచ్చింది. అబార్షన్ ఖర్చులన్నీ తన పెద్ద అక్కనే చూసుకుంది. అబార్షన్ చేయించుకున్న నాలుగు రోజులకే కుమార్, రాథను కోర్కె తీర్చమని వేధించేవాడు. దీంతో రాను రాను రాథకు ఒంట్లో ఓపిక తగ్గిపోయింది. బయటకు వెళ్ళి పని చేయలేకపోయేది. దాంతో ఐదు నెలల నుండి ఇంటి అద్దె కట్టడం లేదు. ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంది.
అక్కకు చెప్పుకుని బాధపడింది
ఇలాంటి పరిస్థితుల్లో రాథ తను ఎప్పటి నుండో కడుతున్న చిట్టీ పాడుకుంది. ఆ వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాలను కుంది. డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టింది. ఆ డబ్బు కోసం కుమార్ రాథను చిత్ర హింసలు పెట్టాడు. అక్కడే ఉంటే తనని ఏం చేస్తాడోనని భయపడ్డ రాథ రెండో అక్క దగ్గరకు వెళ్ళి తన ముగ్గురు పిల్లలతో తలదాచుకుంది. జరిగిందంతా రాథ తన మూడో అక్క సుశీలకు ఫోన్లో చెప్పుకొని బాధపడింది. ఒక పక్క కుమార్ తన భార్య ఇంట్లో డబ్బు తీసుకొని ఎవరితోనే పారి పోయిందని ప్రచారం మొదలుపెట్టాడు.
సమస్య పరిష్కారం కావాలంటే
అప్పటి నుండి సుశీల చెల్లెలి జీవితం గురించే ఆలోచిస్తుంది. చెల్లెలి కోసం భార్య పడుతున్న బాధను గమనించి, తన మరదలికి సాయం చేయాలని భావించాడు సుశీల భర్త. వెంటనే భార్యతో కుమార్ సమస్య పరిష్కారం కావాలంటే రాథను తీసుకొని ఐద్వా లీగల్‌సెల్‌కు వెళ్ళమని సలహా ఇచ్చాడు. సుశీల, తర్వాతి రోజు ఉదయాన్నే రాథను, రెండో అక్కను, చెల్లిని, తల్లిని వెంటబెట్టుకొని ఐద్వా లీగల్‌సెల్‌కు వెళ్ళింది.
తన బతుకు తాను బతుకుతానంది
ఈ నరకాన్ని ఇక భరించలేనని, భర్తను ఇక తన జోలికి రాకుండా చూడమని లీగల్‌సెల్ సభ్యులను రాథ బతిమలాడుకుంది. భర్త నుండి తనకు విముక్తి లభిస్తే తన బతుకు తాను బతుకుతూ పిల్లల్ని చదివించుకుంటానని కన్నీళ్ళు పెట్టుకుంది. కుమార్‌తో ఇలాగే ఉంటే పిల్లల జీవితాలు నాశనమైపోతాయిని ఆ తల్లి మనసు కుమిలిపోయింది. కుమార్ గురించి అంతా తెలుసుకున్న సభ్యులు వెంటనే అతన్ని రమ్మని లెటర్ పంపారు. లెటర్ పంపడమే కాదు, వెంటనే రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కుమార్‌కు ఫోన్ చేసి హెచ్చరించారు. దాంతో కుమార్ వెంటనే లీగల్‌సెల్‌కు వచ్చాడు.
అతనికి దూరంగా ఉంటా
రాథ భర్త ముందే 'ఇక నేను అతడితో బతకలేను, ఆ నరకం అనుభవించలేను. రాత్రి పూట అతని ప్రవర్తన వల్ల నా పరువు పోతుంది. పిల్లలు ఎదుగుతున్నారని కూడా లేకుండా తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. పదకొండేండ్లు అతను పెట్టిన నరకాన్ని భరించాను. ఇల్లు పట్టించుకోడు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనే లేదు. ఇక నా వల్ల కాదు. నా పిల్లల్ని తీసుకొని నేను దూరంగా వెళతాను' అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
మారకపోతే కష్టం
'రాథ మాటలకు నీ సమాధానం ఏంటి' అని కుమార్‌ను సభ్యులు ప్రశ్నించారు. దానికి కుమార్ పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకుంటా' అన్నాడు. 'కేవలం నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే చాలదు, నీ ప్రవర్తన మారాలి. నీకు భార్యంటే కోర్కెలు తీర్చే యంత్రంలా కనిపిస్తుంది. పిల్లల ముందే నువ్వు అలా ప్రవర్తిస్తుంటే రేపు వాళ్ళ భవిష్యత్ ఏమిటో ఒక్కసారైనా ఆలోచించావా? తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో నీకు తెలియదా? కానీ నువ్వు నీ పిల్లల్ని బడికి వెళ్లకుండా చేస్తున్నావు. నువ్వు మారకపోతే రాథ నీతో రాదు. నవ్వు ముందు తాగుడు మానేయ్యాలి' అని సభ్యులు కుమార్‌కు గట్టిగా చెప్పారు.
వాళ్ళ జోలికి రావొద్దు
'ఒకే సారి తాగుడు మానితే మంచిది కాదని డాక్టర్లు చెప్పారు మేడమ్. చిన్న చిన్నగా మానుకుంటా అన్నాడు కుమార్. 'అయితే నీకు ఆరునెలలు టైం ఇస్తున్నాం. ఈ లోపు నువ్వు తాగుడు మానేయ్యాలి. అప్పటి వరకు రాథ జోలికి గానీ, పిల్లల జోలికి గానీ రావొద్దు. నీ దగ్గర ఉన్న చిట్టీ డబ్బుల రాథకు ఇచ్చేసెరు. ఇంటి అద్దె మిగిలిన విషయాలన్నీ రాథ చూసుకుంటుంది. ఆరు నెలల తర్వాత నువ్వు తాగుడు మానేసావని తెలిస్తే అప్పుడు రాథ నీతో వస్తుంది. నువ్వు మాత్రం ఈ ఆరునెలలు వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళితే నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టియ్యడానికి మాకు ఎంతో సమయం పట్టదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీకు నిజంగా భార్యా, పిల్లలు కావాలంటే తాగుడు మానడానికి ప్రయత్నించు' అని చెప్పారు.
సంతోషంగా వెళ్ళిపోయారు
సభ్యులు చెప్పిన దానికి కుమార్ సరే అని అన్నింటికీ ఒప్పుకున్నట్టు రిజిస్ట్రర్‌లో సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి కుమార్ బాధ నుండి చెల్లిని కాపాడి నందుకు లీగల్ సెల్ సభ్యులకు సుశీల మనస్ఫూర్తిగా రెండు చేతులతో నమస్కరించింది. తనతో వచ్చిన అక్క, చెల్లి, తల్లి కూడా ఎంతో సంతోషంగా వెళ్ళిపోయారు.
- సలీమ