పోల్చితే భరించలేను | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఐద్వా అదాలత్‌

పోల్చితే భరించలేను

వారిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. సంవత్సరం పాటు ఎంతో సంతోషంగా గడిపారు. ఒకరికి ఒకరుగా బతికారు. తర్వాత వారి అన్యోన్య దాంపత్యంలో కల్లోలం చెలరేగింది. అనుమానం వారిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. చిలికి చిలికి గాలివానై ఆది పెను తుఫానుగా మారింది. ఎలాగైనా తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకుంది. తెలిసిన వారు చెబితే ఐద్వా లీగల్‌ సెల్‌కు వచ్చింది. తన సమస్యను సభ్యులకు ఇలా చెప్పుకొచ్చింది...
''నా పేరు రాధిక. నా భర్త పేరు రాజేష్‌. మాది ప్రేమ వివాహం. ఇప్పటికి మా పెండ్లి జరిగి ఎనిమిది సంవత్సరాలు. తను రియల్‌ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తాడు. పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు. నా భర్తకు నాపై అనుమానం. తాగుతాడు, విపరీతంగా కొడతాడు. ఎవరితో పడితే వారితో సంబంధాలు అంటగడతాడు. అప్పట్లో అత్తగారింట్లో అందరం కలిసే వుండేవాళ్ళం. నాకూ వాళ్ళ అన్నయ్యకు మధ్య సంబంధం ఉందని ఆయనకు అనుమానం. దాంతో నన్ను రకరకాలుగా హింసించేవాడు.
తనతోనే ఉండాలంటాడు
ఆ అనుమానంతో అక్కడి నుండి వేరే ఇల్లు అద్దెకు తీసుకొని అందులో పెట్టాడు. పోనీ ఇల్లు మారితే తనలో మార్పు వస్తుందేమో అనుకున్నా. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. ఇంటి పక్క వారితో మాట్లాడినా అనుమానిస్తాడు. ఎప్పుడూ నేను తనతోనే ఉండాలంటాడు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఎలా సాధ్యం. పిల్లలు లేకుండా సినిమాకు వెళదామంటాడు. పిల్లల్ని ప్రేమగా చూసుకోడు. వాళ్ళను కూడా కొడతాడు. ఓసారి సెలవులకు మా ఇంటికి మా ఆడపడుచు కూతురు వచ్చింది. మా పాప, ఆ పాప కొట్టుకున్నారు. నేను ఇద్దరినీ మందలించాను. దాంతో ఆయన ''నా మేనకోడలినే తిడతావా..?'' అని పిల్లల ముందే నన్ను విపరీతంగా కొట్టాడు. ఆయన కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని ఆ రాత్రి అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన దగ్గరకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది. మీరే నాకు న్యాయం చేయాలి. నా భర్త తాగుడు మాన్పించాలి. ఆయన తాగితేనే ఇలా ప్రవర్తిస్తాడు. తాగకపోతే చాలా మంచిగా వుంటాడు'' అంటూ తన సమస్య వివరించింది.
నా మాట వినదు
వచ్చే వారం రాజేష్‌ను రమ్మని లీగల్‌సెల్‌ సభ్యులు లెటర్‌ పంపారు. చెప్పిన సమయానికి రాజేష్‌ వచ్చాడు. సభ్యులు రాజేష్‌ను కూర్చోబెట్టి సమస్య ఏంటని అడిగితే ''మేడమ్‌, నాకు ప్రశాంతంగా వుండటం ఇష్టం. కానీ తను ప్రతి విషయానికి పెద్ద పెద్దగా అరుస్తుంది. ఆమెపై వాళ్ళ అక్కల ప్రభావం చాలావుంది. నన్ను వాళ్ళ బావలతో పోల్చి మాట్లాడుతుంది. పైగా మా అన్నయ్య గురించి నా దగ్గర ఎక్కవగా ప్రస్తావిస్తుంది. తన ప్రవర్తన నాకు నచ్చడం లేదు. అందుకే మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి వచ్చేసి వేరుకాపురం పెట్టాము. వేరుపడిన తర్వాత కూడా చుట్టు పక్కల వారితో అలాగే ప్రవర్తిస్తుంది. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోదు. ప్రతి విషయంలో నన్ను రెచ్చ గొడుతుంది. నాకు నచ్చని పనులే చేస్తుంది. నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది. తన మాటతీరు మారాలి' అంటూ రాజేష్‌ చెప్పుకొచ్చాడు.
తాగుడు మానుకుంటేనే
రాజేష్‌ చెప్పినవన్నీ విన్న సభ్యులు అతనితో ''నువ్వు నీ భార్యను అనుమానిస్తున్నావు. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ వుంది. కానీ మీలో వున్న అనుమానం, కోపం, ద్వేషం వల్ల ఆ ప్రేమ కనిపించడం లేదు. నువ్వు ముందు తాగడం మానుకోవాలి. అప్పుడు మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నువ్వు అనుకున్నట్టుగా ప్రశాంతంగా బతకగలవు. అందుకే ముందు చిన్న చిన్నగా తాడగం తగ్గించుకో. భార్యను, పిల్లల్ని కొట్టడం మానుకో. మీ పిల్లలు తండ్రి ప్రేమను కోల్పోతున్నారు.
పిల్లల గురించి ఆలోచించండి
నువ్వు రాధికలో మార్పు రావాలని కోరుకుంటున్నావు. చాలా మంచి విషయం. అలాగే రాధిక కూడా నువ్వు మారాలని కోరుకుంటుంది. ముందు మీరు మీ పిల్లల గురించి ఆలోచించాలి. కేవలం మీ సుఖాలు, సంతోషాలు చూసుకుంటే సరిపోదు. మీరు పిల్లల ముందు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వుంటే వాళ్ళ మనసులో మీ గురించి ఎలాంటి అభిప్రాయం వుంటుంది. మీరిద్దరూ చదువుకున్నవారు. ఒక్కసారి పిల్లల గురించి ఆలోచించండి. ఇలాంటి హింసాపూరిత వాతావరణంలో పెరిగిన పిల్లలు తర్వాత సమాజంలో కౄరంగా తయారవుతారు. ఎప్పుడో ఏదో ఒక సంఘటన జరిగిందని భార్యను పదే పదే అనుమానించడం తప్పు.
మనసు విప్పి మాట్లాడుకోండి
ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. మీరు ఎంత ప్రేమగా, అన్యోన్యంగా ఉంటే సమాజంలో ప్రేమ వివాహాల పట్ల అంత గౌరవం ఉంటుంది. అందుకే ముందు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. మనసు విప్పి మాట్లాడుకోండి. ఎవరిలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారో సామరస్యంగా మాట్లాడుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యుల్లో కూడా మీపై గౌరవం పెరుగుతుంది. చుట్టుపక్కల వారు కూడా మీతో మంచిగా వుంటారు'' అని సభ్యులు చెప్పారు.
తక్కువ చేసి మాట్లాడొద్దు
సభ్యులు చెప్పిన దానికి సరే అన్న రాజేష్‌, రాధికలో కూడా కచ్చితంగా మార్పు వస్తేనే తను కూడా మారగలనని అన్నాడు. ఆమెతో కూడా మాట్లాడతామని రాజేష్‌ను బయటకు వెళ్ళమని చెప్పి రాధికను పిలిచి ''నువ్వు నీ భర్త కావాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వు కూడా అతన్ని రెచ్చగొట్టడం మానుకో. మీ అక్కవాళ్ళ భర్తలతో నీ భర్తను పోల్చుకోవద్దు. అది నీకే అవమానం. నీ భర్తను నిర్లక్ష్యం చేయకు. మీ ఇద్దరి మధ్య సమస్యకు కారణమైన తాగుడు మానుకోమని అతనికి గట్టిగానే చెప్పాం. నువ్వు కూడా అతనికి ఇష్టం లేని పనులు చేయొద్దు. కొన్ని రోజులు మీ అక్కవాళ్ళతో మాట్లాడకపోయినా పర్వాలేదు. ముందు నీ సంసారం గురించి ఆలోచించు.
పాత విషయాలు గుర్తుచేసుకోవద్దు
మనం పురుషాధిక్య సమాజంలో వున్నాం. ఆ భావజాలంతో పెరిగినవారు ఇలాగే తయారవుతారు. చాలామంది మగవారు ఇంట్లో తమ మాటే నెగ్గాలని అనుకుంటారు. వినకపోతే కొట్టి వారి అక్కసును తీర్చుకుంటారు. భర్త నుండి విడిపోయి నువ్వు ముగ్గురు పిల్లలతో పుట్టింట్లో ఎన్ని రోజులు వుండగలవు. పైగా ఇలా పుట్టింట్లో వుంటే నీ భర్తకు నువ్వే పూర్తి స్వేచ్ఛనిచ్చిన దానివవుతావు. చుట్టూవున్న సమాజాన్ని అర్థం చేసుకో. నీ భర్తతో లౌక్యం తెలిసి నడుచుకో. అతనితో మంచిగా వుంటూనే మార్చుకో. మేము ఇక్కడ మాట్లాడినంత మాత్రాన అతనిలో మార్పు ఒక్కసారిగా రాదు. నీ ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. పదే పదే పాత విషయాలు గుర్తు చేసుకోవద్దు. నీకు అతనితో ఎలాంటి సమస్య వచ్చినా మాకు చెప్పు. మార్పు వచ్చేవరకు మేము అతనితో మాట్లాడతాం. నువ్వు మాత్రం పెద్ద పెద్దగా అరిచి అతనితో గొడవపెట్టుకోకు'' అని చెప్పారు. రాధిక సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తానంది.
నమ్మకం ఉండాలి
తర్వాత సభ్యులు ఇద్దరినీ కూర్చోబెట్టి ''మీ ఇద్దరికీ ఏ చిన్న సమస్య వచ్చినా మాదగ్గరకు రండి. అంతేగానీ కొట్టుకోవద్దు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానండి. ఇప్పటి వరకూ ఇద్దరూ కొన్ని పొరపాట్లు చేశారు. ఇప్పటి నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. సమస్యలను అర్థం చేసుకొని సర్దుకుపోండి. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోండి. అప్పుడే మీ సంసారం హాయిగా వుంటుంది. ఇద్దరూ కొన్ని వారాల పాటు లీగల్‌ సెల్‌కు వచ్చి ఎలా వుంటున్నారో చెప్పండి'' అన్నారు.
ఇద్దరూ సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తామని చెప్పి రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రతి వారం ఇద్దరూ కలిసి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ఎలా ఉన్నారో చెప్పి సంతకాలు చేసి వెళుతున్నారు.

- సలీమ

పోల్చితే భరించలేను

MORE STORIES FROM THE SECTION

manavi

ఐద్వా అదాలత్‌

ఇకపై తప్పించుకోలేవు

10-04-2021

అంజలీ, అరవింద్‌ భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అరవింద్‌ కూరగాయల వ్యాపారం చేస్తాడు. కొడుకు పుట్టే వరకు ఆమెకు ఎలాంటి సమస్యా లేదు. ఇంట్లో మహరాణిలా ఉండేది. బాబు పుట్టిన దగ్గర నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. భర్తకు ఆమెపై అనుమానం.

manavi

ఐద్వా అదాలత్‌

ఒంటరి ఆడపిల్లంటే అలుసు

20-03-2021

హసీనకు ఇద్దరు అక్కలు, ఓ అన్నయ్య. ఇంట్లో తనే చిన్నది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇంటినీ, పిల్ల్లల్ని సరిగా

manavi

ఐద్వా అదాలత్‌

అతన్ని భరించడం కష్టం

13-02-2021

సుశీలకు ముగ్గురు అక్కలు, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తుంది. తండ్రి కూడా ఏవో చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాడు. అంత కుటుంబానికి

manavi

ఐద్వా అదాలత్‌

ఆనందమంటూ అగాధంలోకి

30-01-2021

ఆమె ఇల్లు సరిగా పట్టించుకోదు. అసలు ఇంట్లోనే సరిగా ఉండదు. ఎప్పుడూ స్నేహితులతో కలిసి బయటకు వెళుతుంది. చాలా సార్లు రాత్రి పూట కూడా ఇంటికి రాదు. భర్తతో ప్రేమగా ఉండదు. బాబును పట్టించుకోదు. ఎలాగైనా తన

manavi

ఐద్వా అదాలత్‌

మార్పు రావాలంటే ఓపిక పట్టాలి

16-01-2021

ఆమెకు పెండ్లయి ఏడాదిన్నర. నాలుగు నెలల పాపవుంది. భర్త నోరు తెరిచి అస్సలు మాట్లాడడు. సరైన సంపాదన లేదు. ఇంట్లో పెత్తనమంతా మామదే. భర్తకు సంపాదన లేకపోవడంతో మామతో సూటి పోటి మాటలు

manavi

ఐద్వా అదాలత్‌

బంధాలను బలపరుచుకోవాలి

02-01-2021

చిన్నప్పటి నుండి ఒంటరి పోరాటం ఆమెకు అలవాటు. కష్టపడి చదువుకుంది. ఈ సమాజంలో నెగ్గుకు రాగలిగే ధైర్యాన్ని అలవాటు చేసుకుంది. స్నేహితుల ద్వారా పరిచయమైన వ్యక్తిని పెండ్లి చేసుకుంది. కాని అక్కడ ఆమె ఇమడలేక