ప్రేమించి మోసపోయాను | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఐద్వా అదాలత్‌

ప్రేమించి మోసపోయాను

రమేష్‌కు తల్లిదండ్రులు లేరు. బంధువుల ఇండ్లల్లోనే పెరిగాడు. చెప్పేవారు లేక అల్లరి చిల్లరిగా తయారయ్యాడు. చదువులోనూ అంత చురుగ్గా ఉండేవాడు కాదు. పదో తరగతి తర్వాత చదువు పక్కన పెట్టి ఓ ఆటో తీసుకుని నడిపేవాడు. అలా ఆటో నడిపుతున్న రమేష్‌కు ఇంటర్‌ చదివే మమత పరిచయమయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకోవాలనుకున్నారు.
  తల్లిదండ్రులు లేకుండా అల్లరి చిల్లరిగా పెరిగిన రమేష్‌కు కూతుర్నివ్వడం మమత ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేదు. అయితే అతన్ని చేసుకోకపోతే చచ్చిపోతానంటూ మమత తల్లిదండ్రులను బెదిరించింది. వాళ్ళకు మమత ఒక్కతే కూతురు. ఈ పెండ్లికి ఒప్పుకోకపోతే కూతురు ఏం చేసుకుంటుందో అని పెండ్లి చేశారు. అప్పటి నుండి రమేష్‌ మమత వాళ్ళ ఇంట్లోనే వుండేవాడు. ఆటోకు సరిగా వెళ్ళడు.
అల్లుడికి పెద్దగా సంపాదన లేదు. దాంతో ఆరేండ్లు ఇద్దరినీ మమత తండ్రే చూసుకున్నాడు. మమత మాత్రం చిన్న ఉద్యోగం చేసేది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. రమేష్‌ ఇంటి గురించి ఏమీ పట్టించుకోడు. అన్నీ మమతనే చూసుకునేది. ఏదైనా అవసరం ఉంటే బంధువుల సాయం తీసుకునేది. మమత చాలా చురుకైన అమ్మాయి. అందరితో చనువుగా మాట్లాడుతుంది. ఇది రమేష్‌కు నచ్చలేదు. పైగా ఇల్లరికం ఉండటం అతనికి నచ్చలేదు. దాంతో దూరపు బంధువు సిటీలో పని ఇప్పిస్తానంటే పిల్లల్ని తీసుకుని ఇద్దరూ సిటీకి వచ్చేశారు.
ఇక్కడికి వచ్చాక ఖర్చులు పెరిగాయి. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఖర్చులు ఇవన్నీ భరించడం కష్టమయింది. రమేష్‌కి వచ్చేది పది వేలు. మమత ఉద్యోగం చూసుకుంది. ఎంత వచ్చినా పిల్లల చదువుల కోసం అప్పుచేయాల్సి వచ్చేది. అప్పు కోసం రమేష్‌ తెలిసిన వారి దగ్గర మమతతో అడిగించే వాడు. ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ అయ్యాయి.
మమత ఆఫీసులో అందరితో చనువుగా మాట్లాడటంతో ఆమెపై రమేష్‌ కోపం పెంచుకున్నాడు. ఆ విషయంపై భార్యతో గొడవపెట్టుకునేవాడు. రోజురోజుకు రమేష్‌కు భార్యపై అనుమానం పెరిగిపోతోంది. విపరీతంగా కొట్టేవాడు. ఓ పక్క పిల్లలు ఎదుగుతున్నారు. వారికి మంచి భవిష్యత్‌ చూపించాలి. ఇవేవీ అతనికి పట్టవు.
చివరకు ఓ సారి మమత ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ ప్రమాదం నుండి ఎలాగో బయటపడింది. కానీ రమేష్‌ ప్రవవర్త మాత్రం ఏ మాత్రం మారలేదు. పిచ్చి వాడిలా తయారయ్యాడు. ఎంత చెప్పినా ఎవ్వరి మాటా వినేవాడు కాదు. ఓ రోజు మమతను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు.
ఇక అతన్ని భరించడం కష్టమనే అభిప్రాయానికి వచ్చింది మమత. ఓ స్నేహితురాలు చెబితే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ''మేడమ్‌ ఇక నేను అతన్ని భరించలేను. అతని వల్ల నాకు ప్రాణ హాని ఉంది. అతనితో కలిసి ఉంటే నేను చస్తానో, బతుకుతానో చెప్పలేను. దయచేసి అతన్ని నా నుండి దూరంగా వెళ్ళమనండి. నాకు కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదు. లాయర్లకు డబ్బులు ఖర్చుపెట్టలేను. దయచేసి నాకూ, నా పిల్లలకు న్యాయం చేయండి'' అంటూ ప్రాధేయపడింది.
మమత మాటలు విన్న సభ్యులు రమేష్‌ని రమ్మని లెటర్‌ పంపారు. తర్వాతి వారం అతను పిన్నీ, బాబాయితో వచ్చి 'మమతకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఆమె ప్రవర్తన మంచిది కాదు. నేను అడుగుతున్నానని నా నుండి దూరంగా వెళ్ళాలనుకుంటుంది. నాకు ఆమే, పిల్లలు కావాలి' అన్నాడు.
దానికి సభ్యులు 'నీకు సంపాదించడం చాతకాదు. భార్యా, పిల్లల్ని చూసుకోవడం తెలీదు. బాధ్యత తెలియని వాడివి. పైగా ప్రేమించి పెండ్లి చేసుకున్నావు. ఇదేనా ప్రేమంటే. ప్రేమించిన ఒకే ఒక్క కారణంతో నిన్ను పదిహేనేండ్లు భరించింది. ఇన్నేండ్ల నుండి ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంది. ఆమె ప్రవర్తన గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. డబ్బులు అవసరమైనప్పుడల్లా ఆమెతో ఆడిగించావు. అప్పుడు గుర్తుకు రాలేదా నీకు భార్య ఏమౌతుందో. ఈ సమాజంలో ఆడవాళ్ళను ఎలా చూస్తారు. నీ చాతగాని తనమే నీ సమస్యకు కారణం. ఉద్యోగం చేసే ఆమె నలుగురితో కలివిడిగా ఉండాలి. నువ్వు ఇంట్లో ఏమీ పట్టించుకోవు. ఆమె తెలిసిన వారి సాయంతో ఇల్లు నెట్టుకొస్తుంది. పక్కింటి వారితో కాస్త చనువుగా మాట్లాడితే సంబంధాలు అంటకట్టేయడమేనా? ముందు నీ ప్రవర్తన మార్చుకో. బాధ్యతగా ఉండు. అప్పుడు ఆమెను ప్రశ్నించు' అన్నారు.
మమతతో మాట్లాడుతూ 'ఇన్నేండ్లు అతన్ని భరించావు. మరొక్క అవకాశం ఇవ్వు. అతనితో ఇప్పటికైనా మార్పు వస్తుందేమో చూద్దాం' అన్నారు సభ్యులు. దానికి ఆమె 'నన్ను క్షమించండి మేడమ్‌. ఇక నా వల్ల కాదు. ఇన్నేండ్లు అతనితో భరిస్తూనే ఉన్నాను. మారతాడని ఎదురు చూశాను. ఇక భరించే ఓపిక లేదు. నా బతుకు నేను బతుకుతాను. దయచేసి అతని నుంచి నాకు రక్షణ కల్పించండి. ముందు నా పిల్లలకు ఓ దారి చూపించాలి. ప్రేమ పేరుతో మోసపోయాను. మా అమ్మానాన్నను ఎదిరించి పెండ్లి చేసుకున్నా. అప్పుడు వాళ్ళను ఎంతగా బాధపెట్టానో. అయినా మా నాన్న మా కోసం చాలా చేశారు. ఆ విశ్వాసం కూడా ఆయనకు లేదు. అలాంటి వాడితో ఇక నేను ఉండలేను' అంది.
రమేష్‌ పిన్నీ, బాబాయి మాట్లాడుతూ 'అతనికి అనుమానం ఉన్నమాట వాస్తవం. వారి మధ్య సమస్యలు ఉన్నాయి. కానీ విడిపోవడం మాత్రం మాకు ఇష్టం లేదు' అన్నారు.
'భార్యాభర్తలు విడిపోవడం ఎవరికి మాత్రం ఇష్టం. చక్కని సంసారాన్ని నాశనం చేసుకోవాలని ఏ ఆడపిల్లా అనుకోదు. కానీ మమత ఇన్నేండ్లు భరించి ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చింది. ఆమె మనసు విరిగిపోయింది. ఓపిక నశించింది. ఇష్టం లేకుండా బలవంతంగా ఎవరినీ కలపలేం. మీరు కూడా ఓ సారి మమతతో మాట్లాడండి. ఆమె ఒప్పుకుంటే వారిద్దరినీ కలుపుదాం' అన్నారు.
వాళ్ళు కూడా మమతకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. 'మీరు కూడా ఇన్నేండ్ల నుంచి మమ్మల్ని చూస్తున్నారు. నేను ఎన్ని కష్టాలు అనుభవించానో మీరూ కండ్లారా చూశారు. ఇక అతను మారతాడనే నమ్మకం నాకు లేదు. కాబట్టి నేను అతనితో కలిసి బతకలేను' అని కచ్చితంగా చెప్పేసింది.
'ఆమెకు నాతో ఉండటం ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటాను. నాకూ ఆమె అవసరం లేదు' అన్నాడు రమేష్‌.'మీరు విడిపోతే మరి పిల్లల పరిస్థితి ఏమిటి' అన్నారు సభ్యులు. 'మీరే చెప్పండి, మీరు ఎలా చెబితే అలా చేస్తాను. కావాలంటే పిల్లల్ని నాతో తీసుకెళతాను' అన్నాడు రమేష్‌.
పిల్లలు నీతో రావడానికి ఇష్టపడడం లేదు. కానీ నువ్వు నెల నెల పిల్లల కోసం కొంత డబ్బు ఇవ్వాలి. తర్వాత నీ ఆస్తిలో వచ్చే వాటాను పిల్లల పెండిండ్లకు ఇవ్వాలి' అన్నారు.
దానికి అతను 'మీరు చెప్పినట్టే చేస్తాను. వాళ్ళు నా పిల్లలు. వాళ్ల కోసం చేయకుండా ఎలా వుంటాను. అయితే పిల్లల పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే ఆ అకౌంట్లోనే డబ్బులు వేస్తా. ఊర్లో నాకు ఓ ఇల్లు ఉంది. అది నా పిల్లలకే రాసి ఇచ్చేస్తా' అన్నాడు.
దీనికి ఇరువైపుల వారు ఒప్పుకున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత పిల్లల పేరుతో ఓ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. ప్రస్తుతం రమేష్‌ నెల నెలా ఐదు వేలు పిల్లల అకౌంట్లో వేస్తున్నాడు. కూతురికి సహాయంగా వుండేందుకు మమత తల్లిదండ్రులు కూడా సిటీకి వచ్చేశారు.
- సలీమ

ప్రేమించి మోసపోయాను

MORE STORIES FROM THE SECTION

manavi

ఐద్వా అదాలత్‌

ఇకపై ఇబ్బంది పెట్టను

15-02-2020

అంజలి ఇంటి పక్క గదిలో అద్దెకు దిగాడు అరవింద్‌. అప్పటికే అతని భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళు నాయనమ్మ దగ్గర పెరుగుతున్నారు. అరవింద్‌ తన విషయాలన్నీ అంజలితో చెప్పుకునేవాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా

manavi

ఐద్వా అదాలత్‌

ఓడిపోతే దిగులుపడొద్దు

10-02-2020

మహిళలు నేటి సమాజంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏ విషయంలోనూ తక్కువ కాదని తమను తాము నిరూపించుకుంటున్నారు. అలాంటి వారిలో నాంపల్లి నాగలక్ష్మి ఒకరు. ఓ మహిళ ఇంటి నుంచి కాలు బయట పెడితే వేలేత్తి చూపే వారు ఇంకా మన చుట్టూ ఎందరో ఉన్నారు.

manavi

ఐద్వా అదాలత్‌

ఇద్దరూ మారాల్సిందే...

08-02-2020

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన రమ్య ఇంట్లో అరుణమ్మ వంట పని చేస్తున్నది. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా పని చేసే అరుణమ్మ ఆ రోజు ఎందుకో దిగులుగా కనిపించింది. విషయం ఏంటని అడిగింది రమ్య. రెండు

manavi

ఐద్వా అదాలత్‌

మారకపోతే కష్టం...

01-02-2020

దీప్తి ఓ షాప్‌లో పనికి కుదిరింది. అక్కడ రెండు సంవత్సరాలు చేసింది. తర్వాత ఓ చిన్న ఆఫీస్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. వయసుకొచ్చిన ఆడపిల్లను ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని

manavi

ఐద్వా అదాలత్‌

అతన్ని వదలను...

25-01-2020

మౌనిక ఆ ఇంటికి పెద్ద కూతురు. ఈమె తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు. తండ్రి ఇల్లు పట్టించుకోడు. ఫుల్లుగా తాగి ఇంటికొస్తాడు. లోక జ్ఞానం తెలియని తల్లి. భర్త హింసిస్తున్నా ప్రశ్నించాలని తెలియనంత అమాయకత్వం ఆమెది. ప్రస్తుతం మౌనికనే ఆ ఇంటికి పెద్ద దిక్కు. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది.