భార్యను కూడా గౌరవించు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఐద్వా అదాలత్‌

భార్యను కూడా గౌరవించు...

కీర్తికి ముఫ్పై ఏండ్లు. ఇంకా పెండ్లి కాలేదు. తల్లిదండ్రుల దిగులంతా ఆమె పెండ్లి గురించే. వాళ్ళ వయసైపోయింది. దాంతో కీర్తి అక్క ఆమె పెండ్లి బాధ్యత తీసుకుంది. సంబంధాలు వెదకడం మొదలుపెట్టింది. ఓ సంబంధం కుదిరింది. అబ్బాయి పేరు శ్రీధర్‌. ఘనంగా పెండ్లి చేసి అత్తారింటికి పంపారు. పెండ్లయిన రోజు నుండే అక్కడ ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. దాంతో తన సమస్య పరిష్కరించమంటూ అక్కను తీసుకుని కీర్తి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
''మా చెల్లికి ఎన్నో సంబంధాలు చూశాం. లావుగా వుందని వచ్చిన సంబంధాలన్నీ వెనక్కు పోయేవి. చివరికి ఈ సంబంధం కుదిరింది. మేము కూడా పెండ్లయితే చాలు అన్నట్టు వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకోకుండా తొందరపడ్డాం. నా చెల్లి జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేశాను. కీర్తి జీవితం గురించి ఆలోచించి తమ్ముడు గుండెపోటుతో చనిపోయాడు. అమ్మానాన్న పెద్దవాళ్ళు. ఇల్లు గడవడం కష్టమై మా నాన్న ఈ వయసులో వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మీరే ఎలాగైనా మా చెల్లెలి జీవితానికి ఓ పరిష్కారం చూపాలి' అంది కీర్తి అక్క.
అసలు సమస్య ఏంటని లీగల్‌ సెల్‌ సభ్యులు కీర్తిని అడిగితే ''పెండ్లయిన నాటి నుండే ఆ ఇంట్లో నన్ను మానసికంగా వేధిస్తున్నారు. మొదటి రోజే ఆయన నాతో ''ఇంత లావుగా ఉన్నావు నీ పక్కన నేను తమ్ముడిలా వున్నాను'' అన్నాడు. ''పెండ్లికి ముందే చూశావుగా మరి పెండ్లెందుకు చేసుకున్నావు'' అని అడిగాను. 'మా అక్క చెప్పింది కాబట్టి చేసుకున్నా' అన్నాడు. మా ఆడపడుచు భర్త ఎక్కడో ఉంటాడు. అతన్ని వదిలిపెట్టి ఆమె ఇక్కడే ఉంటుంది. మా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుంది. అక్క, అమ్మ ఎంత చెబితే అంతా ఆయనకు. ముగ్గురు కలిసి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ప్రతి దానికీ గొడవ పెట్టుకుంటారు. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తారు.
పెండ్లయిన నెల రోజులకే నేను నెల తప్పాను. శ్రీమంతం రోజు అందరి ముందే మా ఆడపడుచు ''మా తమ్ముడి పక్కన నువ్వు అక్కలా వున్నావు'' అంది. చాలా బాధగా అనిపించింది. ఆ సమయంలోనే వాళ్ళ బంధువుల ద్వారా నాకు ఓ విషయం తెలిసింది. మా ఆడపడుచు భర్తను వీళ్ళంతా కలిసి చంపించాలనుకున్నారంట. ఆ కేసు ఇంకా నడుస్తుంది. ప్రతి నెలా కోర్టుకు వెళుతుంటారు. నాతో మాత్రం ఏదో పొలం సమస్య అని చెప్పేవాళ్ళు. అసలు విషయం నాకు తెలియడంతో నేను మా అక్కకు చెప్పాను. నా ఫోన్‌లో ఆయన నాకు తెలియకుండా రికార్డింగ్‌ పెట్టాడు. దాంతో నేను మాఅక్కతో మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు విన్నారు.
ఇక అప్పటి నుండి టార్చర్‌ మొదలయింది. నన్ను మా పుట్టింటికి వెళ్ళనీయరు. ఫోన్‌ చేయనీయరు. నా ఫోన్‌ కూడా తీసేసుకున్నారు. ''ఇంట్లో విషయాలు బయట చెబుతావా'' అని నానా మాటలు అన్నారు. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా హింసించారు. మా అన్నయ్య పెద్దమనుషుల్లో కూర్చోబెట్టి మాట్లాడదాం అని ఓ రోజు నాకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత రోజే గుండెపోటుతో చనిపోయాడు. ఆ విషయం చెప్పడానికి మా బావ ఫోన్‌ చేస్తే ఒక్కళ్ళు కూడా ఫోను ఎత్తలేదు. చివరకు మెసేజ్‌ పెడితే అప్పుడు నన్ను పంపారు.
డెలివరీకి కూడా నన్ను మా పుట్టింటికి పంపలేదు. డెలివరీ తర్వాత కూడా అక్కడికే తీసుకెళ్ళారు. వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ గొడవ. ఇక అక్కడ ఉండలేక మా పుట్టింటికి వచ్చేశాను. ఇప్పటికి ఏడాది అయింది. అయినా బాబును చూసేందుకు ఆయన ఒక్కసారి కూడా రాలేదు'' అంటూ ఏడ్చేసింది.
కీర్తి చెప్పింది అంతా విన్న లీగల్‌సెల్‌ సభ్యులు అక్కను, తల్లిని తీసుకుని రమ్మని శ్రీధర్‌కు లెటర్‌ పంపారు. కానీ అతను రెండు వారాలైనా రాలేదు. దాంతో లీగల్‌సెల్‌ సభ్యులు ఫోన్‌ చేస్తే వచ్చే వారం వస్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారమే వచ్చి...
''కీర్తి మంచిదే. కానీ వాళ్ళ అక్కే ఆమెకు అన్నీ నేర్పుతుంది. మా ఇంట్లో వున్నప్పుడు కీర్తిని మేమెంతో ప్రేమగా చూసుకున్నాం. కడుపుతో వున్నప్పుడు మా అక్క తన కోసం ఎంతో చేసింది. అవేవీ ఆమెకు గుర్తు లేవు. బాబును తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతా వాళ్ళ అక్క వల్లనే. లేదంటే మా మధ్య ఎలాంటి ఇబ్బంది రాదు'' అన్నాడు శ్రీధర్‌.
''మీరు కీర్తిని ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేస్తున్నారు. ఆమె లావుగా ఉందని నీకు ముందే తెలుసు. అప్పుడే చెప్పాలి. కానీ పెండ్లి తర్వాత మాటి మాటికి అలా అంటుంటే ఆమె మనసు గాయపడదా? ఇంట్లో అన్నీ సౌకర్యాలూ ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే ఎవ్వరూ ఉండలేరు. ఇప్పుడు కీర్తి పరిస్థితి కూడా అంతే. నువ్వు ఆమె పట్ల ప్రేమగా, బాధ్యతగా వుంటేనే తను వుండగలుగుతుంది. అయినా నీ భార్య పుట్టింటికి వెళ్ళి ఏడాది అయింది. ఒక్కసారి కూడా చూడటానికి వెళ్ళలేదు. ఇక నీ కొడుకు నీకు ఎలా దగ్గరవుతాడు. కొడుక్కూ, భార్యకు దూరంగా వుంటూ నువ్వు మాత్రం ప్రశాంతంగా వున్నావా. నీ జీవితాన్ని నువ్వే పాడుచేసుకుంటున్నావు'' అన్నారు.
''ముందు కీర్తి మా అక్కను, అమ్మను గౌరవించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అలాగే వాళ్ళ అక్కతో మాట్లాడడం మానుకోవాలి'' అన్నాడు.
''మీ అక్కతో మాట్లాడకుండా నువ్వు వుంటావా? ఆమెను మీ ఇంట్లో నుండి భర్త దగ్గరకు పంపిస్తావా?'' అని అడిగారు లీగల్‌సెల్‌ సభ్యులు.
''అదెలా కుదురుతుంది. తనకు భర్త వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే మా దగ్గర వుంటుంది. ఆమెకు మేం కాకుండా ఇంకెవరున్నారు'' అన్నాడు.
''మరి కీర్తి కూడా అంతే. ఉన్న ఒక్క అన్నా ఆమె దిగులుతూనే పొయ్యాడు. ఇప్పుడు ఉన్నది ఆ అక్కచెల్లెళ్ళు ఇద్దరే. వాళ్ళను కూడా మాట్లాడుకోవద్దంటే ఎలా? అయినా మీ విషయాలు ఏవో ఆమె అక్కకు చేరేస్తుంది అనుకుంటున్నావు. ఏం చెప్పింది తను. కేవలం మీ బావ హత్యా ప్రయత్నం గురించే కదా. ఈ విషయం మీరు పెండ్లికి ముందే వాళ్ళకు చెబితే అసలు ఈ సమస్య ఉండేదే కాదు. తప్పు చేసింది మీరు. నిజం దాచి పెట్టి పెండ్లి చేశారు. ఇప్పటికైనా ఆలోచించుకో. ఒక పక్క మీ అక్క పుట్టింట్లోనే వుంటుంది. నువ్వు కూడా భార్యను ఇలా వదిలేస్తే మీ కుటుంబ పరిస్థితి ఏమిటి. అందరూ మీ గురించి ఎలా మాట్లాడుకుంటారు. బంధువులు మిమ్మల్ని గౌరవిస్తారా?
ఇంట్లో మీ అక్కను, అమ్మను ఎలా గౌరవిస్తున్నావో అలాగే నీ భార్యను కూడా గౌరవించు. అప్పుడు మీ మధ్య సమస్యలు వస్తే మాతో చెప్పు. నువ్వు చెయ్యాల్సినవి చేయకుండా తప్పులన్నీ ఆమెపైనే వేస్తే ఎలా'' అన్నారు.
అంతా విన్న శ్రీధర్‌ లీగల్‌సెల్‌ సభ్యులు చెప్పినట్టే చేస్తా అన్నాడు. కానీ కీర్తి మాత్రం ముందు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మూడు నెలలు చూసి అప్పటికీ పరిస్థితి అలాగే ఉంటే అప్పుడు నీ ఇష్టప్రకారం చేద్దువు గానీ అని లీగల్‌సెల్‌ సభ్యులు ధైర్యం చెప్పి పంపారు. అక్కడకు వెళ్లిన తర్వాత వారం వారం లీగల్‌సెల్‌ సభ్యులకు కీర్తి ఫోన్‌ చేసి భర్త గురించి చెప్పేది. మూడు నెలల తర్వాత కీర్తి అక్కను తీసుకుని మళ్ళీ లీగల్‌సెల్‌కు వచ్చి ''మేడమ్‌ ప్రస్తుతం శ్రీధర్‌లో కొంత మార్పు వచ్చిందని, గతంలోలా ఎగతాళి చేయడం లేదు. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరే వస్తా'' అన్నది.
''రేపు రేపు వాళ్ళు ఏమైనా అన్నా నువ్వు గొడవ పెట్టుకోకు. భర్త, ఆడపడుచు కదా అప్పుడప్పుడు సరదాగా ఆటపట్టిస్తుంటారు. వాటిని కూడా నువ్వు సీరియస్‌గా తీసుకొని మనసు పాడుచేసుకోవద్దు. నవ్వు కూడా వాళ్ళతో ప్రేమగా ఉండు. అత్తను, ఆడపడుచును గౌరవించు'' అని చెప్పి పంపించారు.
- సలీమ

భార్యను కూడా గౌరవించు...