హామీ పత్రం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిపండుగ స్పెషల్

హామీ పత్రం

డియర్‌ ప్రదీప్‌
ఈ నేను చెప్పబోయే సమాధానం కోసం నువ్వెంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటావని నాకు తెలుసు.
సమాధానం చెప్పే ముందు నేను నీతో మాట్లాడాల్సిన విషయాలు ఎన్నో వున్నాయి.
''సంవత్సరం నుంచి మనం కలిసి తిరుగుతున్నాం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకుని పెండ్లి దాకా వచ్చిన టైంలో ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి ఏముంటాయి?'' అని ఆశ్చర్యంగా వుంది కదూ!
'వాలెంటెన్స్‌ డే' రోజున మన పెండ్లి గురించి నా ఒపీనియన్‌ చెప్పమని అడిగావు. జీవితంలో మనం తీసుకోబోయే అతి ముఖ్యమైన నిర్ణయం ఇది. అందుకే ఏడాది కాలంగా మన మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ మళ్ళీ ఒకసారి రికలెక్ట్‌ చేసుకున్నాను. అప్పుడే అర్ధం అయింది. ఎన్నో ప్రశ్నలు ఇంకా అస్పష్టంగానే మిగిలిపోయాయని. వాటన్నిటికీ సమాధానాలు చెప్పవలసిందీ, చెప్పగలిగిందీ నువ్వే.
అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను.
లాస్ట్‌ ఇయర్‌ 'వాలెంటెన్స్‌ డే' రోజున నువ్వు ప్రపోజ్‌ చేసినప్పుడు నేను నిజంగానే హ్యాపీగా ఫీల్‌ అయాను. ఎందుకో తెల్సా? నీకున్న పుస్తక పరిజ్ఞానం, ఏ విషయం మాట్లాడినా ఒక స్పష్టమైన అవగాహనతో మాట్లాడగల నీ నేర్పరి తనం నాకెంతో నచ్చేవి. అందుకే నీ ప్రపోజల్‌ని నిరాకరించలేకపోయాను.
కానీ... ఇద్దరు వ్యక్తులు పెండ్లి చేసుకుని, ఆనందంగా కలిసి జీవించటానికి వీటి కన్నా ముఖ్యమైన విషయాలు చాలా
వుంటాయనే వాస్తవాన్ని ఈ ఒన్‌ ఇయర్‌లో అర్థం చేసుకోగలిగాను.
ప్రేమ వివాహం వల్ల పెండ్లికి ముందే ఒకరి నొకరు అర్ధం చేసుకోగలుగుతారు. కాబట్టి.. పెండ్లి తర్వాత ఇద్దరి మధ్య సర్ధుబాటు తనం వుంటుందని అనుకున్నాం.
కానీ వాస్తవంలో జరిగింది ఏంటి?
ఒకరి నొకరం ఇంప్రెస్‌ చేసుకోవటం కోసం మన సహజమైన అలవాట్లని, మన స్వభావాన్ని బయటకు రానీయ కుండా జాగ్రత్త పడుతూ
భయం భయంగా గడిపేశాం. ఈ క్రమంలో ఒకరినొకరం మోసం చేసుకోవటమే గానీ అర్ధం చేసుకున్నది ఎక్కడీ
ఈనాటి 'యువత ప్రేమ' మీద పెద్దవాళ్ళకి నమ్మకం లేదని మనం అనుకుంటాం. నిజానికి ప్రేమ మీద నమ్మకం లేనిదీ, దాని అర్ధం కూడా సరిగ్గా తెలీనిదీ మన జనరేషన్‌కీ, మన తర్వాతి జనరేషన్‌కే అనిపిస్తోంది. అందుకే ప్రేమలు హైస్కూల్‌ నుంచే పుట్టుకు వస్తున్నాయి. ప్రేమకి, ప్రేమికులకి (ఆడ, మగ ఇద్దరికీ) ఛాయిస్‌లు కూడా ఎక్కువగానే వుంటున్నాయి.
అమ్మాయికి బారుఫ్రెండ్‌, అబ్బాయికి గళ్‌ ఫ్రెండ్‌ అనేది ఒక సోషల్‌ స్టేటస్‌గా మారిపోయింది. మాయమాటలతో, ఖరీదైన గిఫ్ట్స్‌తో ఆడపిల్లల్ని చిటికెలో పడేయచ్చనే భ్రమలో మగపిల్లలు, చదువు, కెరీర్‌, కుటుంబం అన్నింటినీ వదిలేసి, మగపిల్లలు ప్రతిక్షణం తమ చుట్టూ తిరుగుతుంటే దవానే 'కేరింగ్‌'గా ఫీలయి ఆనందపడిపోయే అమ్మాయిలు... వీళ్ళ ప్రేమలో నిజాయితీ ఎక్కడుంది? ఈ ఆత్మవంచనని 'ప్రేమ' అంటే నమ్మేంత పిచ్చివాళ్ళు కాదు మన పెద్దవాళ్ళు.
అలా అని అందరి ప్రేమ అలాగే వుంటుందని నేనను. స్వచ్ఛమైన మనసుతో ప్రేమించే ప్రేమికులు కూడా వున్నారు. మన ప్రేమ కూడా అలాగే వుండాలనేది నా కోరిక.
నా పుట్టినరోజునాడు ''అమ్మ హాస్పిటల్‌లో వుంది. బర్త్‌డే రోజు నిన్ను అప్‌సెట్‌ చేయటం ఇష్టం లేక ఇంట్లో చిన్న అబద్ధం చెప్పి వచ్చాను'' అని నువ్వు చెప్పినప్పుడు
నేను చాలా గిల్టీగా ఫీల్‌ అయాను. పరిస్థితుల్ని అర్ధం చేసుకోలేని ఒక 'క్రేజీ గళ్‌' కింద నన్ను అంచనా వేసి, నా వ్యక్తిత్వాన్ని కించపరచినట్టు అనిపించింది. ఆరోజు నీ కండ్లలో మీ అమ్మని వదిలి వచ్చిన బాధ చాలా స్పష్టంగా కనిపించింది నాకు. అదే కనక నువ్వు ఫోన్‌ చేసి ''నేనీ రోజు నిన్ను కలవలేక పోతున్నాను' అని
చెప్పి, ఫోన్లోనే విష్‌ చేసి వుంటే నా మీద నీకున్న నమ్మకానికి చాలా హ్యాపీగా ఫీల్‌ అయేదాన్ని. అంత కంటే కూడా ఇంత బాధ్యత గల వ్యక్తికి భార్యని అవుతున్నానన్న సంతోషం నాకు మిగిలేది.
మన మధ్య పెండ్లి ప్రస్థావన వచ్చినప్పుడల్లా 'అమ్మానాన్నలని ఎదిరించయినా సరే నిన్ను పెండ్లి చేసుకుంటాను' అనే వాడివి. పెద్దవాళ్ళని ఎదిరించి కాదు, ఒప్పించి చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలే గానీ పారిపోకూడదు. ఈరోజు అమ్మానాన్నలకి సర్దిచెప్పుకోలేని వాళ్ళం, రేపు మన మధ్య ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్‌ చేయగలుగుతాం. 'మనం' అనే మాట వెనక మనిద్దరి కుటుంబాలు వుండాలి. ఈరోజు నాకు, రేపు మన పిల్లలకి కూడా అది చాలా అవసరం.
'మనం పెండ్లి చేసుకుంటే నాకేమి గిఫ్ట్‌ ఇస్తావు?' అని నేనడిగినప్పుడల్లా 'ఇట్స్‌ సర్‌ప్రైజ్‌' అంటూ ఒకసారి తాజ్‌మహల్‌, మరోసారి డైమండ్‌రింగ్‌ తీసుకొచ్చి చేతిలో పెట్టావు. నేను నిజంగానే సర్‌ప్రైజ్‌ అయాను. ఎన్నో విషయాల మీద అంత అవగాహనతో మాట్లాడే నీకు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఆనందంగా జీవించటానికి కావల్సింది ఏంటో తెలీకపోవటం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. బహుశ అది నీ తప్పు కాదేమో! అవతల వ్యక్తి గురించి ఏమీ ఆలోచించకుండా ఈకాలంలో కొందరు ఆడపిల్లలు చేసే డిమాండ్స్‌ కూడా అలాగే వుంటున్నాయి. ప్రతిరోజు సర్‌ప్రైజింగ్స్‌, ప్రతి నిమిషం వాళ్ళని హ్యాపీగా వుంచాలనే కండీషన్స్‌ మధ్య వాళ్ళ ప్రేమ కూడా చాలా సర్‌ప్రైజింగ్స్‌ గానే వుంటుంది... ఆయుష్షు లేకుండా.
ఇంతకీ నేను నీ నుంచి కోరుకున్న గిఫ్ట్‌ ఏంటో తెలుసా? ఒక పటిష్టమైన కుటుంబం. ఇంత విశాలమైన ప్రపంచంలో కూడా మనకి భద్రత కల్పించేది మన కుటుంబం మాత్రమే. రేపు మనం తెలిసో తెలీకో తప్పటడుగు వేసినా సరిదిద్దేందుకు 'మన' అనుకునే వాళ్ళు వుంటారు. అలా కాకుండా నాకు నువ్వు, నీకు నేను చాలు అనుకుంటే మనల్ని మనమే వెలివేసుకున్నట్టు ఒంటరి బతుకులు బతకాలి. అది నాకు ఇష్టం లేదు.
నిజానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రేమికులు ఈ 'వాలెంటెన్స్‌ డే' ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఎంత మంది ప్రేమ స్వచ్ఛంగా నిలబడగలుగుతోంది? ప్రేమ సక్సెస్‌ అయిందని చెప్పటానికి 'పెండ్లి' ఒక కొలబద్ద కాదు. ఇద్దరూ కలిసి జీవించ టానికి పెండ్లి ఒక స్టెపింగ్‌ స్టోన్‌ మాత్రమే. జీవితం లో చివరిదాకా ఒకరి కష్టసుఖాల్ని మరొకరు పంచుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడే ప్రేమ సక్సెస్‌ అయేది.
నేను కోరుకుంటున్నది కూడా అలాంటి ప్రేమనే. నువ్వు అర్థం చేసుకోగలవనే నమ్మకం నాకుంది.
ఇప్పుడు సమాధానం కోసం ఎదురు చూస్తోంది నేను. సమాధానం చెప్పవలసింది నువ్వు.....

 ప్రేమతో...
- నీ మానస

సరిగ్గా ప్రేమించడం కొందరికే తెలుసు. ఆ ప్రేమను నిలుపు కోవడం చాలా కొద్ది మందికే తెలుసు.

ప్రేమించడానికి సాహసించే వారికి వేదనను తట్టుకొనే ధైర్యం ఉండాలి.

- అమ్మాజీ
సైకాలజిస్ట్‌, ఫ్యామిలీ కౌన్సెలర్‌

హామీ పత్రం

MORE STORIES FROM THE SECTION

manavi

పండుగ స్పెషల్

ప్రేమ ఓ గొప్ప అనుభూతి

14-02-2021

'ప్రేమంటే పరస్పరం చూసుకోవడం కాదు. ఇద్దరూ ఒకే దృష్టికోణంలో బయటి ప్రపంచాన్ని చూడడం' అన్నాడు ఒక ఫ్రెంచి రచయిత. ఆనందాఁకి ద్వారాలు తీసే ప్రేమను ఎవరైనా ఆహ్వానిస్తారు. అటువంటి ప్రేమ కోసం

manavi

పండుగ స్పెషల్

సంక్రాంతి వంటలు

14-01-2021

రైతుల పండుగ అయిన సంక్రాంతిని మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. కొత్తగా పండిన పంటలతో చేసే వివిధ రుచుల పిండివంటలు సంక్రాంతి స్పెషల్స్‌గా నోరూరిస్తాయి. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తూ

manavi

పండుగ స్పెషల్

ముత్యాల ముగ్గులు

11-01-2021

సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. నింగిలోని నక్షత్రాలన్నీ నేలదిగి వాకిళ్లలో ముత్యాల ముగ్గులై మెరిసిపోతాయి. అలా ముంగిట రంగురంగుల ముగ్గులతో నింపే ఆడబిడ్డలకు

manavi

పండుగ స్పెషల్

ముత్యాల ముగ్గులు

08-01-2021

సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. నింగిలోని నక్షత్రాలన్నీ నేలదిగి వాకిళ్లలో ముత్యాల ముగ్గులై మెరిసిపోతాయి. అలా ముంగిట రంగురంగుల ముగ్గులతో

manavi

పండుగ స్పెషల్

సంక్రాంతి ముగ్గు

08-01-2021

సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. నింగిలోని నక్షత్రాలన్నీ నేలదిగి వాకిళ్లలో ముత్యాల ముగ్గులై మెరిసిపోతాయి. అలా ముంగిట రంగురంగుల ముగ్గులతో