పాత వస్తువులతో పసందుగా | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిగృహాలంకరణ

పాత వస్తువులతో పసందుగా

కరోనా వైరస్‌ ఓ అడుగు వెనక్కు వేసిందని కొద్దిగా సంతోషపడుతున్నాము. అదే సమయంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చేసిందనీ, అదీ మొదటగా కరోనా వారియర్స్‌కు ఇస్తున్నారనీ విని సంబరపడుతున్నాము. కానీ కరోనా వైరస్‌ అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. బెంగుళూరులోని బిలేకహళ్ళిలో ఉన్న అపార్టుమెంటులో తను ప్రవేశించింది. 1500 మంది నివసించే ఈ పెద్ద అపార్టుమెంటులోని 103 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 405 ఫ్లాట్లున్న ఈ అపార్టుమెంటులో విందు జరిగిందనీ, విందులో పాల్గొన్న వారందరికీ కరోనా సోకినట్టు తెలుస్తున్నది. ఎవరైతే కొద్దిగా రిలాక్స్‌ అయి అజాగ్రత్తగా ఉంటున్నారో, కరోనా వారిపై విరుచుకుపడుతుంది. అందు వలన ప్రతిక్షణమూ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అందుకే ఏ విందులకూ వినోదాలకూ వెళ్ళవద్దు. కరోనా పూర్తిగా మాయమైపోయిందని తెలిసే వరకు జాగ్రత్తలు పాటించండి. ఖాళీ సమయాన్ని బోర్‌ కొట్టే సమయాన్ని కళాత్మకంగా వాడండి.
సెలైన్‌ బాటిల్‌తో
ఒక చిన్న సెలైన్‌ బాటిల్‌, ఒక పెద్ద సెలైన్‌ బాటిల్‌ ఉంటే చాలు. ఒక ఫ్లవర్‌ వేజ్‌ తయారవుతుంది. పారవేసే ప్లాస్టిక్‌ బాటిళ్ళతో బొమ్మలు చేయడం వలన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించిన వాళ్ళమవుతాం. కొద్దిగానైనా భూమాతకు భారం తగ్గించిన వాళ్ళమవుతాం. పెద్ద సెలైన్‌ బాటిల్‌ను అడుగు భాగం కత్తిరించి పైది పారేయాలి. ఈ అడుగు భాగాన్ని రెక్కలుగా కత్తిరించి పువ్వువలె తయారు చేసి ఉంచుకోవాలి. మరో చిన్న సెలైన్‌ బాటిల్‌ను తీసుకొని మూతిభాగం కొద్దిగా కత్తిరించాలి. ఇప్పుడు తళుకులు, గుండు పిన్నీసులు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక గుండు పిన్నీసుకు ఒక తళుకును గుచ్చి, దీనిని తీసుకెళ్ళి సెలైన్‌ బాటిల్‌కు గుచ్చాలి. ఇలా వరసగా తళుకులు, గుండు పిన్నీసులతో సహా గుచ్చాలి. ఒక వరస తర్వాత మరో వరస, ఇలా ప్లాస్టిక్‌ బాటిల్‌ మొత్తం గుచ్చాలి. వరసలుగా గుచ్చితే అన్నీ ఒకే రకంగా సమానమైన దూరంలో ఉండి చక్కగా కనిపిస్తాయి. దీన్ని మొదటగా కత్తిరించి పెట్టుకున్న తామర పువ్వులో ఉంచి అతికించాలి. తళుకులు అతికించిన బాటిల్‌ మూతిభాగం కత్తిరించాం కాబట్టి ఆ ఖాళీ నుంచి పువ్వులు పెట్టుకోవచ్చు. ముద్ద మందారాన్ని ఇందులో పెట్టాను. ముద్దుగా ఫ్లవర్‌వేజ్‌ తయారయింది.
శంఖుపూల కాయలతో
రెండేండ్ల కిందట ఇంట్లో ఒక శంఖుపూల చెట్టును నాటాను. విపరీతంగా పూలు పూసింది. కాయలేసి విత్తనాలు వెదజల్లి ఉన్న వంద కుండీలలోనూ దాని చెట్లే మొలిపించింది. కుండీలో ఏ చెట్టున్నా సరే పక్న ఈ శంఖుపూల చెట్టు మొలిచేసింది. ఇలా చెట్లు పూలు, కాయలు తెగ కాసినవి. అందుకే వీటితో ఏమైనా బొమ్మ చేయాలని అనుకున్నదే తడవుగా ఆలోచన వచ్చింది. ఈ కాయలు కొద్దిగా ఎండాయంటే చాలు, చిటుక్కుమని పగిలి విత్తనాలు అక్కడొకటి ఇక్కడొకటి పడుతుంటాయి. ఇలా కాయలన్నీ కోసుకొచ్చి ఒక ఇల్లును కట్టాను. ఎండిన కాయలు కాబట్టి గడ్డి రంగులో ఉన్నాయి. అందుకే పూరిగుడిసె కట్టాను. గుడిసెకు చుట్టూ ప్రహరీ గోడను కూడా కట్టాము. ప్రహరీగోడనూ, ఇంటి లోపలి ఖాళీ స్థలంలో రెండు పెద్ద వృక్షాలు నాటాము. సాధారణంగా కొబ్బరి చెట్లు ఉంటాయని వాటిని పెట్టాము. ఇన్ని పెట్టాక ఆకాశం, వెలుగులు పంచే సూరీడు లేకపోతే ఎట్లా అనుకున్నాం. అందుకనే భానుడ్నీ, మేఘాల్నీ పెట్టేశాం. ఇంకేం మొత్తంగా ప్రకృతిలో పరవశించే పల్లెటూరి ఇల్లును చిత్రించాము. ఇంతమంది ఇంటిలో నివాసముండి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించండి.
కాగితపు గుజ్జుతో
మా చిన్నప్పుడు కాగితపు గుజ్జుతో ముగ్గు బుట్టలు తయారు చేసుకునేవాళ్ళు. ఇంకా బియ్యం చెరిగే చేటల్ని అలుక్కునే వాళ్ళు. చేటలు తోలు ఊడిపోయి సందులు ఏర్పడి బియ్యం కింద పోతుంటాయి. అలాంటప్పుడు కాసిని కాగితాలు చించి ముక్కలు చేసి నీళ్ళలో నానబెట్టేవారు. వాటిలో కాసిని మెంతులు కూడా వేసి నానబెట్టాలి. రాత్రంతా నానిన తర్వాత వాటిని రుబ్బుకుంటే గుజ్జు వస్తుంది. దీనితో ఏమైనా బొమ్మలు చేసుకోవచ్చు. సాధారణంగా చేటలు అలకడం, ముగ్గు బుట్టలు అలకడం చేసేవారు. కాస్త సృజనాత్మకత ఉన్నవారు చిలకలను, హంసలను వారికి నచ్చినట్టు చేసుకునేవారు. అది గుర్తుకొచ్చి నేను ఒక కప్పును తయారు చేశాను. ఊరికే కప్పును చేస్తే ఏం బాగుంటుంది. అందుకే ఆ కప్పును మనిషి ముఖంలా తీర్చిదిద్దాను. కళ్ళు, ముక్కు, నోరు అన్నీ పెట్టి ఒక పల్లెటూరి రైతులా చిత్రించాను. దీనిని వారం రోజుల పాటు ఎండబెట్టి ఆ తర్వాత రంగులు వేశాను. ఎంత బాగుందో చూడండి.
జిల్లేడు ఆకులతో
''కెలోట్రాపిస్‌ జైగాన్షియా'' అనే శాస్త్రీయ నామం గల ఈ జిల్లేడు మొక్క గురించి సైన్స్‌ పాఠంలో చదివే ఉంటారు. ఇంటర్‌ బైపీసీ విద్యార్థులయితే డిసెక్షన్‌లు కూడా చేసే ఉంటారు. అపోసైనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆయుర్వేద వైద్యంలో కూడా ప్రసిద్ధి చెందినది. అంతేకాక వినాయక చవితి పండుగ రోజు సమర్పించే 21 రకాల పత్రిలో ఈ జిల్లేడు కూడా ఒకటి. ఈ ఆకుల్ని చెట్టునుండి తెంపితే పాలు వంటి పదార్థం కారుతుంది. వీటిలో మూడు రకాల జిల్లేళ్ళు ఉంటాయి. తెల్లజిల్లేడు, ఎర్రజిల్లేడు, రాజు జిల్లేడు అని మూడు రకాలు. ఈ చెట్టును చూడగానే ఏదో ఒకటి చేద్దామనిపించింది. లోపలున్న సైన్స్‌ విద్యార్థి ఊరుకోక ఈ ఆకులు కోసుకొచ్చి చిన్న చెట్టులా అమర్చాను. బెండ లాంటి ఆర్నమెంటల్‌ చెట్టు నుండి ఒక ఆకును తెంపి దానికి పువ్వులా అమర్చాను.
ఫ్లాట్‌ స్కెచ్‌ పెన్నుతో
వెడల్పుగా ఉండే ముక్కుగల పెన్నుతో బొమ్మను గీశాను. బొమ్మను గీస్తే ప్రత్యేకత ఏముంది. అందుకే దాని స్పెల్లింగ్‌ను ఇంగ్లీషులో రాసి ఆ జంతువు ఆకారాన్ని తీసుకువచ్చాను. ఫొటో చూడండి. కంగారూ అన్న బొమ్మను. ఆ బొమ్మలో 'కంగారూ' అనే ఇంగ్లీషు పేరు కనిపిస్తుంది. చాలా సరదాగా ఉంది కదూ! ఆ బొమ్మ కింద నేను తయారుచేసిన కంగారూ పొడుపుకథను కూడా రాశాను. ఇలా సరదాగా ఇలాంటి స్కెచ్‌ పెన్నులతో రకరకాల జంతువుల్ని సృష్టించాను. మీకు మరి కొన్ని మరల చూపిస్తాను. వీటికింకా పేరు పెట్టలేదు. ఏం పేరు పెడితే బాగుంటుందో ఆలోచించండి.

- డా|| కందేపి రాణీప్రసాద్‌

పాత వస్తువులతో పసందుగా

MORE STORIES FROM THE SECTION

manavi

గృహాలంకరణ

అందమైన ఆకృతులను సృష్టిద్దాం

02-04-2021

కరోనా మళ్ళీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. గతనాలుగు నెలలుగా కొద్దిగా తగ్గు ముఖం పట్టిందనుకున్నాం. అందరం వ్యాక్సిన్లు వేయించుకునే

manavi

గృహాలంకరణ

పారవేసే వస్తువులకు ముస్తాబులు

26-03-2021

కొవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు రెండూ దేశీయ సంస్థలతో రూపొందబడటం భారతదేశానికే గర్వకారణం. అందరూ టీకాలు తీసుకునేదాకా జాగ్రత్తగా

manavi

గృహాలంకరణ

పాతవస్తువులతో కళకళలాడేలా...

05-03-2021

సోమవారం నుండి అంటే మార్చి ఒకటో తేదీ నుండి మూడో దశ వ్యాక్సిన్ల పంపిణీ మొదలయ్యింది. కోవిడ్‌ యాప్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికే