వన్యప్రాణుల వెలుగు దివిటీ | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

వన్యప్రాణుల వెలుగు దివిటీ

మహారాష్ట్రలోని పన్వెల్‌ కు చెందిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌ 23 ఏండ్ల ఐశ్వర్య శ్రీధర్‌... వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ పోటీలలో పాల్గొని 'అత్యంత ప్రశంసలు పొంది' అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఫొటోగ్రఫీని ఎంతగానో ప్రేమించే ఈమె అడవుల్లో తిరుగుతూ అరుదైన అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించింది. నేషనల్‌ హిస్టరీ మ్యూజియం వారు నిర్వహించిన పోటీకి పంపింది. జడ్జీల ప్రశంసలు పొంది 'వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2020' విజేతగా నిలిచింది.

''బిహేవియర్‌: ఇన్‌వెర్టిబ్రేట్స్‌'' ఇదీ 'నేచురల్‌ హిస్టరీ మ్యూజియం' ఈ ఏడాది ఇచ్చిన ఫొటోగ్రఫీ థీమ్‌. భూమి మీద గానీ, గాలిలో గానీ, నీటి మీద గానీ కనిపించే వెన్నెముక ఉండని ప్రాణుల నడవడికను ఫొటోలో బంధించాలి. పన్నెండేండ్ల వయసు నుంచి అరణ్యాలను చూస్తోంది ఐశ్వర్య. అందుకే థీమ్‌ వినగానే ఎంతో ఆసక్తి కలిగింది ఈమెకు. ఈ పోటీ కోసం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని భందర్దరా అడువుల్లోకి రాత్రిపూట వెళ్లి అక్కడి మిణుగురులను ఎంపిక చేసుకుంది. అవి ఒక చెట్టు నిండా ఉన్నాయి. చెట్టు చుట్టూ తిరుగుతు న్నాయి. ఫ్రేమ్‌లోకి చెట్టును, మిణుగురులను తీసుకుంది. వాటితో పాటు నక్షత్రాలు, ఆకాశంపై కూడా దృష్టి పెట్టింది. అదొక అందమైన పాలపుంత అయింది. దీనికి 'లైట్స్‌ ఆఫ్‌ ప్యాషన్‌' అని పేరు పెట్టి పోటీకి పంపించింది.
కల నిజమైంది
ఈ పోటీలకు 80కి పైగా దేశాల నుండి 49,000 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 100 ఛాయాచిత్రాలు మాత్రమే అవార్డులు ఎంపిక చేస్తారు. ''అక్టోబర్‌ 13 రాత్రి వర్చువల్‌ అవార్డుల కార్యక్రమంలో నా పేరు ప్రకటించారు. ఇప్పుడు నా కల నిజమైంది'' అని ముంబై మిర్రర్‌తో తన ఆనందాన్ని పంచుకుంది ఐశ్వర్య. తను తీసిన ఫొటోగ్రఫీ వెనుక ఉన్న కథను వివరిస్తూ ''గత సంవత్సరం ఒక ట్రెక్‌ చేసే సమయంలో నా కెమెరాలో తుమ్మెదలు క్లిక్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అప్పుడు అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నేను అనుకున్న చిత్రాన్ని తీయగలిగాను'' అంటుంది.
ఏకైక మహిళగా...
ఈ ఫొటోగ్రఫీ పోటీలలో ఐశ్వర్యకు వచ్చిన అవార్డుతో ఆమె ప్రతిభకు మరింత ఆధరణ లభించింది. వైల్డ్‌ ఫొటోగ్రఫీలో తన ప్రతిభను చాటుకుంది. ట్రోఫీతో పాటు పదివేల పౌండ్ల ఫ్రైజ్‌ మనీ గెలుచుకుంది. లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియం నుంచి చిన్న గుర్తింపును పొందాలని ఐశ్వర్య లాంటి ఫొటోగ్రాఫర్లు ఎందరో కలలు కంటూ ఉంటారు. అలాంటిది 23 ఏండ్ల వయసులోనే ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక మహిళగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది ఐశ్వర్య. వాస్తవానికి ఈ పోటీ ఎంతో కష్టతరంగా ఉంటుంది. చివరకు థీమ్‌ ఇచ్చే వారికి కూడా థీమ్‌కు సంబంధించిన ఫొటో ఎలా తీయాలో అవగాహన ఉండదు. అలాంటిది అంత చిన్న వయసులో ఐశ్వర్య థీమ్‌కు సెట్‌ అయ్యే ఫొటోని తన కెమెరాలో బంధించడంతో జడ్జిలు అవుట్‌స్టాండింగ్‌ అన్నారు. అంతే లండన్‌ నుంచి జరిగిన వర్చువల్‌గా జరిగిన వేడుకల్లో విజేతగా నిలిచింది.
ప్రత్యేకతను చాటుకోవాలని
చిన్నతనం నుండి అడవులతో పరిచయం ఉన్న ఐశ్వర్య ఇప్పటికే అడవుల మీద కొన్ని డాక్యుమెంటరీలు తీసింది. తన తండ్రి ఆమె చేతికి మొదటిసారి కెమెరా ఇచ్చినప్పుడు అడవి ప్రాంతాలతో పాటు, సూర్యుడు, నక్షత్రాలతో పాటు ప్రతీది క్లిక్‌ చేయడం ప్రారంభించింది. అప్పుడే ఆమె వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌ కావాలని నిర్ణయించుకుంది. తన ఫొటోగ్రఫీతో ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంది. ఐశ్వర్య ఫొటోగ్రాఫీలో ఎన్నో విజయాలు సాధించింది. 14 ఏండ్ల వయసులోనే 'ఆసియా యంగ్‌ నేచురలిస్ట్‌ అభయారణ్య' అవార్డును గెలుచుకుంది. గత ఏడాది ప్రిన్సెస్‌ డయానా అవార్డును కూడా అందుకుంది. యువప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఇచ్చే అవార్డు ఇది.
విధానంలో మార్పు తీసురావాలి
వాస్తవానికి నేను భారత అటవీ శాఖలో చేరి సేవలు చేయాలని, వన్యప్రాణులు వాటి పరిరక్షణా విధానంలో మార్పు తీసుకురావాలని అనుకున్నాను. అయితే ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరిగేకొద్దీ నేటి టెక్నాలజీని ఉపయోగించి ఫొటోగ్రఫీలో వైవిధ్యాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాను'' అంటున్నారు ఐశ్వర్య. అరుదైన పురస్కారానికి ఎంపికైన ఈమె తను చేయవలసిన ఎన్నో కార్యక్రమాలను రూపొందించుకుంది. దేశంలో అంతరించిపోతున్న ప్రైమేట్లపై సినిమా చేయాలనుకుంటుంది. ఇప్పటికే మలై టైగర్‌ రిజర్వ్‌ వద్ద కొంత భాగాన్ని షూట్‌ చేసింది. కోవిడ్‌ మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాను పూర్తి చేస్తుంది. ఐశ్వర్య కృషి వెనుక తన తల్లి రాణి ప్రోత్సాహం ఎంతో ఉంది.
డాక్యుమెంటరీలు...
కేవలం ఫొటోగ్రఫీ మాత్రమే కాదు ఐశ్వర్య ఓ రచయిత, డాక్యుమెంటరీ మేకర్‌. ప్రస్తుతం ఓ డాక్యుమెంటరీ తయారీలో ఉంది. న్యూ ముంబైలోని పంజేలోని చిత్తడి నేలలు సంరక్షించడంపై ఆమె తన మొట్టమొదటి డాక్యుమెంటరీ 'పాన్జే ది లాస్ట్‌ వెట్‌ ల్యాండ్‌' తీసింది. ఇది డిడి నేషనల్‌లో ప్రసారం చేయబడింది. న్యూయార్క్‌లో జరిగిన తొమ్మిదవ ఫిలిం ఫెస్టివల్‌ కోసం 'క్వీన్‌ ఆఫ్‌ తారు' పేరుతో రాయల్‌ బెంగాల్‌ టైగైర్‌పై మరో డాక్యుమెంటరీ తీసింది. ఈమె తీసిన చిత్రాలు బిబిసి వైల్డ్‌లైఫ్‌, మొంగాబే, గార్డియన్‌, ఆసియా అభయారణ్యం, హిందుస్తాన్‌ టైమ్స్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అలాగే టెడెక్స్‌ అనే దానికి స్పీకర్‌గా, గ్లోబల్‌ గుడ్విల్‌ అంబాసిడర్‌గా ఉంది.

వన్యప్రాణుల వెలుగు దివిటీ

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

ఆమె ఓ నిప్పు కణిక

30-10-2020

దేశ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మహిళా మణిపూసలు ఎందరో బయటకు వస్తారు. స్త్రీ కేవలం ఇంటికే పరిమితమైన రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నవారు