వివక్ష లేని సమాజానికై అక్షరసమరం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

వివక్ష లేని సమాజానికై అక్షరసమరం

రోజురోజుకు మహిళలపై హింస పెరిగిపోతోంది. అందులోనూ దళిత మహిళలపై ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుకోవాలంటే లింగ, కుల వివక్ష, అస్థిత్వ రాజకీయాల గురించి కచ్చితంగా చర్చించి తీరాల్సిన సమయం ఇది. ఎందుకంటే కులతత్వంతో పాటు రాజకీయాల ప్రభావం దళిత మహిళలపై తీవ్రంగా ఉంది. ఇటీవల జరిగిన హత్రాస్‌ సంఘటన దీనికి ఓ ఉదాహరణ. ఈ విషయాలనే ఐదుగురు రచయిత్రులు తమ రచనల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. వారి గురించి ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...
దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. జీవన ప్రమాణాలలో పెరుగుదల ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన రాజ్యాంగంలో పొందుపరచబడినట్టు 'అందరికీ సమానత్వం, దాన్ని ఆచరించడం' అనేది ఈనాటి విషయం కాదు. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో దళితులను సమానంగా చూడరు. అసలు వారిని మనుషులుగానే గుర్తించరు. పురాతన గ్రంథాలను అనుసరించి సమాజంలో వారు పోషించాల్సిన సాంప్రదాయ పాత్రలతో ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఇటీవల 19 ఏండ్ల దళిత బాలికపై నలుగురు అగ్రకుల వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడితే సాక్ష్యాలను తారుమారుచేశారు. ఆమె మృతదేహాన్ని కుటుంబం అనుమతి లేకుండానే పోలీసులు దహనం చేశారు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. దేశంలో జరుగుతున్న ఇటువంటి భయానక పరిస్థితులు దళితు లను మరింత అభద్రతా భావంలోకి నెట్టి వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంఘటనతో భారతదేశంలో మహిళలకు గౌరవం లేదని, వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వివక్షలేని ఓ మెరుగైన ప్రపంచం రావాల్సిన అవసరాన్ని తమ రచనల ద్వారా తెలియజేశారు ఈ ఐదుగురు రచయిత్రులు.
బామా
సాహిత్య ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు బామా ఫౌస్టినా సూసైరాజ్‌. ఈమె జయ కాంతన్‌, అఖి లాన్‌, మణి, పార్థసార్తి వంటి ప్రముఖ తమిళ రచయితల నుండి ప్రారంభంలోనే ప్రశంసలు పొందిన స్త్రీవాద రచయిత్రి. ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసే ఈమె అక్కడ దళిత పిల్లల పట్ల అగ్రకులస్తులు దురుసుగా ప్రవర్తించడం తీవ్రంగా కలచివేసింది. ఆ బాధాకర సంఘటనలే ఈమెను రాయడానికి ప్రోత్సహించాయి. 1958లో జన్మించిన ఈమె 1992లో 'కరుక్కు' అనే మొదటి పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం 2000లో క్రాస్వర్డ్‌ బుక్‌ అవార్డును గెలుచుకుంది. అలాగే 'సంగతి' (2005), 'హరం-స్కార్మ్‌ సార్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌ (2006), వెండెట్టా (2008)లో ఈమె రచనలు. బామా ఆలోచనలు నిత్యం సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, లింగ వివక్షపై కేంద్రీకృతమై ఉంటాయి. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే తన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం తన రచనలే అని బలంగా నమ్మిన వ్యక్తి ఈమె. రచయితగానే కాక ఓ సామాజిక కార్యకర్తగా పని చేసే ఈమె అప్పు చేసి మరీ తమిళనాడులో దళిత పిల్లల కోసం ఓ పాఠశాల స్థాపించారు. కుల, లింగ వివక్షపై విశేష కృషి చేసిన ఈమె ఏప్రిల్‌ 21, 2012న కన్నుమూశారు.
బాబితాయి కాంబ్లే
బాబీతాయి కాంబ్లే అమ్మమ్మా తాతయ్యల దగ్గర పెరిగారు. దళిత కులానికి చెందిన మహర్‌ కమ్యూనిటీకి చెందిన వాతారణంలో ఈమె చిన్నతనం గడిచింది. ఇక్కడ ఎక్కువ మంది పేదరికం లో నివసించారు. అత్యంత చిన్నతనంలోనే ఓ దుకాణ యజమానితో ఈమె వివాహం జరిగింది. ఆ దుకాణంలో బాబితాయి పని చేస్తుండేది. కిరాణా సామాగ్రిని చుట్టే వార్తాపత్రికల ద్వారా చదవడం నేర్చుకున్నారు ఈమె. అదే ఈమెను సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసింది. ఓ దళిత మహిళగా ఉన్న బాబీతాయి తన స్వీయ అనుభవాలతో పాటు లింగ వివక్ష గురించి, తక్కువ కులం కారణంగా సమాజంలో చాలా మంది ఎదుర్కొన్న దోపిడీ గురించి రాయడం ప్రారంభించారు. ఆమె సమకాలీనులు అనేక మంది మగ దళిత రచయితలు ఉన్నప్పటికీ ఈ దృక్పథాన్ని బయటకు తీసుకువచ్చిన రచయితలలో ఆమె ఒకరు. అయితే 20 సంవత్సరాల పాటు తన భర్తకుగానీ, కుటుంబ సభ్యులకు తెలియకుండా అత్యంత రహస్యంగా ఆమె తన రచనలు చేసేది. ఎంతో మంది పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వారిని పెంచడం కోసం మెహర్‌లోని మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె తన రచనల్లో తెలియజేశారు. ఈమెపై బిఆర్‌ అంబేద్కర్‌ ప్రభావం ఎంతగానే ఉన్నదని చెప్పాలి.
కుముద్‌ పావాడే
ఆమె 1938లో మహర్‌ దళిత కుటుంబంలో జన్మించారు. ఉన్నత కులంలో పుటిన్ట స్వాతంత్య్ర సమరయోధుడు, అంబేద్కరైట్‌ అయినటువంటి మోతీరామ్‌ పావాడేలను ఈమె వివాహం చేసుకున్నారు. చిన్నతనంలో పాఠశాలలో చదివేటప్పుడు తనతో పాటు చదువుకునే పిల్లలు, ఉపాధ్యాయులు ఈమెను కొట్టేవారు. ఎగతాళి చేసేవారు. అయినప్పటికీ తన తరగతిలో ఇప్పుడూ ఈమె అగ్రస్థానంలో ఉండేవారు. తక్కువ కులానికి చెందినదని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఆమెకు ఉపాధ్యాయురాలిగా అవకాశం ఇవ్వలేదు. ఒక దళిత ఉపాధ్యాయురాలిని పాఠశాలలో చేర్చుకుంటే అగ్రకుల విద్యార్థులను కోల్పోవల్సి వస్తుందని వారి భావన. ఈ విషయంపై ఆమె అప్పటి ప్రధాన మంత్రి ఆమె పిఎం జవహర్‌లాల్‌ నెహ్రూను కలిస్తే ఆయన 250 రూపాయలు ఇచ్చి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌ను కలవాలని సలహా ఇచ్చారు. సంస్కృతం బోధించే ఆమెకు ఉపాధ్యాయురాలిగా ముఖ్యమంత్రి పెద్దగా సహాయం చేయలేదు. పైగా పైచదువులను కొనసాగించాలని సలహా ఇవ్వడంతో ఆమె ప్రయత్నం చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా అయింది. అటువంటి సమయంలోనే తన పరిసరాల్లోని నిరుపేద పిల్లలకు పాఠాలు నేర్పించే మోతీరామ్‌తో పరిచయం, వివాహంతో ఆమె జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటిపేరు మారడంతో చాలా అవకాశాలు వచ్చాయి. అమరావతిలోని ప్రభుత్వ కళాశాలలో ఎన్నో ఏండ్లు ఉపాధ్యాయురాలిగా పని చేశారు. సంస్కృత విభాగానికి హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరించారు. తర్వాత ఈమెను నాగ్‌పూర్‌ మహావిద్యాలయానికి పండిట్‌గా నియమించారు. ఈమె పుస్తకం ఆంథాస్పాట్‌/ థాట్ఫుల్‌ అవుట్‌బర్స్ట్‌ (1981)లో లింగ, కుల వివక్ష కారణంగా దళిత మహిళలు ఎదుర్కొంటున్న దోపిడీని ప్రధాన వస్తువుగా తీసుకున్నారు.
సుజాత గిడ్లా
'అంటరానివారి'గా సమాజం భావించే దళిత కుటుంబంలో జన్మించిన సుజాతా గిడ్లా... 1990లో 26 సంవత్సరాల వయసులో న్యూయార్క్‌ వెళ్ళారు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని ఓ దళిత సమాజంలో పెరిగారు. చిన్నతనం నుండే ఈమె కుల వివక్షను అస్సలు భరించేవారు కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా వివక్షను ప్రతిఘటించేవారు. వరంగల్‌లోని రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎంఎస్సి ఫిజిక్స్‌ రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన దీనికి చక్కని ఉదాహరణ. తక్కువ కులం విద్యార్థులపై ఉన్నత కుల ప్రొఫెసర్‌ చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా అప్పట్లో జరిగిన సమ్మెలో పాల్గొన్న ఏకైక మహిళ ఈమె. ఆమె క్షయవ్యాధికి గురయ్యారు. మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆమె రచించిన 'యాంట్స్‌ అమాంగ్‌ ఎలిఫెంట్స్‌: యాన్‌ అన్‌టొచబుల్‌ ఫ్యామిలీ అండ్‌ ది మేకింగ్‌ ఆఫ్‌ మోడరన్‌ ఇండియా' అనే పుస్తకం ద్వారా పేదరికం వల్ల తన కమ్యూనిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకున్నారు.
యెషికా దత్‌
2016 జనవరిలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులవివక్ష వల్ల సమాజంలో జరుగుతున్న దారుణాల గురించి తీవ్ర చర్చలకు దారితీసింది. రోహిత్‌ మరణించిన మూడు రోజుల తర్వాత న్యూయార్క్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న యెషికా దత్‌ ఫేస్బుక్‌ ద్వారా ఒక దళిత మహిళగా కుల సమస్యను తెరపైకి తీసుకువచ్చారు. ఆమె 'కమింగ్‌ అవుట్‌ దళిత్‌: ఎ మెమోయిర్‌' ద్వారా ఒక దళిత మహిళగా తన అనుభవాలను, తన గుర్తింపును దాచడానికి ఏర్పడ్డ పరిస్థితుల గురించి వివరించారు. అప్పటి నుండి రచయితగానే కాక ఓ సమాజిక కార్యకర్తగా కులం పేరుతో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా సమానత్వం కోసం తన స్వరం కలిపారు. అలాగే ఆమె దళితులపై చూపుతున్న వివక్షను ప్రపంచానికి తెలియజేసేందుకు ఓ బ్లాగును కూడా ప్రారంభించారు. ఈ బ్లాగ్‌ ద్వారా దళితులు ఎలాంటి పరిమితులు లేకుండా తమ అనుభవాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు.

వివక్ష లేని సమాజానికై అక్షరసమరం

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

ఆమె ఓ నిప్పు కణిక

30-10-2020

దేశ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మహిళా మణిపూసలు ఎందరో బయటకు వస్తారు. స్త్రీ కేవలం ఇంటికే పరిమితమైన రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నవారు