చైతన్యం రావాలంటే చదువే మార్గం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

చైతన్యం రావాలంటే చదువే మార్గం

ఇంగ్లీషు మోజులో పడి అందరూ తెలుగు మర్చిపోతున్న కాలమిది. చదువంటే ఇంజనీరింగ్‌, మెడిసెన్‌ మాత్రమే అనుకుంటున్న రోజులివి. అలాంటిది ఓ ముస్లిం యువతి తెలుగు సాహిత్యంలో రాణించేందుకు ఆసక్తి చూపిస్తోంది. మాతృభాష ఉర్దూ అయినా తేనెలూరే తెలుగు భాషపై మక్కువ పెంచుకుని తెలుగు లిటరేచర్‌ను తన సబ్జెక్ట్‌గా ఎంచుకుంది. అంతేనా కేవలం మూడేండ్లలోనే 'తెలంగాణ రచయిత్రులు ఓ పరిశోధన' అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేసింది. అంత తక్కువ కాలంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన మొట్టమొదటి ముస్లిం యువతిగా తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఆమే సయ్యద్‌ ఆఫ్రీన్‌ బేగం...
ఆఫ్రీన్‌ సొంత ఊరు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడు. తల్లి రిహానా బేగం, గృహిణి. తండ్రి సయ్యద్‌ అబ్దుల్‌ లతీఫ్‌. వీరికి నలుగురు పిల్లలు. ఆఫ్రీన్‌ వీరికి రెండో సంతానం. ఒకటో తరగతి నుండి ఇంటర్‌ వరకు ఆఫ్రీన్‌ బాన్సువాడలోనే చదువుకుంది. అప్పటి వరకు ఆమె చదివింది ఇంగ్లీష్‌ మీడియంలో. మొదట డాక్టర్‌ కావాలనే కోరికతో ఇంటర్‌లో బైపీసీ తీసుకుంది. అందులో 91 శాతం మార్కులు సాధించింది.
తెలుగు భాషపై మక్కువతో
డిగ్రీకి వచ్చే సరికి ఆమె ఆలోచన మారిపోయింది. దానికి కారణం తండ్రి. లతీఫ్‌ మొదటి నుండి తెలుగు దినపత్రికలో విలేకరిగా పని చేసేవారు. దాంతో ఇంటికి తెలుగు పత్రికలు వస్తుండేవి. ఆఫ్రీన్‌ చిన్నప్పటి నుండే ప్రతిరోజూ ఆ పత్రికలను కచ్చితంగా చదువుతుండేది. పాఠశాలలో కూడా న్యూస్‌ ఈమెతోనే చదివించేవారు. దాంతో తెలుగు భాషపై మక్కువ కలిగింది. అలాగే తెలుగు సాహిత్యం పట్ల కూడా ఆసక్తి పెరిగింది. కథలు, నవలలు చదవుతుండేది. దాంతో తెలుగుపై అభిమానం మరింతగా పెరిగింది. అలాగే ఈమె తెలుగు ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే ముస్లింలకు తెలుగు రాయడం, మాట్లాడడం రాదు అనే అభిప్రాయం చాలామందికి ఉండేది. ఆ అభిప్రాయం సరైనది కాదు అని నిరూపించాలనే ఆలోచన కూడా ఆమెలో కలిగింది. చివరకు తెలుగు భాషపై ఉన్న అభిమానంతో బాన్సువాడలోనే బీఏ తెలుగు లిటరేచర్‌ తీసుకుంది.
వందకు వంద మార్కులతో
'బైపీసీ తర్వాత బీఏ ఏంటి మెడిసెన్‌ చేయొచ్చు కదా' అని కొందరు అన్నారు. అయితే ఆఫ్రీన్‌ మాత్రం తండ్రి ప్రోత్సాహంతో బీఏలోనే చేరింది. అంతే కాదు తెలుగులోనే పీహెచ్‌డీ పూర్తి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. డిగ్రీలో మూడు సంవత్సరాలు వందకు వంద మార్కులు తెచ్చుకుంది. తెలుగులో వందకు వంద మార్కులు రావడం అనేది అప్పటి వరకు జరగలేదు. అప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో రికార్డు సృష్టించింది. డిగ్రీలో కాలేజ్‌ టాపర్‌గా నిలిచి సన్మానం కూడా పొందింది. 2013లో తెలంగాణ యూనివర్సిటీలో ఎమ్మె తెలుగులో చేరింది. అయితే డిగ్రీ సునాయాసంగా పూర్తి చేసిన ఆఫ్రీన్‌కు పీజీ కాస్త కష్టంగా అనిపించింది. ముఖ్యంగా పద్యాలు, ప్రాచీన సాహిత్య చరిత్ర చదివేటప్పుడు కాస్త కష్టంగా అనిపించింది. అయితే తెలుగు భాష పట్ల ఆమెకున్న అభిమానాన్ని గుర్తించిన ప్రొఫెసర్లు ఎంతో సహకరించారు. వారి ప్రోత్సాహంతో తెలుగు సులభంగా ఎలా చదవాలి అనే మెలకువలు నేర్చుకుంది. అలా ముస్లింలు తెలుగు చదవలేరు అనే అపోహను తొలగించడంలో బీజం వేసింది. పీజీ తెలుగు డిపార్ట్‌మెంట్‌లో అలాగే యూనివర్సిటీ కూడా టాపర్‌గా నిలిచింది. గోల్డ్‌ మెడల్‌ కూడా అనౌన్స్‌ చేశారు.
పురస్కారాలు
తెలుగు సాహిత్యంపై ఆఫ్రీన్‌ రాసిన వ్యాసాలను పరిశీలించి విజయవాడకు చెందిన మానవ సాహిత్య సాంస్కృతిక అకాడమి వారు ఈమెకు 'గురజాడ పురస్కారం' అందజేశారు. అలాగే 2014 మార్చిలో విశాఖ పట్టణంలో 'ఏపీ స్టేట్‌ కల్చరల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ వారు నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర స్థాయి ఎడ్యుకేషన్‌ మెరిట్‌ అవార్డుల్లో ఈమెకు మొదటి స్థానం దక్కింది.
మూడేండ్లలోపే పీహెచ్‌డీ
2016లో టీఎస్‌సెట్‌, పీహెచ్‌డి ఎంట్రన్స్‌, నెట్‌ వరసగా రాసి క్వాలిఫై అయ్యింది. 'తెలంగాణ నవలా రచయిత్రులు ఒక పరిశీలన' అనే అంశంపై తెలంగాణ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్‌ కనకయ్య వద్ద పీహెచ్‌డీ కోసం చేరింది. సాధారణంగా అయితే పీహెచ్‌డి మూడు నుండి ఐదేండ్లలోపు పూర్తి చేస్తారు. అయితే ఆఫ్రీన్‌ మూడేండ్లలోనే తన పరిశోధనా గ్రంథాన్ని పూర్తి చేసి తెలుగు భాషలో అతి తక్కువ సమయంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన మొట్టమొదటి ముస్లిం యువతిగా రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది.
చదువుకే ప్రాధాన్యం
మూడేండ్లలో పీహెచ్‌డీ పూర్తి చేశానంటే దానికి కారణం నా గైడ్‌ ప్రొఫెసర్‌ కనకయ్య సార్‌ ఇచ్చిన సహకారమే. అలాగే మా నాన్న, కుటుంబ సభ్యులు కూడా చాలా సపోర్ట్‌ చేశారు. 'ఆడపిల్లలకు ఇంకా పెండ్లి చేయకుండా చదివిస్తున్నారేంటీ' అంటూ కొంత మంది ప్రశ్నించేవారు. అయినా కూడా మా అమ్మా, నాన్న నా చదువుకే ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నప్పటి నుండి అమ్మాయి అబ్బాయి అనే వివక్ష లేకుండా పెంచారు. అంతేకాదు మన' ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లలకు నువ్వు ఆదర్శం కావాలి' అని నాన్న ఎప్పుడూ నాతో అంటుండేవారు.
తెలుగు సాహిత్యంలోనే...
ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన బిక్నూర్‌ క్యాంపస్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా చేస్తున్నా. ప్రొఫెసర్‌గా స్థిరపడాలనుకుంటున్నాను. అలాగే తెలుగు సాహిత్యంలో రాణించాలని, భాషాభివృద్ధికి నా వంతు సేవ చేయాలని భావిస్తున్నాను. నా పరిశోధనా అంశాన్ని త్వరలో పుస్తకంగా తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో ముద్రించబడ్డాయి. వాటిని కూడా ఓ పుస్తకంగా తీసుకురావాలి.
అవగాహన పెంచాలి
నేటి సమాజంలో అమ్మాయిలు స్వతంత్య్రంగా బతకడం చాలా అవసరం. అలా బతకాలంటే చదవు ఒక ఆయుధంగా పని చేస్తుంది. ప్రతి వ్యక్తికీ విద్య ఓ గుర్తింపు తెచ్చిపెడుతుంది. అభ్యుదయంగా ఆలోచించాలన్నా, అమ్మాయిల్లో చైతన్యం రావాలంటే చదువుకోవడమే మార్గం. సాధారణంగా అమ్మాయిలను పై చదువులు చదివించడానికి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపించరు. పెండ్లి చేసి పంపించాలనే అనుకుంటారు. ఇక మా ముస్లిం కుటుంబాల్లో అయితే ఇలాంటి ఆలోచనలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలే దీనికి కారణం. ప్రభుత్వాలు మరిన్ని అవకాశాలు కల్పించాలి. చదువు వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయాలి. ముస్లింలలో అవగాహన పెంచాలి.

చైతన్యం రావాలంటే చదువే మార్గం

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి

17-02-2021

ది లాస్ట్‌ క్వీన్‌ మహారాణి జిందన్‌ కౌర్‌.. ఆ కాలంలోనే సంప్రదాయాన్ని ధిక్కరించి ప్యాలెస్‌ వెలుపల అడుగుపెట్టింది. తన ముసుగును పక్కన పెట్టి బ్రిటిష్‌ వారు పంజాబ్‌ను స్వాధీనం

manavi

ముఖాముఖి

మరో మహిళకు కీలక బాధ్యతలు

27-01-2021

అమెరికా పరిపాలనా వ్యవహారాలో భారత సంతతికి చెందిన మరో మహిళ అవకాశం దక్కించింది. అది కూడా కీలకమైన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు చేపట్టింది. ఆమే సమీరా ఫజిలి. అమెరికా పరిపాలనా విభాగంలో ఈ

manavi

ముఖాముఖి

ఆమెకు అరుదైన గౌరవం

26-01-2021

భారత దేశంలోనే మొదటి మహిళా ఫైటర్‌ పైలెట్‌గా చరిత్ర సృష్టించింది. గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా నారీశక్తి పురస్కారాన్ని అందుకుంది. మరి ఇప్పుడు... 1950 నుండి ఇప్పటి వరకు జరిగన గణతంత్ర వేడుకల్లో ఏ మహిళకూ

manavi

ముఖాముఖి

రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ

20-01-2021

హిమా కోహ్లీ... కొన్ని రోజులుగా ఈ పేరు దేశమంతా మారు మోగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులై చరిత్ర సృష్టించడం ఓ విశేషమైతే. ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో ఈమే

manavi

ముఖాముఖి

కష్టాలకు కుంగిపోకుండా...

19-01-2021

మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వైఫల్యాలతో కుంగిపోకుండా తమ శక్తి సామర్థ్యాలను సమాజానికి చాటి చెబుతున్నారు. ఆ కోవలోకే వస్తుంది ఇలవరసి జయకాంత్‌. ఓ దోపిడిలో సర్వం కోల్పోయిన ఈమె తన సంకల్పంతో

manavi

ముఖాముఖి

మగవారికి ధీటుగా పని చేస్తా

17-01-2021

బబ్బురి శిరీష... పల్లెటూరులో పుట్టి పెరిగి కడు పేదరికంలో జీవించింది. అక్షరాలను నేర్చుకొని ఐటీఐ పాసైంది. రాష్ట్రంలో ఇంతవరకు మహిళలు చేయని లైన్‌ ఉమెన్‌ ఉద్యోగానికి రాష్ట్రంలో తొలిసారిగా ఎంపికై ఎంతో మంది ఆడపడుచులకు

manavi

ముఖాముఖి

కంటెంట్‌ సృష్టికర్త నిహారిక

06-01-2021

ఇరవై మూడేండ్ల నిహారిక ఎన్‌ఎమ్‌... లాక్‌డౌన్‌ సమయంలో ఒంటరిగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ సమయంలోనే యూట్యూబ్‌.. సోషల్‌ మీడియా ద్వారా ప్రభావితమైంది. యూట్యూబ్‌ కంటెంట్‌ సృష్టికర్తగా మారిపోయింది.

manavi

ముఖాముఖి

సేవలోనూ ఆమెకు లేరు సాటి

29-12-2020

2020... ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. కరోనా మహమ్మారి ప్రజా జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మీకు మేమున్నామంటూ సేవలు చేసిన ధీర వనితలు ఎందరో.