స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిముఖాముఖి

స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి

ది లాస్ట్‌ క్వీన్‌ మహారాణి జిందన్‌ కౌర్‌.. ఆ కాలంలోనే సంప్రదాయాన్ని ధిక్కరించి ప్యాలెస్‌ వెలుపల అడుగుపెట్టింది. తన ముసుగును పక్కన పెట్టి బ్రిటిష్‌ వారు పంజాబ్‌ను స్వాధీనం చేసుకోకుండా ఆపేందుకు తీవ్రంగా పోరాడింది. కన్న కొడుకును కాపాడుకునేందుకు తపించింది. తన కొడుకు దలీప్‌ కేవలం ఆరేండ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె రీజెంట్‌ అయ్యింది. హార్పర్‌ కాలిన్స్‌ ప్రచురించిన లాస్ట్‌ క్వీన్‌... మహారాణి జిందన్‌కు ప్రాణం పోసింది. చరిత్రలో ఎవరికీ తెలియన ఓ రాణి ఈమె. ఎందుకంటే బ్రిటిష్‌ వారు ఈమెను ఓ వేశ్యగా చిత్రీకరించారు. అటువంటి రాణి చరిత్రను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్ర బెనర్జీ దివకరుని తాను రచించిన పుస్తకం గురించి యువర్స్‌ స్టోరీతో పంచుకున్న విశేషాలు మానవి పాఠకుల కోసం...

మహారాణి జిందన్‌ కౌర్‌ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏమిటి?
గతంలో నేను రాసిన నవల 'ది ఫారెస్ట్‌ ఆఫ్‌ ఎన్చాన్మెంట్స్‌' కోసం తిరుగుతున్నప్పుడు అనుకోకుండా మహారాణి జిందన్‌ చిత్రపటాని చూశాను. అప్పుడే ఆమె గురించి విన్నాను. ఆమె వ్యక్తిత్వం నన్ను ఆకర్షించింది. ఆ రోజు నేను చూసిన చిత్రమే ఇప్పటి నా పుస్తకం 'ది లాస్ట్‌ క్వీన్‌' ముఖచిత్రంగా మారింది. ఆమె కోసం వెతుకుతున్నప్పుడు ఆమె ధైర్యం, స్థితిస్థాపకత గురించి తెలుసుకున్నాను. అంతటి భద్రత కలిగిన బ్రిటిష్‌ జైలు నుండి ఎలా తప్పించుకుంది, ఆశ్రయం కోసం నేపాల్‌ వరకు ఎలా నడిచింది.. ఇవన్నీ చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఆమె ఎంతగానో ప్రేమించే కొడుకు మహారాజా దలీప్‌ సింగ్‌ నుండి విడిపోయి ఆమె ఎంతటి వేధనకు గురయిందో విన్నాను. పంజాబ్‌ వంటి గొప్ప రాజ్యాన్ని బ్రిటిష్‌ వారు అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారు. బహిష్కరణకు గురయింది. ఎంతో ధైర్య సాహసాలతో కూడిన విషాదకరమైన ఆమె జీవితం ఇంకా లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించింది. ఇలాంటి స్త్రీల జీవితాలు ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నవల రాయాలని నిర్ణయించుకున్నాను.

పుస్తక పరిశోధన కోసం ఎంత సమయం పట్టింది.. అలాగే మీ అనుభవాలు కూడా మాతో పంచుకుంటారా?
2019లో 'ది ఫారెస్ట్‌ ఆఫ్‌ ఎన్చాన్మెంట్స్‌' వచ్చిన వెంటనే 'ది లాస్ట్‌ క్వీన్‌' పై పరిశోధన ప్రారంభించాను. పరిశోధనకు, రచనకు కలిపి రెండేండ్ల పట్టింది. సాధారణంగా నేను నవల రాయడానికి తీసుకునే సమయం కంటే తక్కువ కాలమే అని చెప్పాలి. ఒక విధంగా పరిశోధన, రచనలపై దృష్టి పెట్టడానికి మహమ్మారి నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది. మహారాణి జిందన్‌ నివసించిన ప్రదేశాలను సందర్శించలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం కోసం ఇంటర్నెట్‌, పుస్తకాలపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. నా ఇంటికే పుస్తకాలు తెప్పించుకున్నాను. గ్రంథాలయాలన్నీ మూసివేయడంతో వెళ్ళలేకపోయాను. ఈ నవల కోసం చారిత్రక ఛాయాచిత్రాలు చాలా ముఖ్యమైనవి. లాహోర్‌ కిలాకు సంబంధించిన చిత్రాలను చూడటం కోసం ఇంటర్నెట్‌లో చాలా కాలం గడిపాను. ఉదాహరణకు ఆమె చాలా ఏండ్లు గడిపిన ప్రదేశం కలకత్తాలోని స్పెన్స్‌ హోటల్‌. అక్కడ ఆమె విడిపోయిన ఎంతో కాలానికి తన కొడుకుతో తిరిగి కలుసుకుంది. రాత్రిపూట ఈ ప్రదేశాల గురించి కలలు కనేదాన్ని. ఎందుకంటే నా రోజులో ఎక్కువ భాగం వాటినే చూస్తూ గడిపేదాన్ని. ఈ కలలు నాకు సన్నివేశాలను మరింత స్పష్టంగా రాయడానికి సహాయపడ్డాయి.
ధైర్య సాహసాలు కలిగిన మహారాణి జిందన్‌ గురించి ఈ ప్రపంచానికి తెలియకపోవడానికి కారణం ఏమిటంటారు?
ఇది నాకూ ఓ రహస్యమే. కానీ ఆ రహస్యమే ఈ పుస్తకం నాతో రాయించేలా చేసింది. ఎందుకంటే ఇది పరిశోధన చేయడానికి రాయడానికి ఇంత శక్తివంతమైన అసలైన విషయాన్ని నాకు ఇచ్చింది. సాధారణంగా మహిళల కథలు ఎప్పుడూ ఇలా చరిత్ర మరుగును పడిపోతూనే ఉంటాయి. ముఖ్యంగా వారి జీవితంలో బలమైన మగ పాత్రలు ఉన్నప్పుడు వీరి సాహసకృత్యాలు ప్రపంచం గుర్తించదు. మహా భారతంలో ద్రౌపది, రామాయణంలో సీత వంటి ప్రసిద్ధ పాత్రలు కూడా అలాంటివే. అందరి దృష్టి పాండవులపైనా లేదా రాముడిపైనే ఉంటుంది. అందుకే మహిళల కథలను ప్రపంచానికి చెప్పడం, వారి స్వరాలు, ఆలోచనలను విలువ ఇవ్వడమే నా బాధ్యతగా భావిస్తున్నాను. ఇక మహారాణి జిందన్‌ను కించపరచడానికి బ్రిటిష్‌ వారు భారీ ప్రచారాన్ని చేపట్టారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రజలు వాటిని విశ్వసించేలా ప్రయత్నం చేశారు. ఆమెకు చాలా మంది ప్రేమికులు ఉన్నారని ప్రచారం చేశారు. చరిత్రకారులు ఆమెను పక్కన పెట్టడానికి బహుశా ఇదే ప్రధాన కారణం కావొచ్చు.
ఓ సాధారణ కెన్నెల్‌ కుమార్తె రాణిగా ఎలా ఎదిగింది?
మహారాణి జిందన్‌ చిన్నప్పటి నుండే అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. మహారాజా రంజిత్‌ సింగ్‌ ఓ సాధారణ కెన్నెల్‌ కీపర్‌ కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఎందుకు ఎంచుకున్నారు? అతనికి ఎంత మంది భార్యలు ఉన్నా అతను ఆమెను చాలా గౌరవించాడు ఎంతగానో ప్రేమించాడు. వివాహం కూడా చేసుకున్నాడు. వాస్తవానికి అతను ఆమె తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకోలేదు. ఆమె అతని చివరి రాణి. ఆమె అతనితో చాలా సమయం గడిపేది. అతనిని జాగ్రత్తగా చూసుకునేది. ఆమె అతని నుండి యుద్ధ వ్యూహం, బ్రిటిష్‌ వారి గురించి తెలుసుకుంది. తన ప్రియమైన కొడుకు రాజుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అతని వయసు ఆరేండ్లు. అతన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఆమెదే. దాని కోసం తల్లి ప్రేమను, తన తెలివిని ఉపయోగించుకుంది. తన ముసుగునకు పక్కన పెట్టి ఖల్సా సైన్యంతో ఒక కూటమిని సృష్టించింది. ఆ సైనికులు ఆమెను ఎంతగానో ప్రేమించారు, గౌరవించారు. వారు ఆమెకు 'ఖల్సా తల్లి' అనే బిరుదు ఇచ్చారు.
రాణిగా ఆమె జీవితంలో రాజకీయంగా ఎన్నో కుట్రలు ఎదుర్కొవలసి వచ్చింది. ఆ ఇబ్బందులు ఎలాంటివి?
మహారాణి జిందన్‌ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌, పొలిటికల్‌తో సమతుల్యం చేసుకోవడానికి నేను చాలా తిరిగి రాయవలసి వచ్చింది. మహారాజా రంజిత్‌ సింగ్‌ మరణించిన తరువాత లాహోర్‌ కోర్టులో ఆ సమయంలో చాలా జరుగుతోంది. ఆయన కొడుకులు, మనవడు కూడా వింత పరిస్థితులలో మరణించారు. ఈ సంఘటనలన్నింటినీ అర్ధం చేసుకోవడానికి, ఆమె ఎవరిని విశ్వసించవచ్చో గుర్తించడానికి, అప్పటికి చిన్నవాడిగా ఉన్న మహారాజా దలీప్‌ సింగ్‌ను రక్షించడానికి ఆమె ప్రయత్నాలను నేను ఆ సంఘటనలను మహారాణి జిందన్‌ భావాలతో చిత్రీకరించుకునే ప్రయత్నం చేశాను.
ఈ పుస్తకంలో మహారాణి జిందన్‌ పాత్ర కాకుండా మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు వేరే ఇంకెవరైనా ఉన్నారా?
ఆమె ప్రియమైన స్నేహితులు... ఈ మహిళల గురించి రాయడం నాకు చాలా నచ్చింది. కాంగ్రాకు చెందిన రాణి గుద్దాన్‌, వజీర్‌ ధియాన్‌ సింగ్‌ భార్య రాణి పఠానీతో పాటు ముఖ్యంగా ఆమెకు నమ్మకమైన, తెలివైన పనిమనిషి మంగ్లా. ఈ మహిళలు మహారాణి జిందన్‌ను అనేక సమయాల్లో రక్షించి విజేతలుగా నిలిచారు. మహారాణి చునార్‌ జైలు నుండి తప్పించుకోవడానికి సహాయం చేసిన వ్యక్తికి నేను కొన్ని ఆధారాల ప్రకారం మాహి అనే పాత్రను కూడా సృష్టించాను.
మీరు ప్రత్యేకంగా శక్తివంతమైన మహిళల కథలనే ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
నేటి సంస్కృతిలో మహిళల ధైర్య సాహసాలను మెచ్చుకోవడం, వాటిని ప్రచారం చేయడం చాలా అవసరం. మహిళలు రోల్‌ మోడల్స్‌గా ఉండటం చాలా కీలకమని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని బలమైన శక్తులకు బయటపడతారు. అందుకే నేను ఈ కథలు రాస్తాను.

మహమ్మారి సమయంలో పుస్తకాన్ని విడుదల చేశారు. మరి దీనికి రావల్సినంత ప్రచారం వస్తుందంటారా?

అవును, ఇలాంటి సమయంలో కాస్త కష్టమే. అయితే నేనూ, ప్రచురణకర్త కలిసి ఓ నిర్ణయానికి వచ్చాము. పాఠకులపై మాకు నమ్మకం ఉంది. పాఠకులు గతంలోని నా పుస్తకాలను బెస్ట్‌ సెల్లర్‌ జాబితాలో ఉంచారు. అలాగే ఇప్పటి పరిస్థితుల్లో కూడా మహారాణి జిందన్‌ కథను అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. ఇంకా దీన్ని ఆలస్యం చేయటానికి నా మనసు ఒప్పుకోలేదు. పుస్తక ప్రచారం కోసం ఇంటర్నెట్‌లో ఈవెంట్‌లు చేస్తున్నాను. హాజరైనవారు ది లాస్ట్‌ క్వీన్‌పై ఆసక్తి కనబరుస్తారు. మహమ్మారి కారణంగా ప్రజలు చదవడానికి ఎక్కువ సమయం ఉంటుంది.
ప్రస్తుతం మీరు చదువుతున్న పుస్తకాలు?
ఇప్పటికే నా తర్వాతి రచన ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తున్నాను. ఇది బహుశా భారతదేశ స్వాతంత్య్రం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి నేను ప్రస్తుతం క్విట్‌ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంపై పరిశోధన చేస్తున్నాను. వినోదం కోసం మార్గరెట్‌ అట్వుడ్‌ రచించిన 'ది బ్లైండ్‌ అస్సాసిన్‌' చదువుతున్నాను. అట్వుడ్‌ నా అభిమాన రచయితలలో ఒకరు. ఆమె కూడా ఓ బలమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు.
చరిత్రలో మీకు ఇష్టమైన మహిళలు?
రజియా సుల్తానా, రాణి లక్ష్మి బాయి అంటే నాకు ఎంతో ఇష్టం. వీరి జీవితాలు నన్నెంతగానో ఆకర్షించాయి. అలాగే మీరా బాయిని నేను ఆరాధిస్తాను, ఆమె ఆధ్యాత్మిక పిలుపును అనుసరించడానికి అనేక సవాళ్లతో పోరాడవలసి వచ్చింది. 19వ శతాబ్దపు భారతదేశంలో అనేక వివక్షలను ఎదుర్కొన్న కదంబిని గంగూలీ జీవితాన్ని నేను ఇటీవల చదివాను. ఆమె డాక్టర్‌ కావాలని కోరుకుంది. 1893లో ఇంగ్లాండ్‌ వెళ్లి మెడిసిన్‌ చది, వైద్య పట్టా పొందారు. ఆమె భారతదేశపు మొట్టమొదటి, విజయవంతమైన మహిళా వైద్యులలో ఒకరు అయ్యారు. ఈమె జీవితం గురించి భవిష్యత్‌లో నేనే ఓ నవల రాసే అవకాశం కూడా ఉంది.

స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి

MORE STORIES FROM THE SECTION

manavi

ముఖాముఖి

ఎలక్ట్రానిక్‌ రంగంలో ఆమె ముద్ర

21-03-2021

కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్లలో ఒకరు రమ ఎన్‌ఎస్‌. తన ఉద్యోగ జీవితంలో 50 సంవత్సరాల ఐటిఐ, ఇన్ఫోసిస్‌లో పని చేశారు. ఇప్పుడు ఎఎల్సిఐటిఎ వంటి

manavi

ముఖాముఖి

మేం బతికేది ఎట్లా..?

17-03-2021

మన రాష్ట్రంలో బీడీలు చుట్టి బతికే వారి సంఖ్య వేలల్లో వుంది. ముఖ్యంగా మహిళలపై ఆధారపడ్డి నడుస్తున్న కుటుంబాలకు ఇదే జీవనాధారం. కానీ కోట్పా 2003 చట్టం

manavi

ముఖాముఖి

లా చేసి ట్రక్‌ డ్రైవర్‌ గా మారింది

10-03-2021

ఆమె పెండ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో లా కోర్సు పూర్తి చేసింది. కానీ ఇప్పుడు ట్రక్‌ డ్రైవర్‌గా మారింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ట్రక్‌ డ్రైవర్‌గా

manavi

ముఖాముఖి

మరో మహిళకు కీలక బాధ్యతలు

27-01-2021

అమెరికా పరిపాలనా వ్యవహారాలో భారత సంతతికి చెందిన మరో మహిళ అవకాశం దక్కించింది. అది కూడా కీలకమైన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు చేపట్టింది. ఆమే సమీరా ఫజిలి. అమెరికా పరిపాలనా విభాగంలో ఈ