స్త్రీ స్వాతంత్య్ర మర్హతి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిన్యాయ సలహాలు

స్త్రీ స్వాతంత్య్ర మర్హతి

లైంగికదాడి... ఆడవాళ్ళని మగవారు తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని, ప్రశ్నించేతత్వాన్ని దెబ్బతీసి ''మీరెప్పుడూ మాకన్నా తక్కువే. మాకు తలొగ్గి ఉండాల్సిందే'' అని చెప్పడానికి ఉపయోగపడుతున్న అతి భయంకరమైన భావవ్యక్తీకరణ. ఇటీవల దేశ ప్రజలను కలవరపాటుకు గురిచేసిన హత్రాస్‌ సంఘటన జరిగి గంటలు కూడా గడవకముందే.. ఆమె చితి మంటలు పూర్తిగా ఆరకముందే.. అదే రాష్ట్రంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కేసులు చోటుచేసుకున్నాయి. ఈ విజయవాడలో మరో రెండు అఘాయిత్యాలు జరిగాయి. ఒకటి ఓ యువతిని నాగభూషణం అనే ఆటో డ్రైవర్‌ ప్రేమను అంగీకరించక పోవటంతో అమెను పెట్రోలు పోసి చంపేశాడు.
ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని పెయింటర్‌ వృత్తి చేసుకునే నాగేంద్రబాబు అనే యువకుడు ఆమె ఇంట్లోనే కత్తితో దాడిచేసి చంపేసి తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్‌ జిల్లా పూసలగల్లీలో ఆయుర్వేదం, భూతవైద్యం పెరుతో మహిళల్ని, బాలికలను లైంగికంగా లోబరుచుకుని బెదిరిస్తున్న ఒక దొంగ డాక్టర్‌కి మహిళలు, ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఆగస్టు నెలలో హైదరాబాద్‌లోని అమీన్పూర్‌ అనాధాశ్రమంలో ఓ దళిత బాలిక అక్కడి నిర్వాహకుల చేతిలో చాలా కాలంగా లైంగిక హింసకు గురై, గర్భం దాల్చి పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ వార్త పత్రికల్లో పతాక శీర్షికన నిలిచింది.
ఇలా రాసుకుంటూ పోతే ఈ సంఘటనలకు అంతూ దరి లేకుండా పోతుంది. ప్రపంచ దేశాలు కరోనాను మహమ్మారిగా ప్రకటించాయి. కానీ మన దేశంలో మాత్రం అంతకంటే ప్రమాదకరమైన లైంగిక దాడుల మహమ్మరి మహిళల జీవితాల్ని కబళిస్తోంది. ఇందుకు ఇటీవల నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2019 గణాంకాలతో విడుదల చేసిన నివేదిక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ నివేదిక ప్రకారం 2018లో భారతదేశంలో మూడు లక్షల ఎనభై వేలమంది మహిళలు వివిధ రకాల హింసకు గురికాగా 2019లో ఆ సంఖ్య నాలుగు లక్షల యాభై వేలకు పెరిగింది. దీనిలో లైంగిక దాడులు 8 శాతం. 32,033 మంది బాధితులలో 11 శాతం మంది దళితులు. లైంగిక దాడుల కేసులు గత సంవత్సరం కన్నా 7.3 శాతం పెరిగాయి. ప్రతి లక్ష మంది మహిళా జనాభాకు క్రైమ్‌ రేట్‌ 2018లో 58.8 శాతం కాగా, 2019లో 62.4 శాతం. రోజుకు సగటున 8 శాతం లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి.
మహిళలు ఎదుర్కొంటున్న ఇతర హింసలు
- భర్త లేదా సమీప బంధువుల క్రూరత్వానికి గురైన / బలైన వారు 30.9 శాతం.
ఆమె గౌరవానికి భంగం కలిగించి తమ ఆడియోలో ఉంచుకోవాలని చేసినవి 21.8 శాతం.
- కిడ్నాప్‌లు, అపహరణ 17.9 శాతం.
- కనిపించకుండా పోయినవారు / అక్రమ రవాణాకు గురైనవారు 15 శాతం.
ఇవి కేవలం ప్రభుత్వ రికార్డుల్లో నమోదైనవి. నమోదు కానీ కేసులు దీనికి రెట్టింపు ఉండవచ్చని అంచనా. గత పదేండ్లలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు 44 శాతం పెరిగాయని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి.
పితృస్వామ్య భావజాలం
భారతదేశం మహిళలకు ఏ మాత్రం సురక్షితమైనది కాదని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతేకాదు ఇటీవల విదేశీ మహిళా యాత్రికులపై కూడా లైంగిక దాడులు జరిగిన నేపధ్యంలో అనేక దేశాలు తమ పౌరులకు భారతదేశంలో పర్యటించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక ఆదేశాలు జారీచేసాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ మనదేశంలో ఇటీవలి కాలంలో విచ్చలవిడి తనం, బరితెగింపు, క్రూరత్వం ఎక్కువైంది. లోతుగా పరిశీలిస్తే మన దగ్గర బలంగా వెళ్లూనుకున్న కుల, మత, పెత్తందారీ, పితస్వామ్య వ్యవస్థ దీనికి ప్రధాన కారణం. ఆడవారిని రెండో తరగతి పౌరులుగా, పురుషుని ఆస్తిగా భావిస్తున్నారు. ఈ భావజాలం తరతరాలుగా నరానరానా జీర్ణించుకు పోవటంతో తమను ధిక్కరిస్తే వారి అహం దెబ్బతింటోంది. దానిని సంతప్తి పరుచుకోవటం కోసం, తమ అధికారాన్ని ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రేమించక పోతే అమ్మాయిని చంపేసే హక్కు అబ్బాయిలకు, ప్రేమించి పెండ్లి చేసుకుంటే చంపేసే హక్కు తల్లిదండ్రులకు ఉన్నదని భావించే సమాజం మనది. ''కేవలం ఆడది'' కాబట్టే కొడతారు, తిడతారు. ఎదురుతిరిగితే లైంగిక దాడి చేస్తారు. ఇంకా కసి తీరకపోతే చంపేస్తారు. లేదా తమ ఆధీనంలో ఉంచుకుని అవసరమైన విధంగా వాడుకుంటారు. పసి పాపలో కూడా ఆడదాన్నే చూస్తారు. అవసరం తీరే దారి లేకపోతే తాము జన్మనిచ్చి పెంచిన బిడ్డనే ఆటబొమ్మ చేస్తున్నారు.
కుల, మత ప్రభావం
అగ్రకులస్తులు దళిత మహిళపై లైంగిక దాడిని ఓ సాధనంగా వాడుకుంటున్నారని స్వయానా నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో వెల్లడించింది. ఫ్యూడల్‌ వ్యవస్థ బలంగా ఉన్న రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో దళితులు, దళిత మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతుండటం గమనించవచ్చు. తమపై లైంగికదాడి జరిగినా ఎవరికీ చెప్పుకోలేరు. చెప్పినా ఎవరూ లెక్క చెయ్యరు. పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యరు. మనీషా కేసులో జరిగింది అదేకదా. నెత్తురోడుతున్న శరీరంతో పోలీసుస్టేషన్‌ ముందు పడి ఉన్నా వారికి అదొక నాటకంగా కనిపించింది. అసలు దాడే జరగలేదని బుకాయించిన పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు కానిచ్చేశారు. ఇదే అగ్రకులస్తులకు జరిగితే ఇలాగే చేసేవారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిందంటే సమస్య ఎంత లోతైనదో మనకు అర్ధమవుతుంది. మత కక్షలు, విద్వేషాలకు కూడా మహిళలు, పిల్లలే సమిధలవుతున్నారు. కాశ్మీర్‌లోని కతువా ఉదంతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. బాకార్వాల్‌ తెగకు చెందిన కుటుంబాన్ని ఉరినుంచి వెల్లగొట్టటానికి వారి మైనర్‌ కుమార్తె అసిఫా బానోను కిడ్నాప్‌ చేసి, ఒక దేవాలయంలో వారం రోజులపాటు బంధించి, లైంగిక దాడి చేసి చంపేశారు. దీనికి సారధ్యం వహించింది సాక్షాత్తు ఆ గుడి పూజారి.
ఇందుకిలా..?
ఇటీవల మహిళల మీద దాడులు పెరగటమే కాదు వాటి స్వరూప స్వభావాలలో కూడా తీవ్రమైన మార్పు చోటుచేసుకుంటోంది. సామూహిక లైంగిక దాడి చేయడం, తీవ్రంగ హింసించడం, దీన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం, ఇంకా అహం చల్లారక పోతే చంపి నామరూపాలు లేకుండా చెయ్యటం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ఎందుకిలా..? 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు ప్రజల నుండి తీవ్ర నిరసనలు రావటంతో ప్రభుత్వం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తూ నిర్భయ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. ప్రజలు సంతోషించారు. కానీ నెల కూడా కాకముందే అలాంటి అనేక సంఘటన దేశం నలుమూలల చోటు చేసుకున్నాయి. తాజాగా 2019 నవంబర్‌లో హైదరాబాద్‌ శివార్లలో జరిగిన దిశ ఘటన ఇంకా మన మనసులోంచి చేరిగిపోనేలేదు. ఆపేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక చట్టాన్ని తీసుకు వచ్చారు. కొంతమందిని శిక్షించారు. అయినా అఘాయిత్యాలు ఆగట్లేదు.
మహిళలే వారి టార్గెట్‌
అగ్నికి ఆజ్యం తోడైనట్టు సోషల్‌ మీడియా ఆవిర్భావంతో మహిళలను టార్గెట్‌ చేసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలనే కాదు చదువు, సమాజంలో పేరు, తమకంటూ ఓ ప్రత్యేక స్థానంలో ఉన్న వారిని కూడా వదలట్లేదు. వారం రోజుల కిందట ఐపిఎల్‌ 2020లో సరిగ్గా ఆడలేదనే కారణంతో ధోని ఐదేండ్ల కూతురును రేప్‌ చేస్తానని గుజరాత్‌లోని కచ్‌కు చెందిన 16 ఏండ్ల కుర్రాడు ఇన్స్టాగ్రామ్‌లో బెదిరించాడు. దీనిని ఉన్మాదం అనాలా, అమాయకత్వం అనుకోవాలా. ఇది మచ్చుకి ఒక సంఘటన మాత్రమే. ఇలాంటివి ప్రతి రోజు వందలువేలు జరుగుతున్నాయి.
మనువాద సూక్తులు
'న స్త్రీ స్వాతంత్‌ర్య మర్హతి' అనే మనుధర్మ సూక్తి తరతరాల నుండి విని ఒంట బట్టించుకున్న సమాజంలో ఆడవాళ్ళకి అవమానాలు, ఆంక్షలు, చీదరింపులు సర్వసాధరణ విషయాలుగా చూడబడతాయి. తమ కుటుంబ సభ్యుల వల్లనే లైంగిక దాడులకు గురికావటం మరో కోణం. అన్నదమ్ములు, తండ్రి, చిన్నాన్నల వల్ల దాడికి గురౌతున్నారు. ఇక భర్తల వల్ల శారీరక, మానసిక హింసకు గురవుతున్న వారి విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో పెరిగిన గహ హింస, లైంగిక దాడుల సంఖ్య దీనికి అద్దం పడుతోంది. ఇదంతా చూసినప్పుడు మనకు ఏమి అర్ధం అవుతోంది. మనుధర్మ సూక్తులను తరతరాల నుండి విని ఒంట బట్టించుకున్న సమాజంలో ఆడవాళ్లకి అవమానాలు, ఆంక్షలు, చిదరింపులు సర్వసాధారణ విషయాలలాగా చూడబడతాయి.
న్యాయం చేయాల్సిన వారే...
ఒక పక్క ఇలాంటి సంస్కతి సంప్రదాయాలు కొనసాగుతుండగానే, మరోపక్క మహిళలు చదువుకుని స్వతంత్ర భావాలతో ఎదుగుతు న్నారు. సమాజ అభివద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇది చాలా చాలా నామమాత్రం. కానీ ఇంత చిన్న అభివధికర మార్పుని కూడా అంగీకరించే స్థితిలో నేటి సమాజం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు మన చుట్టూ నిత్యం జరుగుతున్న ఈ సంఘటనలన్ని. శాసనాలను అమలుపరచాల్సిన వారే ఆడవారిని కట్టడిలో పెట్టకపోతే అదుపు తప్పుతారని, తమ పిల్లలపై దాడులు జరగకుండా తల్లితండ్రులు ఆడపిల్లలకు బుద్ధులు నేర్పాలని, లేకపోతే ఇటువంటి శాస్తి జరుగుతుందని అధికారంలో ఉన్న వారే మాట్లాడుతున్నారు. మరి న్యాయం ఎండమావికాక ఇంకెమవుతుంది.
విష పోకడలు
వీటన్నిటికీ తోడు సంప్రదాయం, సంస్కతి, వినోదం, వ్యాపారం పేరుతో మహిళను అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. నల్లమందుకు అలవాటుపడిన యువత తమ ఫన్‌కి, ఫ్రస్ట్రేషన్‌కి ఆడవాళ్లే ముడిసరుకనే తీవ్ర ధోరణిలోకి నెట్టి వేయ్యబడుతున్నారు. అందుకే అటు నిర్భయ విషయంలోనైనా, ఇటు దిశ సంఘటనలో నైనా నేరస్థుల నేపధ్యం ఇంచుమించు ఒకలాగే ఉండటం మనం చూస్తాం. అందువల్లనే పురాతన భావాల ప్రభావం, అందుబాటులో కొచ్చిన నూతన సాంకేతికత, రెండు కలసిన ప్రమాదకర విష పోకడలు మహిళలు, అమ్మాయిల జీవితాలపైన ముప్పేట దాడిచేస్తున్నాయి. నిరుద్యోగం, దారిద్య్రం, న్యూనతా భావం, అధికులమనే అహంకారం మొదలైన కారణాలకు లైంగిక దాడులకు ఒక ఆటవిడుపుగా వాడుకుంటున్నారు.
మరి దీనికి పరిష్కారం?
చాలా మంది మధ్యతరగతి మేధావులు, బుద్ధిజీవులు చేపుతున్నట్టు కుటుంబంలో పిల్లల పెంపకం, అమ్మాయిలపట్ల వారి దక్పధం లో చాలా మార్పు రావలసిందే. కానీ ఇది నామమాత్రపు మార్పుకి దోహదపడుతుంది. దీనిని స్వాగతించవలసిందే. కానీ వ్యవస్థ లో సమూల మార్పు మాత్రమే శాశ్వత పరిష్కారం చూపగలుగుతుంది. అమలు సరిగ్గా లేకపోతే ఎంత గొప్ప చట్టమైనా వధానే. సామాజిక చైతన్యం కలిగిఉండటం, కలిగించడం, పరిష్కారం దిశగా కలిసి నడవటం, 'స్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అని నినదించడం నేటి మన తక్షణ కర్తవ్యం.
- పద్మశ్రీ,
9490098687

స్త్రీ స్వాతంత్య్ర మర్హతి

MORE STORIES FROM THE SECTION

manavi

న్యాయ సలహాలు

ఎదుగుదలకు తోడ్పాటునివ్వాలి

09-11-2020

పిల్లల తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను మార్కులతో కొలవడం సమంజసం కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి

manavi

న్యాయ సలహాలు

ఆదివారం ఎలా గడుపుతున్నారు?

25-10-2020

సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఒకవేళ సెలవు ఉంటే మాత్రం ఏం చేస్తారు.. బోలెడు పనులు అంటూ అన్నింటినీ ఏకరవు పెట్టేస్తేంటారు. అసలు విజేతలైన

manavi

న్యాయ సలహాలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..?

08-10-2020

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి భయపడే జనం ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. మీరు కూడా అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..? అయితే కొంచెం ఆలోచించండి...

manavi

న్యాయ సలహాలు

జయించండి ఇలా...

28-09-2020

కోవిడ్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని కబళిస్తూనే వుంది. వైరస్‌ సోకి ఇప్పటికే చాలా మంది మరణించారు. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐతే కరోనా వైరస్‌ గురించి టీవీలో వస్తున్న