సంపాదన మొదలైన నాటినుంచే..! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిడబ్బు - పొదుపు

సంపాదన మొదలైన నాటినుంచే..!

'ధనం మూలం ఇదమ్‌ జగత్‌' అన్న నానుడి శతాబ్దాల కిందటే మన పెద్దవారు చెప్పారు. మనిషి జీవించడానికి కావల్సిన గాలి, నీరు, తిండి, బట్ట, గూడు ఇవ్వన్ని కావాలంటే డబ్బు ఉండాలి. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమే. అయితే దినసరి వేతనాలతో బతికేవారికి ఈ రోజు గురించి తప్ప రేపటి గురించి ఆలోచన ఉండదు. డబ్బు సంపాదించాలని చాలామంది కోరుకుంటారు. కానీ, ఎలా అన్నది తెలియదు. ఆర్థిక మాంద్యం ప్రభావం సగటు మధ్యతరగతి వారిపై ఎక్కువగా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
- టీవీ ప్రకటనలో ఒక పెద్దాయన చెప్పినట్టు 'డబ్బులు ఎవరికీ ఊరికనే రావు'. నిజమే కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వస్తాయి. డబ్బు అనేది కనీస అవసరం. పీల్చేగాలి, తాగే నీళ్లు కూడా డబ్బులిచ్చికొనాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ఇంటి అవసరాలతో పాటు రేపటి భవిష్యత్‌ కోసం పొదుపు చేయాలనుకోవడం కత్తి మీద సాము చేయడమే. అయితే పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం కొంతైనా పొదుపు చేయక తప్పదు.
- చాలా మంది ఉద్యోగం చేసి, మరికొంత మంది బిజినెస్‌ ద్వారా డబ్బు సంపాదిస్తారు. అతి కొద్ది మంది వంశపారంపర్యంగా ఆస్తులు ఉన్నవారు ఉంటారు. అయితే ఏ రకంగా సంపాదన ఉన్నా దాంట్లో కొంతైనా పొదుపు చేసినప్పుడే పదికాలాల పాటు ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటారు. స్థిరాస్తులు న్నాయని ఏ పని చేయకుండా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయన్న పెద్దల మాట గుర్తుంచుకోవాలి.
బ్యాలెన్స్‌డ్‌గా..
ఎక్కువ మంది పొదుపు చేసిన మొత్తాలను షేర్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అయితే షేర్‌మార్కెట్‌పై అనుభవం లేకుండా ఇన్వెస్ట్‌ చేస్తే అప్పులే మిగులుతాయి. హై రిస్క్‌ వాటి జోలికి వెళ్ళకుండా బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. అయితే లాభాలు రావడానికి కాస్త వెయిట్‌ చేయాలి. అన్ని సందర్భాలలోనూ మంచి జరుగుతుందని చెప్పడం కష్టం. చాలా సమయాల్లో ఎంతో ఆలోచించి తీసున్న షేర్లు, చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ కారణంగా నష్టాలు రావచ్చు. ఇలాంటి సమయంలో పాజిటివ్‌ థింకింగ్‌ చాలా ముఖ్యం. బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించాలి.
సమయపాలన చాలా ముఖ్యం..
సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ఆర్థికంగా ముందడుగు వేస్తారు. టైమ్‌ మేనెజ్‌మెంట్‌ తెలియడం వల్ల అనవసరపు ఖర్చులను, వ ధా ప్రయాసలను, మానసిక ఆందోళనలను తగ్గించుకోవచ్చు. దీనివలన ఉన్న సమయాన్ని ఉన్నతమైన విషయాలపై మళ్లించడం ద్వారా మానసికంగా, ఆర్ధికంగా ఎదగడం సాధ్యమవుతుంది. అందరికి ఉన్నది 24 గంటలే. కొందరు సరైన విధంగా ఉపయోగించుకుంటారు. మరి కొందరు అనవసర విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేలోగా అవకాశం చేజారిపోతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన ఆలోచన విధానం, మానసిక పరిపక్వత ఆర్థిక ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది.
అనవసర ఖర్చులకు కళ్ళెం వేస్తూ..
ఆర్థికమాంద్యంతో చాలా కంపెనీలు మూతపడే స్థితిలో ఉన్నాయి. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. డిస్కౌంట్స్‌, క్రెడిట్స్‌ అంటూ అవసరం ఉన్నా లేకపోయినా కస్టమర్లు కొనేలా చేస్తున్నాయి. ఈ మార్కెట్‌ మాయాజాలంలో చిక్కుకోకుండా జాగ్రత్త వహించాలి. ఏ వస్తువైనా కొనాలనుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఆఫర్లను చూసి అవసరం లేకున్నా కొంటే ఆ తర్వాత అప్పులపాలు కావల్సిందే. ఉదాహరణకు ఈ మధ్య చాలా షాపింగ్స్‌మాల్స్‌లో ఒకటి కొంటే ఐదువందలు, రెండు కొంటే ఒకటి నాలుగువందలు అంటూ చాలా తెలివిగా తమ స్టాక్‌ను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. వంద తగ్గుతుంది కదా అని రెండు కొంటున్నారు తప్ప ఐదువందలు ఖర్చు చేద్దామనుకునే సగటు కస్టమర్లు ఎనిమిది వందలు ఖర్చు చేస్తున్నారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. వినియోగదారులను ముంచే ఇలాంటి ఆఫర్లు చాలా ఉన్నాయి.
ప్రణాళిక ముఖ్యం..
దేశ బడ్జెట్‌లో ఖర్చులను ముందు చూసుకొని అందుకు తగ్గట్టుగా ఆదాయాలను సమకూర్చుకునే ప్రణాళికలు రూపొందిస్తారు. కానీ, ఇంటి బడ్జెట్‌లో ఇది సాధ్యం కాదు. మన ఆదాయం అనేది నిర్ధిష్టంగా ఉంటుంది. ఉద్యోగాల్లో అంతరాయం, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో కొన్నిసార్లు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఆదాయం కన్నా ఖర్చులు తక్కువగా ఉండాలి. అప్పుడే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోగలుగుతారు. చాలామంది ఖర్చులన్నీ పోయిన తర్వాత మిగిన డబ్బును పొదుపు చేద్దాం అనుకుంటారు. ఇది సరైన పద్దతి కాదు. పొదుపు చేసిన తర్వాత మిగిలిందే ఖర్చు చేయాలన్నది ఆర్థిక నిపుణులు చెప్పే అభివృద్ధి సూత్రం. అయితే అది సగటు మధ్యతరగతి వారికి సాధ్యం కాదు. అందుకే నెల మొదటిరోజునే కచ్ఛితంగా ఎంత పొదుపు చేయాలనుకనుంటున్నామో ఆ మొత్తాన్ని పక్కన పెట్టాకే.. మిగిలింది ఇంటి అవసకాల కోసం అనుకున్న ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాలి.
సరైన పథకాల్లో..
సంపాదన మొదలైన నాటినుంచే కొంతైనా పొదుపు చేస్తూ ఆ డబ్బును సరైన పథకాలలో మదుపు చేస్తే భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన ఎదురైతే ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎండోమెంట్‌, హౌల్‌ లైఫ్‌ లాంటి జీవిత బీమా పాలసీలు తీసుకోవాలి. మారుతున్న కాలానికి, జీవన ప్రమాణాలకు తగట్టు టర్మ్‌ జీవిత బీమా పాలసీలు ప్రవేశ పెట్టారు. వీటిలో తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా హామీని పొందవచ్చు.
భవిష్యత్‌ అవసరాలకు..
సంపాదన మొదలైన నాటినుంచే భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసుకుంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక మాంద్యాన్ని అంచనా వేసుకుంటూ భద్రతలేని ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడితే తట్టుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి.

సంపాదన మొదలైన నాటినుంచే..!

MORE STORIES FROM THE SECTION

manavi

డబ్బు - పొదుపు

అన్నింట్లోనూ పొదుపుగా...

15-03-2020

ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. మరి ఇలాంటి రోజుల్లో పొదుపు పాటించవలసిన అవసరం ఎంతయినా ఉంది. మరి ఆ పొదుపు మంత్రమేమిటి? పొదుపు అన్నది కేవలం డబ్బు విషయంలోనే కాదు, నిత్య జీవితంలో ఎన్నో విషయాల్లో పాటించవలసి ఉంటుంది.

manavi

డబ్బు - పొదుపు

ప్లాస్టిక్‌కి దూరంగా...

29-02-2020

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల అనారోగ్యం, ప్రాణాపాయం అని తెలిసినా ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్‌ మయమయిపోయింది. ఇందులోంచి ముందుగా పిల్లలను రక్షించే మార్గాలనైనా ఆలోచించాలి. అందుకోసం చేయాల్సింది....

manavi

డబ్బు - పొదుపు

ఖర్చులు తగ్గించుకోవాలంటే...

26-02-2020

మనలో చాలామంది నెలలో మొదటి వారం గడిపినట్లుగా.. ఆఖరి వారం గడపలేరు. మొదటి వారం జీతం రాగానే ఎక్కువగా ఖర్చు చేసేసి.. ఆఖరి వారం వచ్చాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ప్రతి వారం కొన్ని ఖర్చులను తగ్గించుకొని.. మిగిలిన