చట్టాలెన్నొచ్చినా మహిళకు రక్షణేదీ..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిసామాజిక సేవ

చట్టాలెన్నొచ్చినా మహిళకు రక్షణేదీ..?

మనసుకు రాయాలనిపించినప్పుడు అప్పటికప్పుడు రాసేస్తారు. తనకు ఎదుట పడిన వ్యక్తుల జీవితాలే ఆమె కథల్లో పాత్రలుగా మలుచుకుంటారు. హైకోర్టు జడ్జికి భార్యగా కాక వివిధ లా కళాశాలల్లో అధ్యాపకురాలిగా పని చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది న్యాయవాదులను తయారు చేశారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయం జరగాలంటే శిక్షలు కఠినంగా కాదు తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా పడాలి అంటున్నారు. ఆమే డా|| ఆరేటి కృష్ణ కుమారి. ఆమె గురించి మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే...
మా సొంతూరు తణుకు దగ్గరి ఇరగవరం గ్రామం. అమ్మ కనకదుర్గాంబ. నాన్న పాలేశ్వర రావు, పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో చేసే వారు. ఆయనకు చదువంటే ఇష్టం. పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఆయన కోరిక. నాకేమో చిన్నప్పుడు చదువుపై ఆసక్తి ఉండేది కాదు. మా చెల్లి, తమ్ముడు స్కూల్‌కి వెళుతుంటే నేను మాత్రం అల్లరి చిల్లరిగా తిరుగుతుండేదాన్ని. పదేండ్లు వచ్చిన తర్వాత ఆరో తరగతిలో చేరా. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే వుండేదాన్ని. నాన్న బలవంతంతో ఏదో చదువుకున్నా. ఏలూరులో బిఎస్సీ పూర్తి చేశా. తర్వాత నాతో మెడిసెన్‌ చేయించాలని నాన్న ఢిల్లీలో డొనేషన్‌ కట్టి మరీ నన్ను చేర్పించారు. కానీ దాన్ని పూర్తి చేయకుండా వెనక్కి వచ్చేశా. అప్పట్లో చదువు విలువ పెద్దగా తెలియలేదు. మెడిసెన్‌ నుండి వెనక్కి వచ్చిన తర్వాత నాగార్జున యూనివర్సిటిలో ఎమ్మే ఇంగ్లీష్‌ చేశా.
అమ్మ చదివే పుస్తకాలన్నీ చదివేదాన్ని
మా ఇంట్లో పుస్తకాలు బాగా ఉండేవి. అమ్మ ఎనిమిదో, తొమ్మిదో చదువుకుంది. నవలలు, వీక్లీలు బాగా చదివేది. అప్పట్లో షాపుకు వెళ్ళి ఆంధ్రప్రభ నేనే కొనుక్కొచ్చేదాన్ని. అమ్మ చదివే పుస్తకాలన్నీ నాతో కూడా చదివించేది. శరత్‌బాబు నవలలు అన్నీ చదివించేది. అవేం అర్థం అయ్యేవి కాదు. ఎందుకు చదవమనేదో తెలిసేది కాదు. చదవమంది కాబట్టి చదివేదాన్ని. దాంతో పద్నాలుగు, పదిహేనేండ్లప్పుడే రాయడం మొదలుపెట్టా.నాకంటూ చదవాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత కొడవటిగంటి కుటుంబరావు నవలలు బాగా చదివాను. నాకు చాలా ఇష్టమైన రచయిత ఈయన.
చాలా రాయాల్సి వుంది
ఏదైనా సంఘటన చూసినప్పుడు స్పందించి రాస్తుంటాను. నిత్య జీవితంలో నాకు తటస్థపడిన మనుషులే నా కథల్లోని పాత్రలు. నన్ను కొంత మంది స్త్రీ వాద రచయిత్రి అంటారు. దానికి నేను ఒప్పుకోను. వాస్తవానికి నేను చాలా రాయాల్సి వుంది. నా భర్త, కొడుకు నాపై ఆధారపడకుండా ఉండివుంటే ఇంకా రాసి వుండేదాన్ని. చాలా పత్రికలకు కథలు రాసి పంపేదాన్ని. అప్పట్లో ఈనాడు పత్రికలో చలసాని ప్రసాదరావు అని ఉండేవారు ఆయన అడిగిమరీ రాయించుకునేవారు. ముందు కథలు రాయడం ప్రారంభించా. నవలలు చాలా ఆలస్యంగా మొదలుపెట్టా. ఎమ్మే ఇంగ్లీష్‌ తర్వాత ఏలూరులో బిఎల్‌ చేరాను. ఫస్ట్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు శంకర్‌తో నా పెండ్లి జరిగింది.
చదువు కొనసాగించా...
పెండ్లి తర్వాత చదువు మాన్పించాలని మా అత్తయ్య చాలా గోల చేశారు. మా నాన్న కూడా 'ఆమెకు ఇష్టం లేనప్పుడు ఆపేయవచ్చు కదా' అన్నారు. ఇదే విషయం నాన్న శంకర్‌తో అంటే 'మీరు కృష్ణను నాకిచ్చి పెండ్లి చేశారా? మా అమ్మకు ఇచ్చి చేశారా? తను కచ్చితంగా చదువుకుంటుంది' అన్నారు. దాంతో నా చదువు కొనసాగించా. బిఎల్‌ తర్వాత ప్రాక్టీస్‌ చేద్దామంటే మా వారు జడ్జి కావడంతో ప్రాక్టిస్‌ చేయడానికి అవకాశం లేదు. అందుకే ఆంధ్ర యూనివర్సిటిలో ఎంఎల్‌ చేశా. తర్వాత చాలా లా కాలేజీలలో లెక్చరర్‌గా చేస్తూ 'క్యాపిటల్‌ పనిష్మెంట్‌' కంపారిటివ్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ కూడా చేశా.
లా అధ్యాపకురాలిగా...
గుంటూరు ఏసీ కాలేజీలో, విజయవాడ సిద్ధార్థ, మాంటిస్సోరి, హైదరాబాద్‌ పడాల రామిరెడ్డి లా కాలేజీలలో లెక్చరర్‌గా చేశాను. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎడిటర్‌ అండ్‌ చీఫ్‌ అని ఓ సెక్షన్‌ ఉండేది. దానికి చీఫ్‌ ఎడిటర్‌గా చేశా. ఆ తర్వాత 2002 నుండి 2008 వరకు ముస్సోరీ లాల్‌బహదూర్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీలో లా ప్రొఫెసర్‌గా చేశారు. అప్పటి వరకు మా వారికి ఎక్కడ పోస్టింగ్‌ ఉంటే అక్కడే నేనూ జాబ్‌లో చేరేదాన్ని. మా బాబును, మా వారిని వదిలి అంత దూరం ఉద్యోగానికి వెళ్ళడం అదే మొదటి సారి. అప్పుడు మా బాబు ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. 'ఇన్నేండ్లు మా కోసమే చేశావు. ముస్సోరీలో జాబ్‌ అంటే మంచి అవకాశం, వదులుకోవద్దు వెళ్ళు' అని మా బాబు ప్రోత్సహించాడు. అక్కడ నుండి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్టేట్‌ అకాడమీలో గ్రూప్‌ 1 ఆఫీసర్లకు లీగల్‌ ట్రైనింగ్‌ ఇచ్చాను. ఆ తర్వాత జీఎమ్మార్‌లో లీగల్‌ హెడ్‌గా చేసి రిటైర్‌ అయ్యాను. అధ్యాపకురాలిగా చేస్తూ రిటైర్‌ కాలేక పోయానే అనే బాధ నా మనసును ఇప్పటికీ తొలిచేస్తూ వుంటుంది.
వ్యవస్థలోని లొసుగులు వాడుకుంటున్నారు
నిర్భయ, దిశ ఘటనలు జరిగిన తర్వాత చట్టాలు పెద్ద ఎత్తున మార్పులు తెచ్చారు. కానీ నేరాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఘటనలు జరుగుతూనే వున్నాయి. న్యాయ వ్యవస్థలో వున్న లొసుగులను ఉపయోగించుకొని సులభంగా బయట పడొచ్చు అనే భావం అందరిలో వుంది. అందుకే నేరాలు తగ్గడం లేదు. నేను ఉరిశిక్షకు వ్యతిరేకం. అందుకే నా పీహెచ్‌డీ సబ్జెక్ట్‌ అదే తీసుకున్నా. శిక్ష కఠినంగా ఉండడం కాదు శిక్ష కచ్చితంగా పడుతుంది అనే భయం ఉండాలి. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. మరో విషయం మన దగ్గర లైఫ్‌ అంటే 14 సంవత్సరాలు. 20 ఏండ్లకు నేరం చేస్తే 34 ఏండ్లకు బయటకు వచ్చి ఆ వ్యక్తి హాయిగా బయట తిరుగుతుంటాడు. లైఫ్‌ అంటే జీవితాంతం జైల్లో ఉండాలి. శిక్షలో ఉన్నప్పుడు అతనితో పని చేయిస్తారు. ఆ డబ్బులు ఆ బాధ్యురాలికి ఇవ్వాలి.
ఆలస్యం కాకూడదు...
లైంగిక దాడులు జరిగితే త్వరగా బయటకు రావు. వచ్చినా సరైన సాక్షాలు ఉండవు. ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ లాబ్‌లు మన దగ్గర చాలా తక్కువ. అందుకే ఆధారాలు దొరకడం ఆలస్యమవుతుంది. ఆలస్యం వల్ల సాక్షాలు తారుమారు అయిపోతాయి. దాంతో శిక్షలు పడవు. అదే ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో దీనికోసమే ప్రత్యేకంగా ఓ డాక్టర్‌, ఇద్దరు నర్సులకు శిక్షణ ఇచ్చి నియమిస్తే వాళ్ళే రిపోర్టులు తయారు చేస్తారు. అలాగే ఈ విషయంలో పోలీసులకు కూడా సరైన అవగాహన కల్పించాలి. ఇవన్నీ సరిగ్గా జరిగి సరైన సాక్షాలు సరైన సమయంలో తీసుకురాగలిగితే బాధితురాలికి కచ్చితంగా న్యాయం జరుగుతుంది.
నవలలు, కథలు, వ్యాసాలు
'ఏది ప్రేమ ఏది మోహం' నవల 'విధి వంచితులు' పేర 1997 నుండి 2000 వరకు విశ్వ ఉద్యోగి మాసపత్రికలో ధారావాహిగా వచ్చింది. నాకూ, శంకర్‌కు చిన్ననాటి స్నేహితుడైన హరిబాబు పట్టుబట్టి దీన్ని నాతో రాయించాడు. 'కరగని కల' నవల అప్పటికప్పుడు మనసుకు తోచింది రాసేశాను. ఇది 1992లో చతుర మాస పత్రికలో ప్రచురించింది. తర్వాత 'టీనేజ్‌' నవల కూడా చతురలో 1993లో వచ్చింది. తర్వాత రాసిన 'వసుధ' నవల కూడా 2001లో చతుర మాసపత్రికలో వచ్చింది. 'మసకేసిన చంద్రుడు' అనే ఓ కథ రాశాను. అది ఆంధ్ర యూనివర్సిటీలోని ఆరాచకాలు, కుల వివక్షను చూసి రాశాను. నవలలన్నీ కలిపి ఓ పుస్తకంగా తీసుకువచ్చా. అలాగే కథలు, వ్యాసాలను కలిపి మరో పుస్తకంగా తెచ్చాను. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల రచనలకు కాస్త దూరం అయ్యాను.
విలువలు తగ్గిపోతున్నాయి
విద్య, వైద్యం ప్రైవేట్‌ పరం చేశారు. దీని వల్ల సమాజంలో సమస్యలు మరింతగా పెరిగాయి. విద్యలో విలువలు తగ్గిపోయాయి. అందుకే పిల్లల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇవి రెండూ ఎప్పుడూ ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. సరైన పద్ధతిలో అమలు చేయాలి. అప్పుడు సమాజం కొంతైనా బాగుపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రస్తుత ఇంటర్‌ నెట్‌ యుగంలో ప్రేమలు ఎలా ప్రారంబ మవుతున్నాయి ఎలా అంతమవుతున్నాయి అనే దానిపై రాస్తున్నాను. దీన్ని త్వరలో పూర్తి చేస్తాను.
బయట గుర్తింపు లేక
మగవాళ్ళు, పిల్లలు ఇంటి పనుల్లో భాగస్వాములు అయితే మహిళలకు సమయం ఉంటుంది. భార్యా భర్తలు ఇద్దరూ ఇంటి పనులు చేసుకోవాలి. ఆడవాళ్లు కూడా పనులన్నీ తమ నెత్తినే పెట్టుకుంటారు. నేను లేకపోతే నా భర్తకు రోజు గడవదు అనుకుంటారు. మగవాళ్ళకు బయట ప్రపంచమే లోకం. కానీ ఆడవాళ్ళు అలా కాదు. బయట తమకంటూ ఓ గుర్తింపులేక ఇల్లే ప్రపంచంగా బతుకు తున్నారు. మహిళల ఆలోచనలు చిన్నప్పటి నుండి అలా తయారు చేయ బడ్డాయి. ఇందులో మార్పు రావాలి. అప్పుడు మహిళలు కూడా తాము అను కున్నది కచ్చితంగా సాధించగలుతారు.
- సలీమ

చట్టాలెన్నొచ్చినా మహిళకు రక్షణేదీ..?

MORE STORIES FROM THE SECTION

manavi

సామాజిక సేవ

సమస్యలు పెరిగితే గొడవలే...

14-03-2020

ఇంటర్‌లో వున్నప్పుడు రవిని ప్రేమించింది మాధురి. చదువు మధ్యలోనే ఆపేసి పెండ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టింది. ఇంటి గురించి మాధురి పెద్దగా పట్టించుకోదు. దాంతో అత్త ఆమెపై కోప్పడేది. 'మీ అమ్మ

manavi

సామాజిక సేవ

మేములేని ఓ రోజు

11-03-2020

మహిళలపై జరుగుతున్న హింసకు ప్రాంతం, దేశం అంటూ తేడా లేదు. ఎక్కడైనా ఆమె ద్వితియ శ్రేణి పౌరురాలే. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు వివక్ష తప్పడం లేదు. అందుకే హింసకు వ్యతిరేకంగా మెక్సికోలో

manavi

సామాజిక సేవ

అరుదైన అదితి

05-03-2020

కృషి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. దీన్నే ఆ యువతి మరోసారి రుజువు చేసింది. వెయ్యి మందిలో ఒకరికి వచ్చే ఓ అరుదైన వ్యాధితో పుట్టింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వడివడిగా అడుగులు వేసింది. ప్రస్తుతం ముంబయిలో సొంతంగా ఓ హౌటల్‌ని నడుపుతూ

manavi

సామాజిక సేవ

పేదలే లక్ష్యంగా....

03-03-2020

భార్యాభర్తలిద్దరివీ కార్పొరేట్‌ ఉద్యోగాలు. కోరినంత జీతం. విలాసవంతమైన జీవితం.. కానీ ఇవేవీ వారికి సంతృప్తినివ్వలేదు. ఇంకేదో చేయాలనుకున్నారు. అది కూడా గ్రామీణ మహిళలకు చేయూతనందించేలా. అలా ఏడాది కిందట శుభం క్రాఫ్ట్స్‌ని స్థాపించారు. దీని ద్వారా మహిళలు ఉపాధి కల్పించడమే

manavi

సామాజిక సేవ

ఆచరించి చూపారు..!

20-02-2020

పంతొమ్మిదేండ్ల వయసులోనే బలవంతపు వివాహం. అది కూడా తన కంటే 26 ఏండ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో. పైగా ఆయన్ని నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిన పరిస్థితి. అంతలోనే పెద్ద అలజడి. అతను మృతి చెందడం. అప్పటికి వివాహం జరిగి ఏడేండ్లు మాత్రమే.

manavi

సామాజిక సేవ

శ్రమను బట్టి విజయం

12-02-2020

పదునాగేండ్ల వయసులోనే రచనలు చేయడం ప్రారంభించిన ఆమె ఎనిమిది దశాబ్దాలుగా సాహిత్యరంగంలోనే కొనసాగుతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు ముందడుగు వేసినప్పుడే