''నేనంటే తిరుగుబాటు దారు, నా గొడవ మన తిరుగుబాటు'' అంటూ తెలం గాణ సమాజాన్ని మేల్కొలి పిన మహనీయుడు కాళోజీ! అణగారిన వ్యక్తుల ఆక్రంద నకు అక్షర రూపం. ప్రపంచం గొడవను తన గొడవగా మార్చుకున్న ఆ హదయంలో ఎన్నో ఆవేద నలు. నిలువుదోపిడీల నిత్య ప్రపంచంలో ధిక్కార స్వరం వినిపించిన విశ్వ మానవుడు, తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. కాళోజీ ఆత్మకథ 'ఇదీ నా గొడవ' ముందు మాటలో వరవరరావు గారు ఇలా అన్నారు. ''ఎవరైనా హనుమ కొండకు పోతే అక్కడ ముఖ్యంగా చూడవలసినవి రెండు. 1) వేయి స్తంభాల గుడి - అణగారిన శ్రమజీవులు సష్టించిన కళాఖండం 2) కాళోజీ - అణగారిన శ్రమజీవులు నిర్మిస్తున్న పోరాట చరిత్రతో పాటు నడుస్తున్న బతుకంతా దేశానిది అయిన మనిషి.'' తెలంగాణ గురించి తెలుసుకోవాలనుకుంటే కాళోజీ జీవితాన్ని తెలుసుకుంటే సరిపోతుందేమో!సుదీర్ఘ తెలంగాణ పోరాట చరిత్ర, కాళోజీ జీవితం రెండూ ఒక్కటిగానే తోస్తాయి.తెలంగాణ వైతాళికుడు కాళోజీ. కాళన్నగా సుపరిచితులైన కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు, పౌరహక్కుల ఉద్యమాల ప్రతిధ్వని... మానవతావాదమే తన మతంగా బతికిన ప్రజల మనిషి. ఉన్నది ఒక్క ఊపిరితిత్తే అయినా... ''అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు'' అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించినవాడు కాళోజీ. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా కలం ఎత్తి జైలుపాలైన ధీశాలి. 'నా గొడవ' పేరిట రాజకీయ, సామాజిక సమస్యలపై నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా పాలకులపై అక్షరాయుధాలను సంధించిన అసలు సిసలైన ప్రజాకవి. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహాల రూపమే కాళోజీ కవిత్వం. కాళోజీ 1914, సెప్టెంబరు 9న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. తల్లి రమా బాయమ్మది కర్ణాటక. తండ్రి కాళోజీ రంగారావుది మహారాష్ట్ర. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. హన్మకొండలో మెట్రిక్యులేషను పూర్తి చేశాడు. 1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమా బాయమ్మ చనిపోవడంతో అన్న కాళోజీ రామేశ్వరరావు తమ్ముడిని పెంచి పెద్ద చేశాడు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి. తమ్ముడి కన్నా ఆరు సంవత్సరాలు పెద్దవారు. 'షాద్' పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. న్యాయ శాస్త్రం చదివిన కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించక పోయినా పెద్ద కాళోజీనే ఇల్లు గడుపుతూ వచ్చారు. 1996 లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, 'నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప' అన్నాడు. 1940లో రుక్మిణీబాయితో కాళోజీ వివాహం జరిగింది. సత్యాగ్రహౌద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. మాడపాటి హనుమంత రావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలు అద్వితీయం. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర ఎంతో గొప్పది. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. ఆయన మొట్టమొదటి కవితా సంకలనం 'నా గొడవ' శీర్షికతో 1953లోనే వెలువడింది. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ కావాలని నినదించాడు. అసలుసిసలైన తెలంగాణ వాదిగా జీవించాడు.1977లో సత్తుపల్లి, ఖమ్మం జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై ప్రజా ఉద్యమాల తరపున పోటీ చేశాడు. పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో సాహిత్యంలో, రాజకీయాల్లో మార్గదర్శనం చేశాడు కాళోజీ. పీవీ నరసింహా రావు గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ కాళోజీని మనిషిగా, కవిగా, నాయకుడిగా వేరువేరు పార్శ్వాల్లో చూడలేము, ''కాళోజీ కాళోజీయే'' అన్నారు. ఓ సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కాళోజీ గురించి మాట్లాడుతూ, ''దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్లు?' అని ఏనాడో నిజాం కాలం నాటి ఫ్యూడల్ వ్యవస్థను దష్టిలో పెట్టుకుని కాళోజీ రాసిన మాటలు ఈనాటికీ ఎంత రెలెవంట్ గా ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు. ఇదే మాట ఆయనతో అన్నప్పుడు 60 ఏళ్ళ క్రింద నేను రాసిన రాతలు ఇంకా రెలవెంటేనని సంతోషించనా, లేక ఈనాటికీ ప్రజల తల రాతలు మారలేదని ఏడవనా! అని నిజంగానే ఏడ్చేవాడు ఆ సున్నిత హదయుడు కాళోజీ'' అని అన్నారు. ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె- అన్న కాళోజీ ఆకాంక్ష తెలంగాణ సాధన తర్వాత నెరవేరింది. ఇప్పుడు ప్రతి బడిలో పలుకుబడుల భాషే! ''తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు కాళోజీ. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ'' అన్నారు శ్రీశ్రీ. కాకతీయ విశ్వవిద్యాలయం. కాళోజీని గౌరవ డాక్టరేట్ తో, 1992 లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. 'హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు' అంటూ ''సామాన్యుడే నా దేవుడు'' అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13న తుదిశ్వాస విడిచారు. మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగ పడాలనే ఒక మహౌన్నతమైన విలువకు వారు ఉదాహరణగా నిలిచి, పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ భాషా దినోత్సవం'గా నిర్వహిస్తున్నది . కాకతీయ మెడికల్ కాలేజీకి అతని పేరు పెట్టి గౌరవించింది. ''పుటక నీది చావు నీది బతుకంతా దేశానిది!''అని జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజీ చెప్పిన కవిత ఇది. 82 సంవత్సరాలు వచ్చినా ఉండటానికి ఇల్లు కూడా సంపాదించుకోని నిరాడంబర జీవి, నిస్వార్థ జీవి కాళోజీకి తను చెప్పిన వాక్యం తనకు నూటికి నూరుపాళ్లు సరిపోతుంది !
ఎరుగుదువా నేస్తం/ఎన్ని మొద్దు బ్రతుకుల/ ముద్దు ముచ్చట్లు/ రంపపు కోతల పాలైతే/ మన ముద్దుముచ్చట్లు! అంటూ నిత్యం శ్రమజీవుల కన్నీటిని కవిత్వంగా అల్లినవాడు. ప్రతి వ్యక్తిని పౌరుడిగా గుర్తించాలని, గౌరవించాలనిబీ హౌదా వలన, స్థితి వలన కలిగిన ప్రతిపత్తులు రద్దుకావాలన్న ఆయన సిద్ధాంతమే హక్కుల ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దోపిడి వర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు, పీడిత వర్గాల నేను తిరగడమంటే తప్పా? అంటూ ప్రభుత్వాలనే ప్రశ్నించినవాడు కాళోజీ! పోచమ్మ కాడ నేనే, గణపతి దగ్గర నేనే, హిందూ మహాసభల నేనే, పౌర హక్కుల కోసం, పౌరునిగా బతకడం కోసం చేసే ప్రతి పోరాటంల నేనే అని స్పష్టంగా చెప్పిన కాళోజీ, అధికారంలో కూర్చుని అన్యాయాలు చేస్తున్న బద్మాష్ లు అందరూ లింగం మీద తేళ్ళ వంటివారని అన్నారు. భక్త ప్రహ్లాదుడు కథలో లాగా 'తిరుగుబాటు చేసినోడు, దౌర్జన్యాలను ఎదుర్కొనడానికి ప్రయత్నం చేసిన ప్రతి నరుడూ నరసింహుడే !'అన్నారు. అన్యాయాన్ని ఎదురిస్తున్న, ఎదురించిన ఆరాధ్యులు ఇప్పుడెక్కడున్నారు? అసలు అన్యాయం అంతరించిందా? 'నాగొడవ'కు సంతప్తి ఎప్పుడు? ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సి ఉంది. కొన్ని సందర్భాలలో 70 ఏళ్లు సాదిన అన్నతోనే ఏకీభవించనివాడు కాళోజీ! విలువల విషయంలో, వ్యక్తిత్వం విషయంలో, నిర్భయంగా స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్త పరిచే విషయంలో ఇప్పటితరం కాళోజీని స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. ధిక్కారం, అన్యాయంపై తిరుగుబాటు, సర్వ మానవ ప్రేమ ఇవే కాళోజీ మనకిచ్చిన గొప్పసంపద. కాళోజీ కలల తెలంగాణను సాకారం చేయడమే మనం ఆయనకిచ్చే గొప్ప నివాళి!