కరోనా విపత్తులో గహ కార్మికుల స్థితిగతులను చర్చించుకుంటున్న ఈ తరుణంలో మన దేశ స్థితిగతులను ఒక్కసారి అవలోకన చేసుకుందాం... మన దేశం శతాబ్దాల తరబడి పరాయి పాలనలో ఉంది. చాలా కాలం పాటు మన దేశంలోనే మనం రెండవ పౌరులుగా గుర్తించబడ్డాము. బానిసలుగా నెట్టివేయపడ్డాము. వాటి తాలూకు ప్రభావాలు మన దేశంలోని అన్ని రంగాలలో కనపడతాయి. మన భారతీయ సమాజం అసమానతలకు నిలయం అన్నది కాదనలేని సత్యం. ఆ సమానతలలో కూడా చాలా వ్యత్యాసం ఉండేది. చాలా విషయాలను ఇతర సమాజాలతోటి పోల్చ లేము. భూస్వామ్య వ్యవస్థ తాలూకు ప్రభావం ఇప్పటికీ అనేక విషయాలలో మనకు కనపడుతూ ఉంటుంది. ఒకప్పుడు పని మనిషులంటూ ప్రత్యేకంగా ఉండేవాళ్ళు కాదు. పనిలో ఒకరికొకరు సహకరించుకునే సహకార ధోరణి చాలా ఎక్కువగా ఉండేది. గ్రామీణ వాతావరణంలో చేతి వత్తులు ఉండేవి... మానవ సంబంధాలు చాలా బలంగా దగ్గరగా ఉండేవి... కుల వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ అక్కా... చెల్లె... వదినమ్మ... పెద్దమ్మ... పెదనాయన.. అన్నా... చిననాయన... ఇలా వరసలు పెట్టి పిలుచుకునే వాళ్ళు.. ఇక ఇల్లు గడవక తప్పని సరైన స్థితిలోఉన్నవాళ్ళు పరిచయం ఉండి ఆర్ధికంగా బాగా ఉన్నవాళ్ళ ఇళ్ళల్లో వడ్లు దంచటం... కారం... పసుపు కొట్టటం లాంటి పనులు చేస్తూ ఆ పూటకు వాళ్ళు ఇచ్చే బియ్యమో, వడ్లో, పప్పో తీసుకొని వెళ్తుండేవాళ్ళు. ఇంటి మనుషులుగా ఉండేవారే కానీ ఇంటి పనిమనుషులుగా ఉండేవారు కాదు. మన తెలుగు రాష్ట్రాలలో జమీందార్లు, జాగీర్దార్లు, పటేళ్లు, పట్వారీలు, బాగా ఆర్ధికంగా స్థిరపడిన వాళ్ళ ఇళ్ళల్లో అన్ని పనులను పని వాళ్ళ తోనే చేయించేవారు. ఐతే 1990ల తర్వాత అంటే గ్లోబలైజెషన్, ప్రపంచీకరణ తరువాత మార్కెట్ సంస్కతి అంటే వ్యాపార సంస్కతి బాగా విస్తరించింది. ప్రపంచీకరణ ప్రభావం వలన చేతివత్తులు దెబ్బ తిని గ్రామాల నుండీ నగరాలకు, పట్టణాలకు బతుకు తెరువు కోసం వలస వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.. కుటుంబ ఆర్ధిక అవసరాల రీత్యా ఆడవాళ్ళు కూడా ఏదో ఒక ఉద్యోగమో? చిట్టి పొట్టి వ్యాపారాలో చేయవలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. మన సమాజం పురుషాధిక్య సమాజం. అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు శుభ్రం చేయటం లాంటి పనులన్నింటినీ ఆడవాళ్ళు చేసే పనులగానే గుర్తిస్తారు. ప్రస్తుతం మొగవారి ఆలోచనలలో కొంత మార్పు వచ్చినప్పటికీ పురుషాధిక్య భావజాలం తాలూకు ప్రభావం అలాగే ఉంది. మహిళలు ఉద్యోగం చేసినా ఇంటి పని తప్పని సరి. క్రమంగా ఇంటి పనులకు నెల జీతానికి పనిమనుషులు పెట్టుకోవటం మొదలు పెట్టారు. గ్రామాల నుండి బతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చి బస్తీలలో నివసించే పేద, నిరుపేద మహిళలు ఎక్కువ శాతం పని మనుషులుగా ఇళ్ళల్లో కుదురుతున్నారు. వీరిని పని మనుషులు అని కాకుండా గహ కార్మికులుగా గుర్తించాలని అనేక మంది సామాజిక వేత్తలు చెప్తున్నారు. ఐతే నూటికి తొంభై శాతం మహిళలే గహ కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. వీరిలో నిరక్షరాస్యులే ఎక్కువ. కూలీ పనులు చేయలేని వాళ్ళు తమ బస్తీలకు దగ్గరగా ఉన్న తెలిసిన ప్రాంతాలలోని అపార్టుమెంట్ల లోనూ, ఇళ్లలోనూ పనిచేస్తూ ఉంటారు. నగరంలో అనేక చోట్ల ఏజన్సీలు ఉన్నప్పటికీ పని ఇప్పించమని వాళ్ళ దగ్గరకు వెళ్ళే వాళ్ళు తక్కువ. రాజ్యాంగ పరంగా చుస్తే మూడు రకాల చట్టాలు వీళ్ళకు వర్తిస్తాయి.. 1.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్ర విభజనకు ముందు 2011లో వచ్చిన కనీస వేతనాల చట్టం... ఈ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి అంటే ఏప్రిల్, సెప్టెంబర్ మాసాలలో లేబర్ డిపార్టుమెంటు వీళ్ళ వేతనాలను రివైజ్ చేస్తూ ఉండాలి. కానీ అది ఆచరణలో ఇప్పటిదాకా జరగలేదు. 2.పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుండి రక్షణ.. ఇది ఏమాత్రం సాధ్యపడలేదు. కారణం ఏమిటంటే సాధారణంగా ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో అయితే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలలో సీనియర్ స్టాఫ్, యన్.జి.ఓ ప్రతినిధి, ఇతర సామాజికవేత్తలు ఉంటారు. విషయాన్ని పరిశీలించాక విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు రిపోర్ట్ చేస్తారు. లేనిపక్షంలో కలెక్టర్ ఆఫీస్‌లో లోకల్ కంప్లైంట్ కమిటీ (యల్.సి.సి) ఉంటుంది. అక్కడకు వెళ్ళి కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. ఇంటి వాతావరణానికి ఆఫీస్ వాతావరణానికి ఏ మాత్రం పొంతన ఉండదు. ఇళ్ళల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లంటూ ఏమీ ఉండవు. కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళి లోకల్ కంప్లైంట్ కమిటీకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. నిరక్షరాస్యత అధికంగా ఉన్న గహకార్మికులలో రిపోర్ట్ చేసేటంతటి అవగాహన వీరికి ఉండదు. లైంగిక వేధింపులు ఉన్న ఇళ్ళను ఎక్కువ శాతం వదిలేస్తారు. మరీ ఇబ్బందిగా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడతారు. పోలీసుస్టేషన్ దాకా వెళ్ళే కేసులు చాలా తక్కువ. 3. 2008లో వచ్చిన ఆన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అసంఘటిత కార్మికులకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్‌లు ఉన్నాయి. ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ రంగానికి సంబంధించిన ఖాళీ బోర్డులను తగిలించుకోవటానికి తప్ప మరే ఉపయోగము జరగలేదు... అలా బోర్డును తగిలించుకోవాలనుకున్నా గహ కార్మికులకు ఇది వర్తించదు. ఇలా ఈ మూడు చట్టాలు గహ కార్మికుల విషయంలో నిరుపయోగంగా మిగిలిపోయాయి. గహకార్మికుల సమస్య ఇప్పటిది కాదు. దాదాపుగా 30 సంవత్సరాల నుండీ ఈ సమస్య తెరమీదకు వస్తూనే ఉన్నది. ఐతే 15 సంవత్సరాల క్రితం గహ కార్మికుల మీద పనిచేసే కొన్ని స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు, సామాజిక కార్యకర్తలు, అక్టీవిస్టులు గహ కార్మికులకు ఖచ్చితమైన పని గంటలు, జీతం ఉండాలని జాతీయస్థాయిలో నేషనల్ ప్లాటుఫామ్ ఫర్ డొమెస్టిక్ రైట్స్ అనే ఒక ఫోరమ్‌ను ఏర్పాటు చేశారు. గహ కార్మికుల కోసం ఒక చట్టాన్ని తేవాలన్నది వీళ్ళ ప్రధాన డిమాండ్. ప్రభుత్వాలు ఒక పాలసీగా అంటే ఒక విధానంగా చేస్తానంటున్నాయి. ఒక బిల్లు కానీ పాలసీ కానీ చట్టం రూపంలోకి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఏ రూపాన్ని ఇది తీసుకోబోతోంది అనేది వేచి చూడాల్సిందే. 2020 లాక్‌డౌన్ సమయంలో మే 9వ తారీఖున తెలంగాణా ప్రభత్వం గహ కార్మికులు పనికి వెళ్ళాలా? వద్దా? అన్న విషయం మీద ఒక సర్క్యులర్‌ను తయారు చేసి రెసిడెన్స్ వెల్ఫేర్ వారికి ఒప్పజెప్పింది. జి.హెచ్.యం.సి అడిషనల్ కమీషనర్ దగ్గర ఎన్.ఓ.సి నాన్ అబ్‌జెక్షన్ సర్టిఫికెట్ నిరభ్యంతర పత్రాన్ని తీసుకొని పనిలోకి వెళ్ళాలి. చాలా మందికి ఈ సెర్క్యూలర్ పట్ల అవగాహన లేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో గహకార్మికులు ఎంతమంది ఉంటారన్న విషయం మీద ఎటువంటి స్పష్టతా లేదు. సరైన అంచనాలు లేవు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఊర్లకు వెళ్లిపోయారు. అక్కడా పనులు లేక నానా అవస్థా పడుతున్నారు. పాలసీలే తెస్తారో? లేక చట్టాలే తెస్తారో? కానీ గహకార్మికుల సమస్యలను సత్వరం పరిష్క రించవలసిన అవుసరం ఎంతైనా ఉన్నది. - నిజామాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మి కుటుంబం 30 సంవత్సరాల క్రితం బతకటానికి హైదరాబాద్‌కు వచ్చింది. భర్త మేస్త్రీ పని చేస్తూ ఉంటే ఆమె ఇళ్ళల్లో పని చేయటానికి పని మనిషిగా కుదురుకుంది. గతాన్నీ ఇప్పటి స్థితులను బేరీజు వేస్తూ ఆమె ఇలా చెప్తోంది ''ఊర్లో మొదట్లో బీడీలు చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇంట్లో బట్టలు, గిన్నెలు అన్నీ పనులు చేస్తే 90 రూపాయలు ఇచ్చేవాళ్ళు.. ఒట్టి గిన్నెలు చేస్తే 60 రూపాయలు ఇచ్చే వాళ్ళు. సొంత మనుషులలాగా చూసుకునే వాళ్ళు.. వంటలకాడ కూడా ఉండేటోల్లం. ఇంట్లో వంట వండక పోయేవాళ్ళం. రోజు తినటానికి వాళ్ళే ఇచ్చేవాళ్ళు.. పండుగ వస్తే ఇంట్లో మేమేమీ ఒండుకోక పోయేటిది.. ఆళ్ళే వండుకున్నవన్నీ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు. కానీ.. ఎన్ని డబ్బులు ఇచ్చినా సరిపోవటం లేదు. కరోనాకు ముందు నెలకు 10,000 రూపాయలు వస్తుండేవి.. ఇప్పుడు 4,000 వస్తున్నాయి. కరోనా భయపడుతుండ్రు... పనికి పిలవట్లేదు... బయటి పనులకు ఎల్లేటట్టు లేదు.. చాలా కష్ట కాలం. ఇంటి అద్దెకు కూడా సరిపోవటం లేదు. గవర్నమెంట్ బియ్యం ఇస్తున్నారు వండుకునేందుకు కావాలి.. ఇంటి అద్దెలు 3 నెలలు కట్టలే. ఒక్కసారే కట్టాలి.. పనీ లేదు... డబ్బు లేదు... ఇంట్లో అన్నీ అమ్ముకుని బతుకుతున్నాం..'' - హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన భాగ్య ఇలా చెప్తోంది ''నా పేరు భాగ్య. నేను ఇళ్ళల్లో పని చేస్తాను. 5,6 ఇళ్ళల్లో పని చేస్తే అయిదారు వేలు వచ్చేటిది నాకు. ఇప్పుడు ఏమీ పని లేదు. ఒక ఇళ్ళు ఉండేవాళ్ళు కూడా వద్దన్నారు. జీతం కట్టీయమంటే కట్టిస్త లేరు. పనే చేయలేదు ఎందుకు జీతం కట్టిస్తాం అంటున్నారు. మాకు బతకటానికి చాలా ఇబ్బందిగా ఉన్నది... మాకు ఏదన్నా సాయం చెయ్యాలి గవర్నమెంట్.. మాకింత లోను ఇప్పించినా పని చేసుకుంటాం.. నాలుగు నెలల నుంచి పని లేదు కష్టంగా ఉంది.'' - ఉప్పల్‌కు చెందిన శోభ ఇలా అంటోంది ''నా పేరు శోభా.. నేను నాలుగు ఇళ్ళల్లో పనిచేసేదాన్ని.. ఒక్కొక్క ఇంట్లో పన్నెడువందలు ఇచ్చేవాళ్ళు. లాక్‌డౌన్ అయినాక పనికి రానిస్తలేరు.. డబ్బులు ఇయ్యనన్నారు.. పని దొరుకుత లేదు. మమ్మల్ని దయదలిచి మాకేదైనా సాయం చేయండి.''