ప్రాధేయపడే గొంతుల పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాలు ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతులను నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారుల భవితపై ద్రోహపు చట్టాల ఖడ్గాలు దింపుతున్నపుడు, పాదాలు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలాల తల్లి కడుపుకోతను భరించలేని నేలనేలంతా కాంక్రీటు వీధులపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీవలుల పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజల సంఘీభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారులకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికుల సమస్య. మెతుకులపై బడాబాబుల పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాలను, మేలు చేస్తాయని అబద్ధాల ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాలను వెల్లడించే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడిదారులకు, వారి ప్రచారకులకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యలపై నిజాయితీగా సామాన్య రైతులు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలనేవి ప్రజల భావాలను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వాలనే ప్రజలు మార్చుకుంటారు.
14 రోజులుగా లక్షలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడించి కేంద్ర ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాలను మరియు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్ 3వ తేదీన 3 ఆర్డినెన్స్‌లను కేంద్ర క్యాబినేట్ ఆమోదించింది. 1 నిత్యావసర వస్తువుల నియంత్ర సవరణ చట్టం, 2. ఫార్మర్స్ ప్రొడ్యూసెస్ & కామర్స్ (ప్రమోషన్ & ప్రొటక్షన్) ఆగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఆస్యూరెన్స్ & ఫార్మ్ సర్వీస్ యాక్ట్, 3. ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ & కామర్స్ (ప్రమోషన్ & ఫెసిలిటేషన్ యాక్ట్) 2020. జూన్ 5వ తేదీన ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈ చట్టాల వలన రైతులు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీలు కార్పొరేట్ సంస్థలు కలిసి రైతుల అస్తులను కాజేస్తాయి. అభ్యంతరాలు వుంటే రైతులు సివిల్ కోర్టులకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాలు ఈ చట్టాలకు రూల్ తయారు చేయాలి. కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో ఎగుమతి ఆధారిత పంటలను పండిస్తారు. ఆహార ధాన్యాలు దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. చిన్న కమతాలను భారీ కమతాలుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములలో సన్న, చిన్న కారు రైతులు కూలీకి కూడ పనికి రారు. దేశంలో 14.57 కోట్ల మంది రైతు కుటుంబాలలో 85శాతం గా ఉన్న సన్న, చిన్నకారు రైతులు భూమి కోల్పోయి అస్తులులేని వారవు తారు. నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదాయాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20 శాతం సాగు భూమి కార్పొరేట్ సంస్థల చేతులలోకి వెళ్ళింది. ఈ ప్రమాదకర చట్టాలు 50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో 1.2శాతం ప్రజలు, ఇంగ్లాండ్‌లో 0.3శాతం ప్రజలు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ భారత దేశంలో 48శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. యాంత్రీకరణ వలన, భారీ కమతాల వలన భారత దేశంలో కూడా వ్యవసాయంపై ఆధారపడిన వారి సంఖ్య సగానికి సగం తగ్గుతుంది.
జూన్ 10వ తేదీ నుండి ఆర్డినెన్స్ కాపీల దగ్దంతోపాటు రాస్తారోకోలు, ధర్నాలు ప్రతి రాష్ట్రంలో జరిగాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతులు ఉత్తరాలు వ్రాశారు. డిసెంబర్ 1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో వెంటనే నిరసన కార్యక్రమాలు జరిగాయి. తిరిగి 5వ తేదీన మరియు డిసెంబర్ 8న, 9న జరిగిన చర్చలు కూడా విఫలమైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చల కొరకు పంపిన ఎజెండాలో 1. వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీని పునరుద్దరించడం, 2. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులకు లైసెన్స్‌లు ఇచ్చే బాధ్యత, 3. అభ్యంతరాలపై రైతులు సివిల్ కోర్టుకు వెళ్ళడం. 4. కాంట్రాక్టు పార్మింగ్ ఒప్పందం జరిగిన 30 రోజుల లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్ చేయడం, 5. కాంట్రాక్టు భూములపై జరిగిన నిర్మాణాలను రైతులకు అప్పగించడం, 6. కాంట్రాక్టు ఫార్మింగ్ భూములపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం, 7. కనీస మద్దతు ధర మరియు సేకరణ అమలు జరపడం, 8. ప్రస్తుతం విద్యుత్ చెల్లింపుల విధానంలో రైతులకు ఎలాంటి మార్పులు చేయకపోవడం, 9. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో గాలి కాలుష్యంపై రైతుల కోరిక మేరకు పాటించడంపై 9 సమస్యలను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అమలు చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధులు అనుమానించాల్సి వచ్చింది. చట్టాలను అమలు చేయని ప్రభుత్వాలు ఉత్త హామీలతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతులు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయించుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా తాము పోరాటం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది.
డిసెంబర్ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరపాలని ఈ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలలో అన్ని సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. ఈ ఉద్యమానికి దేశంలోని 25 ప్రధాన పార్టీలు మరియు దాదాపు 500 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళ, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, సామాజిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమంతో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బలపర్చిన శిరోమణి ఆకాలిదల్ మరియు శివసేన, హర్యానలోచి చౌతాల పార్టీ, పార్లమెంట్‌లో చట్టాలను బలపర్చిన వైసిపి, తెలుగు దేశం పార్టీ రైతులు కూడా ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. మేధావులు, కవులు సమావేశాలు జరిపి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సంఘీభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరాటాలకు కూడా మద్దతు తెలుపుతున్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాతోపాటు ఐక్య రాజ్య సమితి ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ తీర్మానాలు పంపిం చింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాలను ఉప సంహరించుకోటానికి, విద్యుత్ బిల్లును ప్రవేశ పెట్టకుండా నిలుపు దల చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాలు అంబాని, ఆదాని ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిలుపు అమలులోకి వచ్చింది. కార్పొరేట్ సంస్థలకు లాభాలు కట్టబెట్టడానికి తెచ్చిన ఈ చట్టాలకు ప్రతిచోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల ఏటా దేశంలో 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంటలభీమా, వడ్డీమాఫీ, కిసాన్ సమ్మాన్, కృషి సించాయి యోజన పథకాలతోబాటు మార్కెట్ జోక్యం పథకం విఫలమైంది. మార్కెట్ జోక్యం పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు కల్పించటానికి 2020-21 సంవత్సరానికి రూ.2,000 కోట్లు కెటాయించడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే దిశగా విధానాలు కొనసాగిస్తున్నారు.
ఫెడరల్ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ''ఫెడరల్ రాజ్యాంగంగా'' రూపొందిం చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ, దేశ రక్షణ ఎగుమతి, దిగుమతులు, విదేశాంగ విధానంకే పరిమితం కావాలి. అడవులు, వ్యవసాయం, విద్య తదితర కొన్ని అంశాలను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాలు రూపొందించి అమలు చేయాలి. ఇప్పటికే ఫెడరల్ రాజ్యాంగానికి విరుద్దంగా పన్నుల విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాలను ఆదాయాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్ ఉన్నటువంటి అంశాలను తొలగించే ప్రయత్నం చేసింది. విద్యారంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బిల్లు సిద్దంగా ఉంది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రాల హక్కులను తొలగించడానికి 3 వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఒకే భాషా, ఒకే మతం, ఒకే సంస్కృతి పేరుతో ఫెడరల్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడింది. గత 6 సంవత్సరాల వ్యవసాయ విధానం వల్ల స్వయం పోషకత్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తుల రంగం నేడు దిగుమతులపై ఆధారపడింది. 1.40 కోట్ల టన్నుల వంటనూనెలు, 50 లక్షల టన్నుల పప్పులు, 40 లక్షల టన్నులు పంచధార, 35 లక్షల బేళ్ళ పత్తి, ముతక ధాన్యాల ఉత్పత్తులు జీడి పప్పు తదితర వ్యవసాయోత్పత్తులను రూ.3 లక్షలకోట్ల విలువగలవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాలకు బదులు ఎగుమతి ఆధారిత పంటలు పండించటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూనుకుంది. ధనిక దేశాలు భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతులపై భారత దేశాన్ని ''మార్కెట్‌గా'' చేయబూను కున్నారు. తమ పథకంలో 30% విజయం సాధించడం జరిగింది. దిగుమతులు ఏటా 35 లక్షల కోట్లు కాగా ఎగమతులు 25 లక్షల కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పుల భారం పెరగడానికి ఈ దిగుమతులు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తులు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతులు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 లక్షల టన్నుల పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 లక్షల టన్నులకు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంటల ఉత్పత్తి జరిగింది. అన్ని దేశాలలో గిట్టుబాటు ధరలు ప్రకటించి రైతుల ప్రయోజనాన్ని కాపాడుతున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధరలను ప్రకటించి వాటిని కూడా అమలు జరపడంలేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరలు రైతులకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్ప డింది. ఇలాంటి విపత్కర పరిస్థితు లలో 3చట్టాలను తేవడంతో ప్రభుత్వ ''కార్పొ రేటీకరణ నగత్వం'' బట్ట బయలు అయ్యింది. టాటా, బిర్లా, అంబాని, అదాని, ఐటిసి, బేయర్ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన విధానాలకు చట్టాలను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తునప్పటికీ ప్రజల బాగు కొరకే చట్టాలను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాలతో సంప్రదించి చేయవచ్చుగదా? బిల్లులు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బలపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాలను చేస్తున్నది. దీనివల్ల ప్రజల యొక్క కోర్కెలను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3 చట్టాలను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రతిపక్షా లతో, రైతు సంఘాలతో మరియు మేధావులతో చర్చలు జరిపి వారి అభిప్రాయం మేరకు విధానాలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాలు రూపొం దించాలి. కనీస మద్దతు ధరలు కాకుండా గిట్టుబాటు ధరలు కల్పించాలి. ఆహార ధాన్యాలను పేదలకు సబ్సిడీపై అందించాలి తప్ప, రైతుల ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంటల ప్రీమియంను చెల్లించాలి. దేశ ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను పండించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాలను అప్‌డేట్ చేయాలి. పై కార్యక్రమా లను అమలు జరపటానికి తగు విధానాలు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమాలను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.
- టి. సాగర్, 9490098055
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
Sun 13 Dec 01:08:27.205323 2020