తెలంగాణలో సాంస్కృతిక పునర్జీవం కోసం, తెలుగు భాషా వికాసం కోసం నిరంతరం కృషి చేస్తున్న సంస్థ సాహితీ మేఖల.ఈ సంస్థ వ్యవస్థాపకులైన కవిరత్న అంబటిపూడి వెంకట రత్నం శాస్త్రి బహుముఖ ప్రజ్ఞశాలి. బహుగ్రంథ నిర్మాత. వీరు 1955లో రచించి ప్రచురించిన పుస్తకమే ఓటర్లకొకమాట.
ఓటు విలువ, ఓటరు కర్తవ్యం, భారతీయ ధర్మం, అప్పటి సాంఘిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యల పట్ల అవగాహన మొదలైన అనేక విషయాలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. కవి సామాజిక, రాజ కీయ దృక్పథానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది.
నేటి ప్రజాస్వామ్యంలో ఓటరే రాజు, గెలిచిన వాడు రారాజు.'ఓటు' పోరాటంలో బలియైపోయేది చివరికి సామాన్యుడే.ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. గెలిచిన వారు ఓడిపోవడం,ఓడిన వారు గెలవడం ఎన్నికల చిత్ర విచిత్రం. ఎంతో మంది రాజకీయ నాయకులు ఓడి బికారీలు కావడం. బికారీలు గెలిచి రాజకీయ ప్రముఖులుగా చెలామణి కావడం మనకు ఎన్నికలు నేర్పిన గుణపాఠాలుగా ఈ అనుభవాన్ని రంగరించి ఎన్నికల సమయంలో అభ్యర్థులు చేసే వాగ్దానాలు, ఈ వాగ్దానాల వలలో చిక్కి ముందూ, వెనక్కు పోలేని అమాయకుల జీవన చిత్ర విన్యాసమే ఈ ' ఓటర్లకొకమాట' అనే పద్యసంపుటి. ఎన్నికల ముందు ఎన్ని బహురూప వేషధారులై ప్రజల ముందుకువస్తున్నారో ఈ క్రింది పద్యంలో చూడండి.
ఆగురా యెన్ని విధాల వేషములు వేయన్ బూనిరీ పెద్ద లింపుగ సింగారము జేసికొంచు నొక సొంపుల్ గుల్కుసంచీ గ్రహించగనే నాయకుడౌను మెంబరుగ జేర్చన్ వచ్చునే పక్షమో తగునా లేదని లేదు స్థానమిడ నాతండౌను ముఖ్యుండటన్
(53వ పద్యం)
ఎన్నికలలో ఏదో విధంగా మాయమాటలు చెప్పి, ఇస్త్రీలు చేసి, బజ్జీలు చేసి, సైకిళ్లకు గాలికొట్టి, కూరగాయలమ్మినట్లు నటించి ఓట్లు కొల్లగొట్టి గెలిచి ఏదో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానో, యంపి గానో గెలిచి, మంత్రిగా చెలామణి కావడం నేడు చూస్తున్నాం. 60ఏండ్ల క్రిందనే ఈ దురవస్థకు బీజం పడిందంటే మనకే ఆశ్చర్యంకల్గుతోంది.
పార్టీలు మారడం, తలలు మార్చడం, శానసభల్లో నిత్యం మనం చూస్తున్నాం.'' మేం గెలిస్తే ఇదిగో మీ అభ్యుదయం, క్షేమం బంగారు పళ్లెంలో తెచ్చియిస్తాం. ఇదే మా ప్రణాళిక. మీ కూడు, గూడు, చూసే బాధ్యత మాది ' అంటూ నమ్మించి మాయమౌతారు. అప్పటికీ, ఇప్పటికీ ఈ వ్యవస్థ ఇంకా మారలేదని ఓటర్లకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, ప్రజలు అన్యాయాల్ని ఎదిరించి ప్రశ్నించే రోజు రావాలని, నమ్ముకున్న ఓటును అమ్ముకోవద్దని, ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని రచయిత కోరుకుంటాడు. ప్రతి ఒక్కరూ చదవదగిన మంచి పుస్తకం.
పున్న అంజయ్య
కవి, రచయిత
9396610639
Authorization