హాయ్ ఫ్రెండ్స్! కోట్ల సంవత్సరాల పూర్వం జీవించిన విచిత్ర జీవి గురించిన విశేషాలు ఇవి. ఇది బుల్లి సింహాన్ని పోలిన కంగారు లక్షణాలు కలిగినజీవి. మరి దీని గురించి తెలుసుకుందామా...
కోట్లాది ఏండ్ల క్రితం ఇప్పుడు భూమి మీద నివసించని అనేక జీవులు జీవించి ఉండేవి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అవి బతకలేక చనిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్ వంటి అతి పెద్ద జీవులు ఇట్లా నశించిపోయిన జీవ జాతుల్లో ఒకటి. అయితే పూర్వం ఉన్న జీవుల గురించి ఇప్పుడు మనకెట్లా తెలుస్తుందబ్బా అనే సందేహం మీకు రావచ్చు. కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న జీవులు ప్రకృతి విపత్తులు, ఇతర కారణాల వల్ల చనిపోయి నిలవ ఉండటానికి అనుకూలమైన నేలలో పూడుకుపోయి గట్టిపడి శిలలా మారిపోతాయి. ఇట్లా మారిపోయిన చెట్లు, జంతు అవశేషాలనే శిలాజములు (ఫాసిల్స్) అంటారు. దోమ అంత చిన్న కీటకం నుంచి డైనోసార్ వంటి పెద్ద జంతువు వరకు ఇట్లా శిలాజాలుగా మారిపోయాయి. అనుకోకుండా ఈ శిలాజాలు కనిపించినప్పుడు శాస్త్రవేత్తలు వాటిపై పరిశోధన చేసి అవి ఎటువంటి వాతావరణంలో పుట్టాయి, వాటి ఆకారాలు, ఆహార విహారాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తల కంటపడ్డ ఓ బుల్లి జంతువు దవడ పండ్ల శిలాజం గురించి శాస్త్రవేత్తలు ఎన్ని విశేషాలు చెప్పారో చూడండి.శాస్త్రవేత్తలు ఈ శిలాజం పేరు డేవిడ్ అటెన్బొరోగ్ అని పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన శిలాజ నిక్షేపాల్లో ఇది ఒకటని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సింహం పరిణామం చెందకముందు జీవించిన జంతువనీ దీన్ని చెబుతున్నారు. అందుకే..సింహ జాతుల్లో అతి చిన్నదిగా మైక్రోలియో అనీ అంటున్నారు. అంటే..చిన్న సింహం అని అర్థం.
అప్పట్లో దీని పేరేంటో ఎవరికి తెలుస్తుంది చెప్పండి. అసలే..1కోటి, 80 లక్షల ఏండ్ల కింద బతికిన జంతువట. శిలాజం దొరికాకే దానికి నామకరణం జరిగిందాయె! అదీనూ..ఆషామాషి పేరు కాదు. ప్రముఖ బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త, పేరు పొందిన టీవీ వ్యాఖ్యాత డేవిడ్ అటెన్బొరోగ్ గౌరవార్థం దీనికా పేరు పెట్టారు.
దీని శిలాజం ఆస్ట్రేలియాలోని సౌత్‌వేల్స్‌లో దొరికిందట. అక్కడ 'రివర్స్లైగ్ హెరిటేజ్ అని ఒక ప్రదేశం ఉంది. అదో వర్షారణ్యపు అటవీ ప్రాంతం. అక్కడ శిలాజ శాస్త్రజ్ఞులకు ఈ సింహం ఆనవాళ్ళు దొరికాయి. దాని మీద పరీక్షలు జరిపే కొద్దీ ఆసక్తిగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఇంత వరకూ ఎన్ని జాతుల సింహాల జాడలు వెలుగులోకి వచ్చినా.. కేవలం 6వందల గ్రాములు మాత్రమే బరువుండే బుల్లి సింహం ఇదేనట. దీనికెన్ని జంతువుల పోలికలు ఉంటాయో తెలుసా? ఆకారంలో పిల్లిలా, ఓ రకంగా చిన్న సింహంలా కనిపించేది. ప్రవర్తన చూస్తే మాత్రం చెట్ల మీదే బతికే 'కోలా'లా అనిపించేది. మొహం చూస్తే ఉడుత గుర్తొచ్చేది. పిల్లల్ని పెంచడంలో కంగారూని తలపించేది. ఎందుకంటే.. దీనికి పొట్ట భాగంలో తిత్తిలాంటి సంచి ఉంటుంది. పిల్లల్ని అందులోనే పెట్టి పెంచుకునేదని అనుకుంటున్నారు. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండుంటుందని అంటున్నారు. కానీ నోరు తెరిస్తే మాత్రం కోర పళ్ళతో భయం గొల్పేదేమో అనీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి మాంసాహార జంతువులు. చెట్టు దిగకుండానే ఆహారాన్ని సంపాదించే నైపుణ్యం వీటికుంది. కిందకి దిగితే మాత్రం జట్లు జట్లుగా తిరుగాడతాయి. చెట్టు మీద ఎంత చివరి కొమ్మపైకైనా సునాయాసంగా ఎక్కేస్తాయి. చెట్టుమీద వాలే పక్షులు, బల్లులు, కప్పలు, కీటకాలు, పురుగుల్ని కోరపళ్ళతో చీల్చి ఆరగించేవి. ఇంకో విషయం.. వేడి వాతావరణంలో ఇష్టంగా బతికే ఈ మైక్రోలియోలు పిల్లలకు పాలిచ్చి పెంచే బుల్లి క్షీరదాలు. ఈ జంతువు ఊహా చిత్రాలను దగ్గరుండి గీయించారు శాస్త్రవేత్తలు.
Authorization