సాలెగూడులో చిక్కుకున్న చిన్న చిన్న క్రిములను సాలీడు తినటం మీరు చూచే ఉంటారు. అయితే సాలీడు పక్షిని తినటమన్నది ఆశ్చర్యకరమైన విషయం. కాని కొన్ని ఉష్ణప్రాంతాలలో పక్షులను తినగలిగే సాలీళ్ళు కూడా ఉన్నాయి. ఇవి ఆకారంలో చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని 'పక్షిని తినే సాలీడు' అంటారు. ఈ సాలీడు పొడవు 9 సెం.మీ వరకు ఉంటుంది. 25 సెం.మీ వరకు కాళ్ళను చాచగలవు. పక్షులనే కాకుండా ఇవి చిన్న చిన్న జంతువులను కూడా తింటాయి. ఇవి మనుషులకు హానిని కలిగించలేవు. కాని ఇవి కుట్టితే భరించలేనంత నొప్పి కలుగుతుంది. ఇంతవరకు 30,000 రకాల సాలీళ్ళను గురించి అధ్యయనం చేసారు ఇంకా 20.000 రకాలను పరీక్షించవలసి ఉంది. వీటిలో కొన్ని తెగలు మానవులకు కూడా హానిని కలిగించగలవు. బ్రౌన్ రేక్లూజ్, బ్లాక్విడో, బ్రౌన్విడో, టారంట్యులా వంటివి ఇటువంటి వాటిలో ముఖ్యమైనవి. యూరపులో లభించే వుల్ఫ్ స్పైడర్ కాటుకు మనిషి కూడా చనిపోతాడు. పక్షిని తినే సాలీడు చెట్టు కొమ్మల మధ్య లేక తొర్రలలో గూడు అల్లుతుంది. కొన్ని భూమిలో రెండు అడుగుల లోతు గొయ్యి తవ్వి పైన గూడు అల్లుతాయి. గూటి తీగలు చాలా దృఢంగా ఉంటాయి. పక్షులు మొదలైనవి ఈ గూటిలో చిక్కుక్కున్నప్పుడు తప్పించుకుపారిపోలేవు. పక్షి, గూటిలో చిక్కుకోగానే సాలీడు దానిపై ఒక రకమైన విషద్రవాన్ని చిమ్ముతుంది. ఈ విషప్రభావం వలన పక్షి చనిపోతుంది. తర్వాత సాలీడు నెమ్మదిగా పక్షిని అరగిస్తుంది.
Authorization