కాంతి తరంగాల రూపంలో పయనిస్తుందన్నది శాస్త్రీయ సత్యం. నీటి ఉపరితలం మీద రాయిని విసిరినప్పుడు కలిగే అలల మాదిరి కాంతి ప్రయాణం చేస్తుంది. వీటిని అడ్డంగా వ్యవహరించు లేక ట్రాన్స్వర్స్ తరంగాలు అంటారు. కాంతి కూడా ట్రాన్స్వర్స్ తరంగాల లోనే పయనిస్తుంది. సూర్యుని నుండి వెలువడే కాంతి అన్ని దిక్కులకు ప్రసరిస్తుంది. ఈ కాంతిని ఒక వైపుకే ప్రసరింప చేయటాన్నే పొలరైజేషన్ అంటారు.
కాంతిని పొలరైజ్ చేయడానికి అది ట్రాన్స్వర్స్ అయి ఉండాలి. సాధారణంగా కాంతి సమతల ప్రదేశంలో అనేక దిశలకు ప్రసరిస్తుంది. దీనిని ఏదో ఒక సాధనం ద్వారా ఒకే మార్గంలోకి ప్రసరింపజేయగలిగితే దానిని లీనియర్ లేక ప్లేన్ పొలరైజ్డ్ కాంతి అంటారు.
ప్లేన్ పొలరైజ్డ్ కాంతిని అనేక రకాలుగా ఉత్పత్తి చేయవచ్చు. కాంతి కిరణం అద్దం మీద పడినప్పుడు అందులో కొంత భాగం ప్రతిబింబిస్తుంది. మరి కొంత అద్దంలోకి పోతుంది. అద్దంలోకి వెళ్ళిన ఈ కాంతి ఒక ప్రత్యేక కోణంలో వంగుతుంది. దీనిని కాంతి వక్రీభవనం అంటారు. అద్దంలోనికి వెళ్ళిన కాంతి కిరణాన్ని వక్రీభవన కిరణం అంటారు. ప్రతిబింబ కిరణం, వక్రీభవన కిరణం రెండు ఒక దాని కొకటి లంబ కోణంలో వుండేలా చేసినట్లయితే, ఇందులోని వక్రీభవన కిరణమే ప్లేన్ పొలరైజ్డ్ కాంతి.
దీనిని ప్లాస్టిక్ పలకల పొలరాయిడ్స్తో ఉత్పత్తి చేయవచ్చు. హెర్పథైట్ అనే పదార్థపు స్పటికాలతో ఈ పలకలు తయారవుతాయి. ఈ పదార్థాన్ని 1934లో అమెరికాకు చెందిన ఎడ్విన్ హెచ్. ల్యాండ్ తయారు చేసాడు. హెర్పథైట్ స్ఫటికాలను క్రమపద్ధతిలో వాటి కాంతి కోణం ఒక దానికొకటి సమానాంతరంగా ఉండేలా అమర్చి పొలరయిజ్ షీట్లను తయారు చేస్తారు. ఈ విధంగా తయారయిన షీట్లను పాడు కాకుండా రెండు గాజు పలకల మధ్య ఉంచుతారు. స్ఫటికాల అక్షం ఒక దానికి మరొకటి సమానాంతరంగా ఉండేలా అమరిస్తే, దానిగుండా ప్రవహించే కాంతి పొలరయిజు అవుతుంది. పలకలను లంబ కోణంలో ఉంచినట్లయితే ఎటువంటి కాంతిని వాటి నుండి బయటకు పోనీయవు.
ప్లేన్ పొలరైజ్డ్ కాంతిని మరో పద్ధతిలో కూడా వుత్పత్తి చేయవచ్చు. ఈ పరికరాన్ని నికాల్ ప్రిజమ్ అంటారు. స్పష్టమైన రెండు కాల్సైట్ పట్టకాలను ఉపయోగించి 'ప్రిజమ్'ను తయారు చేస్తారు. కెనడా బాల్సమ్ అనే పదార్థంలో ఈ రెండింటిని అతికిస్తారు. కాల్ సైట్ లోనికి కాంతి ప్రవేశించగానే రెండు కిరణలుగా విడిపోతుంది. ఈ రెండు కిరణలు పొలరయిజు చెందినవే. అవి కెనడా బాల్సమ్ను తాకగానే భిన్న భిన్నంగా ప్రవర్తిస్తాయి. ఒక కిరణం కెనడా బాల్సమ్ ద్వారా ప్రతి బింబిస్తుంది. రెండవది బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన కాంతిలో పొలరైజ్డ్ కాంతి గుణం ఉంటుంది.
నిత్యజీవితంలో పొలరైజ్డ్ కాంతి వలన అనేక ఉపయోగాలున్నాయి. సూర్య కిరణాల మెరుపు నుండి ఇది కాపాడుతుంది. సూర్మరశ్మి వేడిమిని తగ్గించటానికి పొలరైజ్డ్ పలకాలతో చలువ కళ్లజోళ్లు తయారవుతాయి. విమానాల కిటికీ అద్దాలను దీనితోనే తయారు చేస్తారు. కారు ముందు అద్దాలను కూడా ఈ పలకలతో చేస్తారు. రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాల కాంతి కళ్ళకు మిరుమిట్లు కొలుపకుండా యివి పని చేస్తాయి. పొలరాయిడ్ కెమెరా కూడా 'కాంతి పొలరయిజేషన్' సూత్రం ఆధారంగానే పని చేస్తుంది. ఈ కెమెరాతో కొన్ని నిమిషాల లోపుగానే నలుపు, తెలుపు లేక రంగుల ఫొటో తియ్యవచ్చు. త్రీ డైమన్షన్ సినిమాలకు పొలరాయిడ్ ఫిల్మ్‌లను వాడతారు. అనేక దృశ్య సంబంధమైన పరికరాలను నిర్మించటానికి, అనేక విజ్ఞానశాస్త్ర ప్రయోగాల పరికరాల తయారీలో ఈ సూత్రం ఉపయోగపడుతుంది.
Authorization