గబ్బిలాలు పక్షి జాతికి చెందినవి కావు. అంతేకాకుండా అవి తమ పిల్లలకు పాలిచ్చి పెంచే క్షీరదాలు. అవి ఎగరడానికి వీలు కల్పించే రెక్కలు రావడానికి కారణం, 50 మిలియన్ సంవత్సరాల క్రితం వాటి శరీరంలో ఉండే ఒక జన్యువు మార్పునకు గురికావడమే. ఈ జన్యుపరమైన పరివర్తన వల్ల గబ్బిలం శరీరానికి ఇరువైపులా పలుచని పొరల రూపంలో ఉండే అమరికలలోని కణుపులలాంటి ఎముకలు బాగా సాగి అవి రెక్కల రూపాన్ని సంతరించుకున్నాయి. గబ్బిలం దేహ నిర్మాణంలో ఏర్పడిన ఈ పరిపూర్ణమైన మార్పు దానిని నడిచే స్థాయి నుంచి ఎగిరే స్థాయికి తీసుకువచ్చింది. ప్రకృతిలో ఇలాంటి మార్పులు అతి తక్కువ కాలం వరకే జరగడం వల్ల గబ్బిలాలు క్షీరద జంతు జాతికి సంబంధించినప్పటికీ వాటికి రెక్కలు ఏర్పడి అవి ఎగరడానికి వీలయ్యింది. అంతేకాకుండా, గబ్బిలాలు పగటిపూట సరిగా చూడలేక పోవడం వల్ల ప్రకృతి వాటికి రెక్కలు కల్పించి శత్రువుల బారిన పడకుండా ఎక్కడో పాడుపడిన ఎత్తయిన భవనాల మీదో లేక ఎత్తయిన చెట్ల కొమ్మల నుంచో తలకిందులుగా వేలాడుతూ ఉండే సదుపాయం కల్పించిందని అనుకోవచ్చు.