మామూలు జిగురు, స్టిక్కీ టేపులు 'ఒత్తిడి' సూత్రంగా పనిచేసే జిగురుతో కూడిన అతుక్కొనే పదార్థాలు. ఇవి మెత్తగా ఉండి అసంజనం(వేరు వేరు అణువుల మధ్య ఉన్న ఆకర్షణ బలం) అనే బలం ఆధారంగా పని చేస్తుంటాయి. జిగురుతో అంటించిన కాగితాలను కొంత ఓపిక, నేర్పులతో వేరు చేయవచ్చు. అదే స్టిక్కీ టేపులను అంత సులభంగా కాగితం నుంచి వేరు చేయలేం. దీనికి కారణం ఆ టేపుల్లో ఉండే అసంజన కణాల కూర్పులో ఉండే తేడానే. స్టిక్కీ టేప్ విషయంలో అసంజన కణాలు పట్టీపై ఒక క్రమపద్ధతిలో కాకుండా అనియత (రాన్డం) పద్ధతిలో ఉండి అంటించే మరో తలంపై ఉండే కణాలపై ఆకర్షణ బలాన్ని ఆ తలం మొత్తం పొడుగు వెంట ప్రతిభావంతంగా ప్రదర్శిస్తాయి. ఈ ఆకర్షణ బలం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, టేపును కాగితంపై అంటించిన కొంత సేపటికి లాగితే, అది కాగితం పోగులను తనతోపాటు లాక్కొస్తుంది. టేపు కాగితాన్ని అంటుకున్నప్పుడు అతి చిన్న గాలి బుడగలు వాటి మధ్య ఏర్పడి, టేపును లాగేసినప్పుడు ఆ బుడగల పరిమాణం పెరిగి బుడగలలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ పీడనాన్ని అధిగమించడానికి కొంత బలం ఉపయోగించాల్సి వస్తుంది. అదే మామూలు జిగురు విషయంలో జిగురు, కాగితాల మధ్య సంపర్కం (స్పర్శ) ఉన్న చోటే జిగురు బుడగలు గుండ్రంగా ఏర్పడటంతో ఆ నియమిత ప్రదేశాల్లోనే అసంజన బలాలు పని చేస్తుంటాయి. అందువల్ల జిగురుతో అంటించిన స్థలాలను సులభంగా వేరు చేయవచ్చు.
Authorization