పిల్లలూ... మీ అందరికీ సొంతూరు ఉంటుంది కదూ. అయితే పిల్లులకు కూడా ఓ ఊరుందంటా..! ఈ విషయం మీకు తెలుసా? ఏంటి తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకోండీ...
అనగనగా ఓ పట్టణం. క్యాట్ సిటీ అని దాని పేరు. ఆ ఊరి నిండా ఎక్కడ చూసినా పిల్లులే కనిపిస్తాయి. అయితే అవన్నీ ప్రాణమున్నవి కావు, నిలువెత్తు పిల్లుల శిల్పాలు. ఆ ఊళ్ళో ఉద్యాన వనాలు, కూడళ్లు, రహదారుల పక్కన ఎక్కడ పడితే అక్కడ మ్యావ్ మ్యావ్ల రూపాలే. అంతే కాదు... ఆ వూరిలో పిల్లుల రెస్టారెంట్, మార్జాలాల మ్యూజియంతో పాటు పిల్లి పేరుతో రేడియో ఎఫ్ఎం కూడా ఉన్నాయంటా..! చదువుతుంటేనే భలే గమ్మత్తుగా ఉంది కదూ. ఏంటీ మీకూ చూడాలనిపిస్తుందా? కానీ ఆ ఊరు మన ఊరికి చాలా దూరంగా ఉంది. ప్రస్తుతానికి పిల్లుల ఊరు గురించి చదవండి. వీలైతే ఎప్పుడైనా చూసిరావొచ్చు.
ఇంతకీ ఊరూ ఎక్కడుంటుందో చెప్పలేదు కదూ..? మలేషియాలోని సరవక్లో ఉంటుందీవూరు. ఈ పట్టణానికే కుచింగ్ అనే మరో పేరు కూడా ఉంది. కుచింగ్ అంటే మయన్ భాషలో పిల్లి అని అర్ధమంటా.ఇక్కడి మ్యూజియంలో దాదాపు నాలుగు వేలకుపైగా పిల్లుల బొమ్మలు, కళాకృతులు, వాటి ప్రాచీన ఈజిప్షియన్ చిత్రలేఖనాలు, వస్తువులూ ఉంటాయి.
ఇంతకీ ఈ ఊరికీ పిల్లులకూ సంబంధం ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారు కదూ..! అక్కడికే వస్తున్నా... అసలు సంగతేంటంటే1950లో ఈ ప్రాంతమంతా మలేరియా సోకి జనాలు అవస్థలు పడ్డారు. ఈ వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడ్డానికి అధికారులు డీడీటీ అనే మందును వాడారు. ఈ మందు మలేరియాను వ్యాప్తి చేసే దోమలతో పాటు ఇక్కడి పిల్లుల ప్రాణాలను కూడా తీసేసింది. దీంతో ఇక్కడ ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. కొంత కాలానికి ఈ ఎలుకలు ప్లేగు వ్యాధికి కారణమయ్యాయి. దీంతో 14 వేల పిల్లుల్ని 'ఆపరేషన్ క్యాట్ డ్రాప్' పేరుతో తీసుకొచ్చి సమస్యను పరిష్కరించారట. అలా అవి చేసిన సాయానికి గుర్తుగా వాటిని అభిమానిస్తూ ఇలా పిల్లుల ఊరిగా దాన్ని గుర్తుపెట్టేసుకున్నారు అక్కడి ప్రజలు. ఇదర్రా అసలు సంగతి.
Authorization