చిన్నతనంలో ఆడిన ఆటలు గుర్తుకొస్తే చాలు మది పులకరించిపోతుంది. ఈ ఆధునిక యుగంలో మన గ్రామీణ క్రీడల గురించి చాలామంది పిల్లలకు తెలియదు. కనీసం ఈ వేసవి సెలవుల్లోనైనా పిల్లలకు ఈ క్రీడలను పరిచయం చేద్దామా!
చతురంగ
మనం ఇప్పుడు చూస్తున్న చెస్ (చదరంగం) ఆటకు పురాతన రూపమే చతురంగ. ఇది మన దేశంలో ఆరవ శతాబ్దంలో ఆవిర్బవించింది. చతురంగ అంటే నాలుగు అంగాలు అని అర్థం. ఈ అంగాలను పురాతన భారత సైన్యంలో నాలుగు విభాగాలైన సైన్యానికి నమూనాలుగా భావించేవారు. రెండు రాజ్యాలకు చెందిన సైన్యాలు రెండు భాగాలుగా విడిపోయి యుద్ధం చేసినట్టుగా ఆట ఆడేవారు. ఈ ఆటలోని ప్రధాన ఉద్దేశం ఎదుటి రాజ్యంలోని రాజును బంధించడం. ఈ ఆటను పాచికలు ఉపయోగించి ఆడతారు. ఈ ఆట కేవలం ఆనందం కోసమే కాకుండా మేధా శక్తి పెరగడానికి, వ్యూహాత్మకంగా ఆలోచించడానికి, ఏకాగ్రతకు కూడా ఉపయోగపడుతుంది.
గిల్లి దండ
గిల్లి దండ ఆటకు 2500 ఏండ్ల చరిత్ర ఉంది. గిల్లి అంటే చిన్న కర్ర. దండ అంటే అటుఇటుగా బ్యాటు సైజులో ఉండే సన్నని కర్ర. క్రికెట్ పిచ్ మాదిరిగా అక్కడా ఓ సర్కిల్ ఉంటుంది. ఆటగాడు ఆ వృత్తంలో నిలబడి దండ సహాయంతో గిల్లి చివర కొడితే అది గాల్లోకి లేస్తుంది. అప్పుడు గిల్లిని దూరంగా కొడతారు. ఆ గిల్లిని ప్రత్యర్తి వృత్తంలో విసిరేలోగా ఆటగాడు వృత్తం బయట ఉన్న నిర్దేశిత పాయింటు చేరాలి. లేదంటే ఔట్.. ఇది చూడ్డానికి భలే ఉంటుందిలే.
గులెర్
గ్రామీణ ప్రాంతాలో దీన్నే ఉండేలు అని అంటారు. ఇంగ్లీషులో దీని పేరు స్లింగ్షాట్. వై ఆకారంలో తయారు చేసిన చిన్న కర్రతో దీన్ని తయారు చేస్తారు. ఈ కర్ర పై భాగంలో సాగు గుణం ఉన్న మన్నికైన రబ్బరును కడతారు. ఈ రబ్బరు మధ్యలో గట్టి తోలుతో కడతారు. ఈ కర్ర కింది భాగాన్ని ఒక చేత్తో పట్టుకొని రబ్బరు మధ్యలో ఒక చిన్న రాయిని ఉంచి లాగి వదలడం వల్ల దూరంగా వెళుతుంది. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో చెట్టుకున్న కాయల్ని కొట్టడానికి, రైతులు అయితే చేలల్లోకి వచ్చిన పక్షులను, కోతులను తరమడానికి ఉపయోగిస్తారు.
పచ్చీస్
రకరకాల పేర్లతో పిలిచే ఈ ఆట గ్రామీణ ప్రాంతాల్లో ఫేమస్. గవ్వలు, రంగురంగుల కాయలతో గంటల తరబడి ఆడినా బోర్ కొట్టని ఆట. పచ్చీస్ ఆట మాత్రం ప్రాచీనకాలం నుంచే ఉంది. ఈ ఆట కాకతీయ యుగం నుంచే ఉన్నట్టు చరిత్ర చెబుతున్నది. క్రీ.శ. 1050 -1350 మధ్యకాలం నుండే ఈ ఆట ఆడినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ పచ్చీస్ ఆటను ఇద్దరు కాని, నలుగురు గాని ఆడవచ్చు. నలుగురు ఎవరికి వారు విడివిడిగా ఆడే దానికన్నా ఇద్దరిద్దరు రెండు జట్లుగా ఏర్పడి ఆడితే ఆట మరింత ఉత్తేజకరంగా, ఉద్రేక భరితంగా సాగుతుంది. ఈ ఆటలను ఆడటానికి గవ్వలు, క్రాస్ ఆకారంలో ఉన్న చార్ట్ ఉంటే చాలు.
Authorization