ఆస్ట్రేలియా దేశంలో చాలా భాగం ఎడారే. చిన్నవీ, పెద్దవీ కలిపి ఇక్కడ మొత్తం పది ఏడారులున్నాయి. వాటిలో గ్రేట్ విక్టోరియా చాలా పెద్దది. ప్రపంచ పటంలో భూమధ్యరేఖకు 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యలో ఎడారులు కనిపిస్తాయి. ఆస్ట్రేలియా కూడా పది డిగ్రీల నుంచి 45 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్యలోనే ఉంది. అందుకే అక్కడ అంత ఎడారి. కానీ ఇదే అక్షాంశాల మీద ఆస్ట్రేలియాకి తూర్పువైపు మాత్రం ఎడారి లేదు. ఎందుకో తెలుసా? తూర్పు తీరంలో గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలున్నాయి. పర్వతాలు మేఘాలకు అడ్డుపడి అక్కడే వర్షం ఎక్కువగా కురుస్తుంది కదా! అదన్నమాట సంగతి. అడవులు కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎడారి అంత ఎక్కువగా ఉన్నా వ్యాపారం పరంగా ఆస్ట్రేలియా బాగా అభివృద్ధి చెంది ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. మనకి డిసెంబరు, జనవరి నెలల్లో బాగా చలి ఉంటుంది కదా. ఆ సమయంలో ఆస్ట్రేలియా లో భయంకరమైన ఎండలుంటాయి. ఈసారి ఎండలు మరీ మండిపోయి అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరింది.