ఊసరవెల్లి అనగానే రంగులు మార్చేదని అందరికి తెలుసు. కేవలం రంగులు ఒక్కటే మారడం కాదు మరిన్నీ ప్రత్యేకమైన లక్షణాలున్నాయి. వింతగా వేటాడే నైపుణ్యం ఉంది? చిన్నజీవులపైకి చటుక్కున నాలుకను విసిరి మెరుపు వేగంతో నోట్లోకి లాగేసుకుంటుంది? వంటి అద్భుతమైన గుణాలను కలిగి ఉంది. ఈ లక్షణాల గురించి తెలుసుకోవడానికి కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దాంతో దాని వేట రహస్యం తెలిసిపోయింది.
- చూడ్డానికి తొండలాగే కనిపించే ఊసరవెల్లి నాలుక దాని శరీరం కన్నా రెండు రెట్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది.
- ఆహారం చూడగానే ఊసరవెల్లి నోట్లో లాలాజలం వూరుతుంది. అయితే దాని లాలాజలం చాలా జిగటగా ఉంటుందట. మన నోట్లోని లాలాజలం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ చిక్కగా ఉంటుంది. నాలుక మీద ఉండే ఆ జిగురులాంటి లాలాజలానికే జీవులు లటుక్కున అతుక్కు పోతాయన్నమాట.
- మాటు వేసి వేటాడటంలో అది ఎంతో ఓపిగ్గా ఉంటుంది. అందుకే దాన్ని 'సిట్ అండ్ వెయిట్ ప్రెడేటర్' అని పిలుస్తారు.
- ఊసరవెల్లి శరీరం లోపలి చర్మ కణాల చుట్టూ ఉండే అతి సూక్ష్మ స్ఫటికాలైన 'ఇరిడోఫోర్స్' ప్రభావం వల్లే వీటి శరీరంలోని రంగుల్లో మార్పులు వస్తాయి. ఇవి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ స్ఫటికాలు దగ్గరగా ఉంటాయి. అప్పుడు నీలం, ఆకుపచ్చ రంగుల్లోకి మారుతాయి. కాస్త ఒత్తిడికి గురైనప్పుడు స్ఫటికాలు దూరంగా వెళతాయి. అప్పుడు పసుపు, కాషాయం, ఎరుపు రంగులు శరీరంపై క్రమంగా ఏర్పడుతుంటాయి. అందుకే ఊసరవెల్లి రంగులు మార్చే జీవి అయింది.
- ఇది తల తిప్పకుండానే కళ్లను 360 డిగ్రీలు తిప్పగలదు. ప్రపంచ వ్యాప్తంగా ఊసరవెల్లుల్లో 202 జాతులున్నాయి. అతిచిన్న ఊసరవెల్లి 'బ్రుకుసియా మిక్రా' ఇది కేవలం అర అంగుళమంత ఉంటుందంతే. అతిపెద్దది 'ఫర్సిఫర్ ఔస్టలేటీ'. ఇది 30 అంగుళాల పొడవుంటుంది.
Authorization