హాయ్ చిన్నారులూ! మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెబుతారా! చెబుతాం. ఏటీఎమ్‌లో ఏముంటాయి? డబ్బులుంటాయి. డబ్బులు బయటకు ఎలా వస్తాయి? బ్యాంక్ డెబిట్ కార్డు పెట్టగానే డబ్బులు బయటకు వస్తాయి. పిల్లలూ చాలా బాగా సమాధానాలు చెప్పారు ! ఇవాళ మీకో కొత్త విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఏటీఎమ్ అనగానే డబ్బులే గుర్తుకొస్తాయి. కానీ కొత్తరకం ఏటీఎమ్‌లో నోట్లు పెడితే నీళ్లు, శీతల పానీయాల బాటిళ్లు వస్తాయి. మరో తరహా ఏటీఎమ్‌లో నోట్లు పెట్టగానే చిల్లర నాణాలు వస్తాయి. మరి కొత్తగా వస్తున్న ఏటీఎమ్‌లో మాత్రం ఉచిత మందులు వస్తాయి. మందు గోళీలిచ్చే ఈ ఎటిఎమ్‌లను మధ్యప్రదేశ్‌లో త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఆ ఏటీఎమ్‌ల గురించి తెలుసుకుందామా.
మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ త్వరలో ఆటోమేటేడ్ మెడిసెన్ డిస్పెన్సింగ్ మెషీన్(అఖీ)లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇది చూడటానికి ఎటిఎమ్లానే ఉంటుంది. మందుల చీటి (ప్రిస్కిప్షన్) ని అనుసరించి అది మందులు ఇస్తుంది. ఈ ఏటీఎమ్‌లను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి మధ్యప్రదేశ్ రాజధానికి దగ్గర్లో ఉన్న బేతుల్ జిల్లాలోని ఐదు గ్రామాలను ఎంచుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఏటీఎమ్‌ల్లో ప్రాథమిక జనరిక్ మందులు (బేసిక్ జనరిక్ డ్రగ్స్) మాత్రమే ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే పరికరం కూడా ఈ మెషిన్లోనే ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేసే విధానాన్ని తెలపడానికి శిక్షణ పొందిన ఉద్యోగి మెషిన్ దగ్గర ఉంటాడు. మెషిన్ దగ్గరకు వచ్చిన పేషెంట్ పల్స్, బ్లడ్ ప్రెషర్లను మెషిన్ మొదటగా చెక్ చేస్తుంది.హెల్త్‌కేర్ ఉద్యోగి ఆ పేషెంట్‌ను టెలీ మెడిసిన్ డాక్డర్తో అనుసంధానిస్తాడు. డాక్టర్ అతని పేరును రిజిస్టర్ చేసుకుని డయాగ్నోసిస్ చేస్తాడు. వ్యాధి లక్షణాలను బట్టి పేషెంట్‌కు మందులు రాస్తాడు. వెంటనే ఆటోమేటేడ్ మెషిన్లో ఆ మందులు వస్తాయి. సెంట్రల్ మెడికల్ సర్వీస్ సోసైటీ(సీఎమ్ఎసఎస్), సెంట్రల్ ప్రొక్యుర్‌మెంట్ ఏజెన్సీ(సీపీఏ)లు ఈ పథకంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని 600కుపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ), 25కు పైగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్‌సీ) ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో ఉండటం లేదని అంచనా. మారుమూల గ్రామాల ప్రజలకు వైద్యం అందడం గగనమే. ఇలాంటి మారుమూల ప్రాంతాలకు, పల్లెలకు ఈ ఏటీఎమ్‌లు కేటాయించడం వల్ల అక్కడి ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు ఈ ఏటీఎమ్ వినియోగించుకున్న ప్రతి పేషెంట్ డాటా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. దీని వల్ల పేషెంట్‌కు మరింత ఉపయోగం ఉంటుంది. మన దేశంలోని అన్ని మారుమూల గ్రామాల్లో, ఇతర ప్రాంతాల్లో త్వరలో ఇలాంటి మెషీన్లు అందుబాటులోకి రావాలని కోరుకుందాం...
Authorization