హాయ్ చిన్నారులూ! ఆడుకునే వయసులో పది మందికి ఆసరాగా నిలవడమంటే ఆశ్చర్యమే. తన ఆలనాపాలనే ఎవరో ఒకరు చూసే వయసులో ఇతరులకు సహాయం చేస్తూ... నిలువ నీడ లేని వారికి ఆశ్రయం కల్పిస్తున్నది ఓ తొమ్మిదేళ్ల చిన్నారి.. చిన్న వయసులోనే పెద్ద మనసుతో అందరి మనుసులు దోచుకుంటుంది. ఐదేళ్ల ప్రాయంలోనే సేవా దృక్పథాన్ని అలవరుచుకుని ముందుకు సాగుతున్న 'హేలే ఫోర్ట్' గురించి తెలుసుకుందాం....
అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన హేలే ఐదేండ్ల వయసులో రోడ్డుపై పడుకున్న ఒక వ్యక్తిని చూసి చలించి పోయింది. ఆ వ్యక్తికి ఏదో విధంగా సాయం చేయాలనుకుంది. హేలీ మొదటగా ఈ వ్యక్తికి సాండ్విచ్ కొని ఇచ్చింది. ఆలోచించి.. ఆలోచించి చివరగా ఒక నిర్ణయానికి వచ్చింది. రోడ్డు పక్కన నివసించే వారి కోసం మొబైల్ షెల్టర్స్ని తనే స్వయంగా తయారు చేసి వారికి ఇవ్వాలనుకుంది. ఆ క్షణం నుంచే తన పనిని మొదలు పెట్టి స్వయంగా ఒక మొబైల్ షెల్టర్ని నిర్మించింది. దాన్ని రోడ్డుపై నివసిస్తున్న ఎడ్వర్డ్ అనే వ్యక్తికి ఇచ్చింది. తను చదువుకుంటూనే ఖాళీ సమయం చిక్కినప్పుడల్లా ఇలా వారి కోసం మొబైల్ షెల్టర్స్ని నిర్మిస్తుంది. ఈ సంవత్సరం చివరికల్లా 12 మొబైల్ షెల్టర్స్ నిర్మించడమే లక్ష్యంగా హేలే పని చేస్తుంది. అంతేకాదు వారి కోసం కూరగాయాల్ని, ఆహార ధాన్యాల్ని స్వయంగా పండిస్తుంది. వారి ఇతరత్రా అవసరాల కోసం నిధులు కూడా సేకరిస్తోంది.
ఈ సంవత్సరం చివరి వరకు హేలే 120 కిలోల ఆహార ధాన్యాలను, 230 కిలోల కూరగాయాలను, పండ్లను పండించాలనుకుంటోంది. తను పండించే విధానాలను తెలుపుతూ ఫేస్బుక్ పేజీని తెరిచి అందులో వివరిస్తోంది. స్త్రీల ఆరోగ్యానికి, పరిశుద్ధతకు సంబంధించిన 500 పైగా వస్తువులను సేకరించింది. చలి, వర్షాలను తట్టుకునేందుకు వీలుగా వారి కోసం రెయిన్ కోట్లను తయారు చేయిస్తుంది. 1000కి పైగా టాయిలెట్రీ వస్తువులను వారి కోసం సమకూర్చే పనిలో ఉంది. మనుసున్న వారు ఎవరైనా ఈ సేవా కార్యక్రమంలో భాగం కావచ్చునని, ఈ పనుల కోసం స్వచ్ఛందంగా నిధులు అందజేయాలనుకునే వారు ఇవ్వొచ్చనని హేలే అంటోంది. హేలీ ఫేస్బుక్ పేజి లో విరాళాలు ఎలా, ఎవరికి పంపించాలో సవివరంగా ఉన్నాయి. ఇప్పటికే హేలే చేస్తున్న పనులను అభినందిస్తూ.. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. నిరాశ్రయులంతా తన స్నేహితులేనని చెప్పే హేలే భవిష్యత్తులో మరింత మందికి భవిష్యత్తును, చేయూతను అందివ్వాలని మనసారా మనమూ కోరుకుందాం...
Authorization