చిన్నారులూ.. మనం ఇంట్లో తరచుగా గాజు వస్తువులను వాడుతూనే ఉంటాం. మరి ఆ గాజు ఎలా తయారవుతుందనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా..? మనం ఏ వస్తువును చూసినా దాని ముడిసరుకు ఏమై ఉంటుందనేది మన ఊహకు తేలిగ్గానే అందుతుంది. కానీ గాజు విషయంలో అది కొంచెం కష్టమే. గాజును తెల్లటి మెత్తటి ఇసుకతో చేస్తారు. దీనిని సిలికా సాండ్ అంటారు. సిలికా సాండ్కు సున్నపురాయి, సోడాయాష్, కొన్ని రసాయనాలను కలిపి బట్టీలో 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మరిగిస్తారు. పైన చెప్పిన పదార్థాలన్నీ వేడికి కరిగి చిక్కటి ద్రవంగా మారుతాయి. ఆ ద్రవాన్ని అచ్చులో పోసి చల్లబరుస్తారు. సీసా కానీ, పళ్లెం కానీ.. మౌల్డ్ ఆకారం, పరిమాణాలను బట్టి రూపుదిద్దుకుంటుంది. నీరు మరగడానికి వంద డిగ్రీల ఉష్ణోగ్రత చాలు. అలాంటిది గాజు తయారుకావాలంటే పదిహేను రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత వాడాలన్నమాట. రంగుల సీసాలు కావాలంటే కలర్ పిగ్మెంట్స్ను కలుపుతారు.