చిన్నారులూ.. మనకు ఎదురుగా ఓ కారు వచ్చిందనుకోండి... ఏం చేస్తాం? వెంటనే పక్కకు జరుగుతాం! ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడానికి అలా చేస్తాం. అలానే శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఓ పీత ఎంచక్కా ఎంతో అందంగా ముస్తాబవుతుంది. అందుకే ఆ పీతను డెకరేటివ్ క్రాబ్ అంటారు. ఆ విశేషాలే ఈరోజు మనం తెలుసుకుందాం...!
- పండగలో వేడుకలో వస్తే మనం ఎంచక్కా తయారవుతాం. కొత్త దుస్తులు, నగలు ధరిస్తాం. ఇందులో చిత్రమేమీ లేదు. ఇదే పని ఓ పీత చేస్తే? ఎంతో ఆశ్చర్యం. అంటే ఫ్యాషన్ మనకే కాదు దీనికీ తెలుసన్నమాట. అందుకే మరి దానికి డెకరేటివ్ క్రాబ్ అనే పేరు వచ్చింది.
- అన్ని జీవజాతుల్లోకి డెకొరేటివ్ పీతనే చాలా అందంగా రెడీ అవుతుందని ఓ అధ్యయనంలో తేల్చారు. డెకొరేటివ్ పీతలు 'మజోరుడియా' అనే కుటుంబానికి చెందినవి. మజోరుడియా కుటుంబంలో 900 రకాల జాతులుండగా అందులో 400 జాతుల పీతలు అందంగా ముస్తాబవుతాయి.
- అయితే ఈ పీత ఇలా అలంకరించుకోవడం అందం కోసం కాదు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం. శత్రుజీవుల దృష్టిని ఏమార్చడం కోసమే ఇది ఇలా చేస్తుంది. పరిసరాల రంగుల్లో కలిసిపోయే వస్తువుల్ని కనుగొని శరీరమంతా అతికించుకుంటుంది. అలా ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది.
- స్పాంజి, కోరల్స్, సముద్రపు పాచి, నాచు, చిన్న చిన్న రాళ్లు, రకరకాల మొక్కల్ని శరీరంపై అతికించు కుంటూ అది తన రూపాన్నే మార్చేసు కుంటుంది. మరి అతికించుకున్న వస్తువులన్నీ కిందపడిపోవా అంటే..? సుమారు రెండు అంగుళాల పొడవుండే ఈ పీత వెనుకభాగం లో కవచం లాంటి గుల్లతో పాటు ఒంపులు తిరిగిన కొక్కాల్లాంటి వెంట్రుకలు ఉంటాయి. ఇవి పీత అతికించుకున్న వస్తువులు పడిపోకుండా ఉపయోగపడతాయి.
- వీటి కంటిచూపు చాలా చురుగ్గా ఉంటుంది. దూరం నుంచే శత్రువులను ఇవి కనిపెడతాయి. చేపలు, ఆక్టోపస్‌లు వీటికి ప్రధాన శత్రువులు. అంతేకాదు ఒకవేళ శత్రువులు డెకొరేటివ్ పీతలను గమనించినా అవి తినకుండా ఉండేందుకు విషపూరితమైన అలంకార వస్తువులను ఎంపిక చేసుకుంటాయి.
- ఇవి చూడటానికి సాలెపురుగుల్లా ఉంటాయి. అందుకే వీటిని 'స్పైడర్ క్రాబ్' అని కూడా అంటారు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. చిన్న చిన్న చేపలను, నత్తలను తింటాయి. ఇవి ఒకే చోట కదలకుండా గంటల తరబడి ఉంటాయి.
- విలియం బేట్సన్ అనే పర్యావరణవేత్త 1889 లో తొలిసారిగా డెకొరేటివ్ పీతలను చూశాడు. అవి ఎలా అలంకరించుకుంటున్నాయో గమనించి ప్రపంచానికి పరిచయం చేశాడు.
Authorization